ప్రియుడితో ఏకాంతానికి భంగం కలిగిస్తోందనే..
ABN , First Publish Date - 2022-12-20T03:39:56+05:30 IST
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో రెండేళ్ల చిన్నారి అనుమనాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో తన ఏకాంతానికి భంగం కలిగిస్తోందన్న కారణంతో ఆ బిడ్డను కన్నతల్లే హత్యచేసిందని తేల్చారు.
రెండేళ్ల బిడ్డను ఊపిరాడకుండా చేసి చంపిన కన్నతల్లి
నల్లగొండ జిల్లాలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ
నార్కట్‌పల్లి, డిసెంబరు 19: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో రెండేళ్ల చిన్నారి అనుమనాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో తన ఏకాంతానికి భంగం కలిగిస్తోందన్న కారణంతో ఆ బిడ్డను కన్నతల్లే హత్యచేసిందని తేల్చారు. ప్రియుడితో కలిసి బిడ్డను ఇష్టంవచ్చినట్లుగా కొట్టి.. ఆపై ముక్కు, నోరు మూసి, ఊపిరాడకుండా చేసి చంపేసిందని తేల్చారు. ఈ మేరకు 14న జరిగిన ఘటనకు సంబంధించి సోమవారం నార్కట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో వివరాలను డీఎస్పీ నర్సింహారెడ్డి వివరించారు. చిట్యాల మండలం ఎలికట్టెకు చెందిన ఉయ్యాల వెంకన్నకు కనగల్ మండలం లచ్చుగూడెం గ్రామానికి చెందిన రమ్యతో 2015లో వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల వయసున్న కుమార్తె ప్రియాంశిక ఉన్నారు. భర్త ఉయ్యాల వెంకన్న ఏడాది క్రితం కరోనాతో చనిపోయాడు. అయితే రమ్యకు ఇదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్నతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అత్తామామలు మందలించి పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించారు. వారు రమ్యను మందలించటంతో ఆమె, పెరిక వెంకన్న అక్కడినుంచి వెళ్లిపోయి కొద్ది రోజులు చిట్యాలలో నివాసం ఉన్నారు. అనంతరం ఆరు నెలల క్రితం నార్కట్‌పల్లిలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు.
అయితే ప్రియాంక తరచూ ఏడుస్తూ తమ ఏకాంతానికి భంగం కలిగిస్తోందని, పాపను చంపేయాలని రమ్య, పెరిక వెంకన్న భావించారు. పథకం ప్రకారం వారం క్రితం తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వీడియోను రికార్డు చేసి బంధువుల ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు, తన పిల్లలకు ఏమైనా హాని జరిగితే ఎలికట్టెకు చెందిన ఎంపీటీసీ దశరథ, మాదగోని శ్రీను, గ్రామానికి చెందిన పెద్ద మనుషులే కారణం అని అందులో పేర్కొంది. ఈ నెల 14వ తేదీ రాత్రి ప్రియాంశిక ఏడుస్తుండటంతో పాపను పెరిక వెంకన్న ఇష్టంవచ్చినట్లు కొట్టాడు. దెబ్బలకు తాళలేక పాప మరింత బిగ్గరగా రోదిస్తుండగానే రమ్య, పెరిక వెంకన్న కలిసి నోరు, ముక్కు మూసి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయిందంటూ స్థానికులకు చెప్పి అదే రోజు రాత్రి 11 గంటలకు నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రియాంశికను పరీక్షించిన వైద్యులు చనిపోయిందని చెప్పడంతో మార్చురీ వద్దే వదిలి ఇద్దరూ పారిపోయారు. అనంతరం రమ్య, ఈ విషయాన్ని తన అత్తమామలకు తెలియజేసింది. వారు ప్రియాంశిక మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో పాప మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం రమ్య, పెరిక వెంకన్నను అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొన్నారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ వివరించారు.