టార్గెట్ 2300 కోట్లు!
ABN , First Publish Date - 2022-06-28T08:33:57+05:30 IST
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించడం ద్వారా, నగర శివారులోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్లో...

పోచారం ఫ్లాట్ల లాటరీ విజయవంతం
పారదర్శకంగా నిర్వహించిన హెచ్ఎండీఏ
నేడు, రేపు బండ్లగూడ ఫ్లాట్లకు లాటరీ
2 చోట్ల 900 కోట్లు సమకూరే అవకాశం
మరిన్నిచోట్ల ఫ్లాట్లు, ప్లాట్ల అమ్మకానికి సిద్ధం
త్వరలోజవహర్నగర్ ఫ్లాట్లకు నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీ, జూన్27 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించడం ద్వారా, నగర శివారులోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్లో ఈ-వేలం వేయడం ద్వారా రూ.2,300 కోట్ల ఆదాయం సమకూరుతుందని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్ల కోసం నగరవాసుల నుంచి అనూహ్యమైన స్పందన రావడం అధికార వర్గాల్లో రెట్టింపు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో త్వరలోనే నగర శివారులోని గాజులరామారం, జవహర్‌నగర్‌లో గల రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన 3,786 ఫ్లాట్లను విక్రయించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన తొర్రుర్, తుర్కయాంజల్, బహదూర్‌పల్లి ఓపెన్ ప్లాట్లను ఈ నెల 30వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ-వేలం వేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాలో ఇళ్లు, ఓపెన్ ప్లాట్స్, భూముల విక్రయంలో హెచ్ఎండీఏ కీలకంగా మారింది. గడిచిన రెండేళ్ల కాలంలో ఉప్పల్ భగాయత్, కోకాపేట, తొర్రుర్, బహదూర్‌పల్లిలో విడతల వారీగా స్థలాలను ఆన్లైన్లో విక్రయించి సుమారు రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్జించింది. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాలో కూడా రాజీవ్ స్వగృహ చేపట్టిన లేఅవుట్లలోని ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించింది. ప్రస్తుతం పోచారం, బండ్లగూడలోని 3,716 ఫ్లాట్లను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోంది. వీటి అలాట్మెంట్ ద్వారా రూ.900 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. పోచారంలోని 1,470 ఫ్లాట్ల ద్వారా రూ.400 కోట్లకు పైగా ఆదాయం వస్తుండగా, బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల ద్వారా రూ.500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. తుర్కయాంజల్‌లో కేవలం డెవలపర్లు, నిర్మాణ సంస్థలకు ప్రత్యేకంగా పది ఎకరాలకు పైగా విస్తీర్ణంలో లేఅవుట్‌ను రూపొందించారు. చదరపు గజానికి రూ.40 వేలు అప్సెట్ ధర నిర్ణయించారు. బహదూర్‌పల్లిలో అప్సెట్ ధర రూ.25 వేలు పెట్టారు. తొర్రుర్‌లో రూ.20 వేలుగా నిర్ణయించారు. ఈ నెల 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ-వేలం సాగుతుంది. రూ.600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. జవహర్‌నగర్, గాజులరామారంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. జవహర్‌నగర్‌లో 2,890 ఫ్లాట్లు, గాజులరామారంలో 896 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని కూడా లాటరీ పద్దతిలో విక్రయించేందుకు దరఖాస్తులు ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇక్కడ ఫ్లాట్ల విక్రయం ద్వారా రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అమ్మకం ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి చేరనుండగా, అందులో 2 శాతం మాత్రమే హెచ్ఎండీఏ ఖాతాలో చేరనుంది.
చిట్టీల పద్ధతిలోనే డ్రా
బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి భారీగా దరఖాస్తులు రావడంతో చిట్టీల పద్ధతిలోలక్కీ డ్రా నిర్వహించారు. పోచారం ఫ్లాట్లకు సోమవారం డ్రా తీశారు. ఇదే పద్ధతిలో మంగళ, బుధవారాల్లో బండ్లగూడ ఫ్లాట్లకు లాటరీ తీస్తారు. సోమవారం జరిగిన లక్కీ డ్రా పూర్తిగా ఎన్నికల కౌంటింగ్‌ను తలపించింది. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన లక్కీ డ్రాలో ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పూర్తి పారదర్శకతతో చేపట్టారు. మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డింగ్‌తో పాటు లైవ్ ప్రసారం చేశారు. లాటరీలో రెండు ఇళ్లు పొందిన వ్యక్తికి రెండో ఇంటిని నిరాకరించారు. ఒకే ఆధార్ నంబరు ఉండటంతో ఈ వ్యవహారం బయట పడింది. స్వగృహ ఫ్లాట్లలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల కోసం ప్రాంగణంలోనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని స్పెషల్ సీఎస్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వీంద్కుమార్ తెలిపారు. డబ్బులన్నీ చెల్లించిన తర్వాతే ఫ్లాట్ అప్పగిస్తామని, ఫ్లాట్ దక్కినవారు పది శాతం చెల్లింపులు చేస్తే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు చేసుకోవచ్చని చెప్పారు.