తుఫాను గండం

ABN , First Publish Date - 2022-10-17T08:35:05+05:30 IST

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో

తుఫాను గండం

  • 18-20 తేదీల్లో అండమాన్‌ పరిసరాల్లో అల్పపీడనం
  • వాయుగుండంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశాలు
  • రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలే
  • తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం

హైదరాబాద్‌, విశాఖపట్నం అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌లో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా కోస్తాకు తుఫాన్‌ గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 18-20 తేదీల మధ్య అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఏర్పడనున్న అల్పపీడనం అనంతరం వాయుగుండంగా, తుఫాన్‌గా బలపడి ఈ నెల 22 తర్వాత కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌ సముద్రంలో ఉన్న వాయుగుండం థాయ్‌లాండ్‌ మీదుగా ఈనెల 18కల్లా ఉత్తర అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించి ఉపరితల ఆవర్తనంగా మారనుంది. 


దీని ప్రభావంతో ఈనెల 20వ తేదీకల్లా ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా మారి ఈనెల 22 లేదా 23న కోస్తా తీరం దిశగా వస్తుందని కొన్ని మోడల్స్‌ అంచనా వేశాయి. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 17న ఉపరితల ఆవర్తనం ఆవరించి దాని ప్రభావంతో 18న అల్పపీడనం ఏర్పడనుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈనెల 21-23 మధ్య దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం దిశగా పయనిస్తుందని పేర్కొంది. ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనావేసింది. కాగా ఈనెల 19 లేదా 20న తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం 22కల్లా దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారి కోస్తా తీరం దిశగా రానుందని ఇస్రో వాతావరణ నిపుణుడు వివరించారు. అయితే తుఫాన్‌ దిశపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుందన్నారు. 


ఆగని వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో వానలు  ఆగడం లేదు. శనివారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌లోనైతే కుంభవృష్టి కురిసింది. శనివారం రాత్రి 12:30 తర్వాత ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. శేరిలింగంపల్లి గచ్చిబౌలిలో అత్యధికంగా 5.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆదివారం ఉదయం పలు ప్రాంతా ల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉప్పల్‌ రామాంతాపూర్‌లో 1.6 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 1.1 సెం.మీ వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముదాకా వర్షం పడింది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో 3.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదేపనిగా వర్షాలు పడుతుండటంతో వేరుశనగ విత్తిన వెంటనే వర్షం పడటంతో మొలకెత్తలేదని.. ఫలితంగా మళ్లీ విత్తనాలు నాటుకోవాల్సి వస్తోందని, పత్తి చేలల్లో వరద నీటితో పంటంతా పాడై పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరు వు నీటి మట్టం పెరిగి అలుగు పోస్తుండటంతో ఆ నీరంతా నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపైకి పోటెత్తింది. ఆ తాకిడి రోడ్డుకు కల్వర్టు గోడ కూలిపోవడంతో ప్రమాదకరంగా మారింది. మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం నర్సాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని బెజ్జూలకు చెందిన సాయి కుమార్‌ (23) పిడుగుపాటుతో మృతి చెందాడు. 


శ్రీశైలానికి నిలకడగా వరద

 శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.01 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 9 గేట్ల ద్వారా 3.16 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3,79,771 కూసెక్కుల నీరు వస్తుంటే 4,28005 క్యూసెక్కులు వెళ్తోంది. ఆల్మట్టికి 87,427, నారాయణపూర్‌కు 75,807, జూరాలకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. కాగా, శ్రీశైలం నుంచి వరద భారీగా ఉండటంతో సాగర్‌ వద్ద లాంచీలను నిలిపివేశారు. మరోవైపు మేడిగడ్డలోకి 3.05లక్షల క్యూసెక్కుల నీరువస్తోంది. 

Updated Date - 2022-10-17T08:35:05+05:30 IST