ప్రాణం తీసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ!

ABN , First Publish Date - 2022-04-24T09:32:11+05:30 IST

‘‘పర్యావరణ పరిరక్షణ కోసం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాల వైపు, శిలాజేతర ఇంధనాల వైపు మళ్లాలి! ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలి..

ప్రాణం తీసిన ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ!

  • చార్జింగ్‌ పెట్టిన సమయంలో పేలుడు
  • తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యులు
  • ఆస్పత్రికి తరలిస్తుండగా యజమాని మృతి
  • బైక్‌ కొన్న ఒక్క రోజులోనే దుర్ఘటన
  • విజయవాడలో సంచలనం
  • గడిచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే రెండు చోట్ల పేలుడు..
  • ఇద్దరు వ్యక్తుల మృతి
  • బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో సమస్యలవల్లే!

(సెంట్రల్‌ డెస్క్‌): ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాల వైపు, శిలాజేతర ఇంధనాల వైపు మళ్లాలి! ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలి’’ అంటూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు వాహనాలకు రాయితీలిస్తోంది. కానీ.. రోజూ ఎలక్ట్రిక్‌ బైకులకు సంబంధించిన ప్రమాద వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ-స్కూటర్ల పేలుడు ప్రమాదాలకు ప్రధాన కారణం.. వాటిల్లో వాడే లిథియం-అయాన్‌ బ్యాటరీలేనని పలువురు ఉత్పత్తిదారులు చెబుతున్నారు. సంప్రదాయ లెడ్‌-యాసిడ్‌ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్‌ బ్యాటరీల నాణ్యత, మన్నిక చాలా ఎక్కువ. ఒక కిలో బరువుండే లిథియం-అయాన్‌ బ్యాటరీలో 150 వాట్‌-అవర్స్‌ మేర స్టోరేజీ ఉంటుంది. అదే సంప్రదాయ బ్యాటరీల నిల్వ సామర్థ్యం 25 వాట్‌-అవర్స్‌ మాత్రమే ఉంటుంది. కానీ, సంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే.. లిథియం-అయాన్‌ బ్యాటరీలు తేలిగ్గా ఉంటాయి. ఫుల్‌చార్జింగ్‌కు తక్కువ సమయం తీసుకుంటాయి. అందుకే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పల నుంచి ఈ-బైక్స్‌ దాకా అన్నింటిలో లిథియం-అయాన్‌ బ్యాటరీలను వాడుతున్నారు. అయితే.. ఈ బ్యాటరీల్లో మెకానిజం కొంత క్లిష్టంగా ఉంటుంది. విద్యుత్తు సాంద్రత(డెన్సిటీ) చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ తరహా బ్యాటరీల్లో.. బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ(బీఎంఎస్‌) తప్పనిసరి. ఈ వ్యవస్థ ద్వారానే బ్యాటరీ ఫుల్‌చార్జ్‌ అయ్యిందా? ఇంకా ఎంత బ్యాటరీ చార్జ్‌ ఉంది? డెడ్‌ అవుతోందా? అనే అంశాలు స్మార్ట్‌ఫోన్లలో, ఈ-స్కూటర్ల తెరపై కనిపిస్తాయి. ఒకవేళ బీఎంఎస్‌ సరిగ్గా పనిచేయకపోతే.. బ్యాటరీ 90-100 డిగ్రీల స్థాయిలో వేడెక్కినా.. హెచ్చరికలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. దీంతో బ్యాటరీలు పేలే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు.


వైరింగ్‌ సరిగా లేకున్నా..

షార్ట్‌ సర్క్యూట్‌, వోల్టేజీలో భారీ హెచ్చుతగ్గుల కారణంగా లిథియం-అయాన్‌ బ్యాటరీలు పేలే ప్రమాదముందని విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. ఎర్త్‌ లేకుండా బ్యాటరీలను చార్జ్‌ చేస్తే.. వైరింగ్‌లో లోపాల వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదాలు ఉన్నాయంటున్నారు. వోల్టేజీలో భారీ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్నా.. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు పాడయినట్లే.. లిథియం-అయాన్‌ బ్యాటరీలు వేడెక్కే ప్రమాదముందని వివరిస్తున్నారు. చాలా మంది రాత్రిళ్లు ఈ-స్కూటర్లను చార్జింగ్‌ పె ట్టి, నిద్రపోతుంటారని.. ఓవర్‌ చార్జింగ్‌, వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు.


టెస్టింగ్‌ ఏదీ?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు చుక్కలను తాకుతున్నాయి. భారత్‌లోనూ రోజువారీగా ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఉత్పత్తిదారులు లిథియం-అయాన్‌ బ్యాటరీలకు టెస్టింగ్‌ నిర్వహించకుండానే మార్కెట్‌కు పంపుతున్నారనే ఆరోపణలున్నాయి. బీఐఎస్‌ లైసెన్సింగ్‌ ఉండి ఉంటే.. ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని, కనీసం రిజిస్ట్రేషన్‌ కూడా తప్పనిసరి కాకపోవడంతో లిథియం-అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తిదారులు ఏరోజుకారోజే ఉత్పత్తులను మార్కెట్‌కు పంపుతున్నారని తెలుస్తోంది. ఈ-స్కూటర్ల ఉత్పత్తిదారులు కూడా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.


ఎలక్ట్రిక్‌ బైక్‌ కొన్నామన్న ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది! కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఇంటికి తెచ్చి చార్జింగ్‌ పెట్టి పడుకుంటే.. బ్యాటరీ పేలి ఇంటి పెద్దనే బలిగొంది! ఆయన భార్య తీవ్రంగా గాయపడగా, వారి పిల్లలు ఇద్దరికి గాయాలయ్యాయుయి.

.. విజయవాడలో శుక్రవారం జరిగిన విషాదం.


ఎలక్ట్రిక్‌ బైక్‌ నుంచి బ్యాటరీ బయటకు తీసి ఇంట్లో చార్జింగ్‌ పెట్టి పడుకోగా.. అది పేలడంతో ఇంటి పెద్ద (80) మరణించాడు! 


.. నిజామాబాద్‌లో జరిగిందీ విషాదం. బ్యాటరీ.. ‘ప్యూర్‌ ఈవీ’ కంపెనీకి చెందింది. ఈ ఘటనతో ఆ సంస్థ ఇటీవలికాలంలో విక్రయించిన 2000 ఎలక్ట్రిక్‌ స్కూటర్లను రీకాల్‌ చేసింది. ఆ బైకులు, వాటి బ్యాటరీలను నిశితంగా పరిశీలించి తిరిగిస్తామని ప్రకటించింది.


..విజయవాడ, నిజామాబాద్‌లోనే కాదు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు.. ఇలా దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల బ్యాటరీలు పేలిపోవడం, చార్జింగ్‌ సమయంలో మంటలు అంటుకోవడం వంటి ఘటనలు ఇటీవలికాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి! ఎందుకిలా జరుగుతోంది? ఇలా జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తదితర అంశాలతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు విద్యుత్తు వాహనం కొనుగోలు చేశారా? లేదా కొనాలని అనుకుంటున్నారా? అయితే.. దానివల్ల ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

 విద్యుత్తు వాహనాల్లోని బ్యాటరీలను అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలకు గురికాకుండా చూసుకోవాలి. 

 ఎలక్ట్రిక్‌ వాహనాలను మిట్టమధ్యాహ్నం మండుటెండల్లో ఎక్కువసేపు పార్కింగ్‌ చేయకూడదు. వీలైనంతవరకూ నీడలోనే పార్క్‌ చేయాలి. 

 చార్జింగ్‌ కూడా బండి నీడలో ఉన్నప్పుడే పెట్టుకోవడం మంచిది. వాహనాన్ని ఎండలో పెట్టి చార్జింగ్‌ చేయొద్దు. 

 వాహనంతోపాటు ఇచ్చే ఒరిజినల్‌ చార్జర్‌ని మాత్రమే వాడాలి. ఏ చార్జర్‌ పడితే దాంతో చార్జ్‌ చేయకూడదు. 

 మండే స్వభావం ఉన్న వస్తువులకు దగ్గరగా ఈవీలను పార్క్‌ చేయడం, బ్యాటరీలను చార్జ్‌ చేయడం ప్రమాదాలకు కారణమవుతుంది.

 వాహనాన్ని వాడిన తర్వాత గంటవరకూ చార్జింగ్‌ పెట్టొద్దు. నడపడం వల్ల వేడెక్కిన బ్యాటరీ కాస్త చల్లబడిన తర్వాతే చార్జింగ్‌ పెట్టాలి.

 బ్యాటరీ కేసింగ్‌ను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. కేసింగ్‌ దెబ్బతిన్నట్టు కనిపిస్తే వెంటనే డీలర్‌కు సమాచారమివ్వాలి. అలాంటి బ్యాటరీలను అస్సలు చార్జింగ్‌ చేయొద్దు.

 వాహనం నడుపుతున్నప్పుడు మంటలు చెలరేగితే వెంటనే దాన్ని ఆపి, దిగి పక్కకు వచ్చేయండి. లిథియం అయాన్‌ బ్యాటరీల నుంచి వచ్చే మంటలను ఆర్పడానికి ప్రయత్నించడం వల్ల ప్రమాదతీవ్రత మరింత పెరగొచ్చు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక విభాగానికి ఫోన్‌ చేయాలి.

 బ్యాటరీలో చార్జింగ్‌ పూర్తిగా అయిపోయేవరకూ ఆగొద్దు. చార్జింగ్‌ ఎప్పుడూ కనీసం 20-80 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి. పదేపదే చార్జింగ్‌ పెట్టడం వల్ల బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోతుంది.

 ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే బ్యాటరీని పూర్తిగా చార్జ్‌ చేయాలి.

 బ్యాటరీలను వీలైనంతవరకూ ఇంట్లో కాకుండా బయటివైపు చార్జ్‌ చేస్తే.. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం వాటిల్లకుండా ఉంటుంది. 

Updated Date - 2022-04-24T09:32:11+05:30 IST