అంతర్గత పోరు వీధిస్థాయికి

ABN , First Publish Date - 2022-08-31T09:28:44+05:30 IST

అధికార టీఆర్‌ఎ్‌సలో అసమ్మతులు, అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి.

అంతర్గత పోరు వీధిస్థాయికి

వికారాబాద్‌ జిల్లాలోనూ బహిరంగ విమర్శలు.. రంగారెడ్డి జిల్లాలోనూ బయటపడ్డ విబేధాలు


మునుగోడులో అధినేతే అభ్యర్థిని నిర్ణయించినా ఒప్పుకోని అసంతృప్తులు

చివరకు అధికారిక ప్రకటనే వాయిదా

పెరిగిన రాజకీయ అవకాశాలు...ఎన్నికలు సమీపిస్తుండడమే కారణం


హైదరాబాద్‌, ఆగస్టు 30, (ఆంధ్రజ్యోతి): అధికార టీఆర్‌ఎ్‌సలో అసమ్మతులు, అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. బహిరంగంగా ఒకరిమీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే స్థాయి నుంచి క్రమంగా వ్యక్తిగత విమర్శలతో వీధికెక్కే స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా అధికారపక్షంలో అందునా ఇక ఎదురులేదన్నంత బలంగా ఉన్నట్లు కనిపించిన టీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతులున్నా అంతర్గతంగానే ఉంటాయి. అధినేతకు తలనొప్పులు తెస్తే అది తిరిగి తమ తలకే చుట్టుకుంటుందనే భావన కూడా మనసులో ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్దికాలం క్రితం రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలున్నాయి. మంత్రి అనుచరులు మహేశ్వరం నియోజకవర్గంలో చెరువులను కబ్జా చేస్తున్నారని, భూ వివాదాల్లో ఉంటున్నారంటూ తీగల బహిరంగంగానే విమర్శించారు. అయితే ఆ తర్వాత పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకోవడంతో ఈ వివాదానికి ఇప్పటికి విరామం వచ్చింది. వికారాబాద్‌ జిల్లాలో తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. స్థానిక పదవుల పంపకాలు, ప్రోటోకాల్‌ విషయంలో రగడ జరిగింది. ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లాయి. చివరకు కేటీఆర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని గట్టిగా చెప్పడంతో సర్దుబాటు జరిగింది. అంతకుముందు కూడా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య మాటల యుద్ధం నడిచింది. కేటీఆర్‌ ఆ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలోనూ ఇరువురితో విడివిడిగానే మాట్లాడి సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు నేతల మధ్య రగడ మొదలైంది. సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేలతో వస్తాయి, ఎమ్మెల్సీలతో కాదు అంటూ కడియంపై రాజయ్య గతంలో పరోక్షంగా విమర్శించారు. దీనిపై కడియం కూడా కౌంటర్‌ ఇచ్చారు. పనులు, పదవులు అమ్ముకుంటున్నారంటూ రాజయ్యపై విమర్శలు చేశారు. తాజాగా రాజయ్య మాట్లాడుతూ క డియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో 361మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. 1994కు ముందు కడియం శ్రీహరి ఆస్తులెంత? రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ఆస్తులెంత? ఎక్కడినుంచి సంపాదించారని  ప్రశ్నించారు.  


 కేసీఆర్‌ స్వయంగా పేరు సూచించినా 

నేతల మధ్య పరస్పర విమర్శలే కాదు...మునుగోడు ఉప ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఒక పేరును సూచించారనే సమాచారం ఉన్నా...నేతలు అందుకు అంగీకరించని పరిస్థితి ఏర్పడటం గమనార్హం. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ నిర్ణయించి అంతర్గతంగా నేతలకు చెప్పేశారు. సర్వేలు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయనీ చెప్పారు. అయినా సీఎం చెప్పిన అభ్యర్థిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేనా, ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తే తమ దారి తాము చూసుకుంటామని చెప్పేశారు. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన బహిరంగసభలో కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే తాము పోటీ సభ పెడతామని కూడా కొందరు అసంతృప్తనేతలు ప్రకటించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగాకే అభ్యర్థిని ప్రకటిద్దామని చివరకు అధిష్ఠానమే వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది. 


రాజకీయ అవకాశాలు పెరగడమే కారణమా?

గతంలో లేని ఈ బహిరంగ వైరుధ్యాలు టీఆర్‌ఎ్‌సలో ఇప్పుడే ఎందుకు బయటకొస్తున్నాయన్నదానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో సంతృప్తా? అసంతృప్తా? అన్నది పక్కనపెడితే ఇంకో పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన లేని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఎవరికి వారు తమ స్థానాలను పదిలపర్చుకోవాలని అనుకుంటున్నారు. అంతేకాదు...బహుముఖ అవకాశాలున్నాయనే భావన ఏర్పడింది. అధికార పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గుతాయనే అంచనా, గతంలో కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే బలంగా ఉండగా ఇప్పుడు బీజేపీ కూడా అనూహ్యంగా రేస్‌లోకి రావడంతో గతంలో ఉన్నంత పట్టు అధికార పార్టీకి కూడా లేకుండా పోతోందనే వాదనా ఉంది. దీంతో ఇప్పుడు తమకు కావాల్సిన స్థానం కోసం, తమ వారికి కావాల్సిన పదవుల కోసం అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు...తమకు రుచించని నేతలు, పోటీ పడుతున్న నేతలపై విమర్శలు...ప్రతి విమర్శలు బహిరంగంగానే చోటుచేసుకునే పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-08-31T09:28:44+05:30 IST