దారి తప్పిన కారు

ABN , First Publish Date - 2022-09-19T07:31:54+05:30 IST

టీఆర్‌ఎస్‌ కారు దారి తప్పుతోందా? ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడి చేయడమే స్వభావంగా ఉన్న గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అంటే..

దారి తప్పిన కారు

తమ పార్టీ అజెండాలోకే ఇతర పార్టీలు వచ్చేలా టీఆర్‌ఎస్‌ గత రాజకీయం

తెలంగాణ ఉద్యమం నుంచి.. అధికారంలోకి వచ్చాక 8 ఏళ్లుగా అదే ఒరవడి

ఇప్పుడు రూటు మార్చి బీజేపీ అజెండాలోకి.. పోటాపోటీగా కార్యక్రమాలు

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, సెప్టెంబరు 17 నిర్వహణ ఆ కోవలేనివే

ట్రాక్‌ మారకపోతే ఇబ్బందేనన్న ఆందోళనతోనే! 

అనివార్య పరిస్థితులు కల్పిస్తున్న కమలనాథులు


హైదరాబాద్‌, సెప్టెంబరు (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ కారు దారి తప్పుతోందా? ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడి చేయడమే స్వభావంగా ఉన్న గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అంటే.. అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. గతంలో ఏ అంశంపైనైనా టీఆర్‌ఎస్‌ ఒక అజెండాను సెట్‌ చేస్తే.. ఇతర అన్ని రాజకీయ పార్టీలూ అదే అజెండాలోకి రావాల్సిందే అన్నట్లుగా పరిస్థితి ఉండగా, ఇప్పుడు బీజేపీ సెట్‌ చేస్తున్న అజెండాలోకి టీఆర్‌ఎస్‌ వెళుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జరిగిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, సెప్టెంబరు 17 సంబురాలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఈ రెండు ఉత్సవాల నిర్వహణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. సీఎం కేసీఆర్‌ దానిని అనుసరించారని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో పోటీపడి నిర్వహించి తనదే పైచేయి అని నిరూపించుకోవాలని కేసీఆర్‌ ప్రయత్నించినా.. ఆ క్రమంలో ఆయన కమలనాథుల అజెండాలోకి వెళ్లారని చెబుతున్నారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం నుంచి, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత కొన్నాళ్ల వరకూ టీఆర్‌ఎస్‌ సెట్‌ చేసిందే రాజకీయ పార్టీలన్నింటికీ అజెండాగా ఉండేది. సీఎం కేసీఆర్‌ ఏ ట్రాక్‌లో వెళ్తే.. ప్రత్యర్థి పార్టీలు కూడా అదే మార్గాన్ని అనుసరించాల్సి వచ్చేది. విపక్షాలు ఏవైనా కొత్త అంశాలను లేవనెత్తినా.. కేసీఆర్‌ సెట్‌ చేసే అజెండా ముందు తేలిపోయేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్‌.. అనివార్య పరిస్థితుల్లో పక్క పార్టీల అజెండాలోకి వెళ్లి.. వాటిని ఎదుర్కోవాల్సి వస్తోంది. లేదంటే ఇన్నాళ్లుగా నిర్మించుకున్న రాజకీయ ప్రాబల్యానికి గండి పడే ప్రమాదం ఉందన్న సంకేతాలు గులాబీ పార్టీ అధినేతకు అందినట్లు తెలుస్తోంది. 


వజ్రోత్సవాలు అందుకే..

ఏడాది నుంచి భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. వాటి ముగింపును తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఊరూ-వాడలో జాతీయ భావాన్ని రగల్చాలని ప్రణాళిక రూపొందించడాన్ని సీఎం కేసీఆర్‌ గ్రహించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ మాత్రమే జాతీయ స్ఫూర్తిని నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తే అది రాజకీయంగానూ ప్రభావం చూపుతుందని భావించారు. దీంతో అప్పటికప్పుడు కేసీఆర్‌ ట్రాక్‌  మార్చారు. బీజేపీ సెట్‌ చేసిన వజ్రోత్సవాల అజెండాలోకి వెళ్లారు. ఆ పార్టీని ఢీకొట్టాలంటే వజ్రోత్సవాలను తామే మరింత పెద్ద ఎత్తున చేయాలని అకస్మాత్తుగా నిర్ణయించారు. కోటి జెండాల ఉచిత పంపిణీ, ప్రతి జిల్లాలో, నియోజకవర్గంలో కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తాను స్వయంగా సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం తాజాగా జరిగిన సెప్టెంబరు 17 సంబురాల విషయంలోనూ కేసీఆర్‌ అలాగే వ్యవహరించారు. ఒకప్పుడు సెప్టెంబరు 17 రోజు అధికారికంగా జాతీయ పతాకం ఎగరేయాలని ప్రతిపక్షాలు అడిగితే.. చిల్లర రాజకీయాలంటూ కొట్టిపడేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు తానే ఆ అజెండాలోకి రాక తప్పలేదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతోనే కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, నిజాం లొంగిపోవడంలో   పటేల్‌ చొరవను కలగలిపి ఒక భావోద్వేగాన్ని, నాటి పోరాట స్ఫూర్తిని మళ్లీ రగల్చాలని బీజేపీ భావించింది. ఈ పరిస్థితిని గ్రహించిన గులాబీ అధినేత ఈసారి గతంలోలా తేలిగ్గా తీసిపారేయలేదు. తన అజెండాలోకే ఇతర పార్టీలు వచ్చేలా చేసిన ట్రాక్‌ రికార్డునూ పట్టించుకోలేదు. తానే బీజేపీ అజెండాలోకి వెళ్లా రు. సెప్టెంబరు 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించి అట్టహాసంగా నిర్వహించారు. 


అజెండా మార్చాల్సిన అనివార్యత!

గత రెండు పర్యాయాల ఎన్నికల్లో అలవోకగా విజయం సాధించిన టీఆర్‌ఎ్‌సకు ఈసారి మారిన రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలం గా దృష్టి పెట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కూడా పుంజుకుంటుందన్న సమాచారంతో.. తమ అజెండాను కూడా మార్చాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. తమ బలం కాస్త తగ్గిందన్న భావన, అదే సమయంలో కమ్మేస్తున్న బీజేపీ బలగాలు ఆ పార్టీని ఆలోచనలో పడేసినట్లు తెలుస్తోంది. మజ్లిస్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు, దానిపై బీజేపీ చేస్తున్న విమర్శలు కూడా టీఆర్‌ఎ్‌సను ఆత్మరక్షణలో పడేశాయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో తానే చాంపియన్‌ అంటూ అందరినీ తన అజెండాలోకి తెచ్చుకుని కేసీఆర్‌ బలోపేతమయ్యారు. ఇప్పుడు తెలంగాణపై అంతకంటే బలంగా దృష్టి పెడుతున్న కమలనాథులు.. జాతీయ స్ఫూర్తిని, తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛాగాలులు పీల్చుకున్న సెప్టెంబరు 17కు సంబంధించిన వీరోచిత గాథలనూ అజెండాగా తీసుకున్నారు. దీంతో ఈ అంశాల జోలికే వెళ్లకుండా వదిలేస్తే.. అది మొత్తానికే నష్టం చేస్తుందన్న ఆలోచన గులాబీ పార్టీలో మొదలైంది. అందుకే తమది కాని అజెండా అయినా.. అందులోకెళ్లి తమ వంతు వాటాను తాము తెచ్చుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ సిద్ధాంతపరమైన రాజకీయ అంశాలే కాకుండా.. నేరుగా రాజకీయం చేసేందుకు మునుగోడు ఉప ఎన్నికను తేవడం కూడా బీజేపీ అజెండానే. ఒకప్పుడు ఉప ఎన్నికలంటే అది కేసీఆర్‌ వ్యూహంగా ఉండేది. కానీ, ఇప్పుడది బీజేపీ వ్యూహంగా మారింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్సే కారణమైనా.. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికను మాత్రం బీజేపీయే తీసుకొచ్చింది. అక్కడ కొట్లాడాల్సిన అనివార్యతను టీఆర్‌ఎ్‌సకు కల్పించింది. Read more