పదవి తండ్రిది.. పెత్తనం కొడుకుది
ABN , First Publish Date - 2022-01-08T06:16:13+05:30 IST
తండ్రి ఎమ్మెల్యే అయినా.. పెత్తనం తానే చేస్తాడు. పార్టీ కార్యక్రమాలతోపాటు అధికారిక కార్యక్రమాల్లోనూ అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తాడు. నియోజకవర్గంలో ఏ..

- నియోజకవర్గంలో అంతా రాఘవ కనుసన్నల్లోనే
- నియామకాలన్నీ అతడు చెప్పినట్లే జరగాలి
- అధికారులు రోజూ ఇంటికెళ్లి ప్రసన్నం చేసుకోవాలి
- వనమా రాఘవ అరాచకాలు మరిన్ని వెలుగులోకి
కొత్తగూడెం, జనవరి7 (ఆంధ్రజ్యోతి): తండ్రి ఎమ్మెల్యే అయినా.. పెత్తనం తానే చేస్తాడు. పార్టీ కార్యక్రమాలతోపాటు అధికారిక కార్యక్రమాల్లోనూ అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా తననే ప్రసన్నం చేసుకోవాలంటాడు. ఎస్ఐల పోస్టింగ్‌ల నుంచి ఆశా వర్కర్ల నియామకం దాకా అంతా తన కనుసన్నల్లోనే జరగాలంటాడు. అధికారులు విధులకు సక్రమంగా హాజరు కాకపోయినా పర్వాలేదు గానీ.. పాత పాల్వంచలోని తన ఇంటికి మాత్రం ప్రతిరోజూ వచ్చి దర్శనం చేసుకోవాలంటాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తాడు. ప్రభుత్వ భూములనూ కబ్జా చేస్తాడు. మొత్తంగా కొత్తగూడెం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు (రాఘవ). నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసుతో రాఘవ అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలంటే తన అనుమతి తీసుకోవడంతోపాటు కోరినంత భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటాడు. ఇలా ఇప్పటివరకు రాఘవ పేరుతో, అతని బినామీల పేరుతో వందల ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయ్యాయంటే అతిశయోక్తి కాదు.
999, 444, 817, 727 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూముల్లోనూ ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయి. తాజాగా 3 వేల గజాల భూమిని నవభారత్ ఏరియాలో అతని బినామి పేరుతో రిజిస్ర్టేషన్ చేయించుకున్నాడు. ప్రస్తుతం రాఘవ నివాసముంటున్న పాత పాల్వంచలోని ఇల్లు కూడా ప్రభుత్వ భూమి అయిన చింతలచెరువు ఆయకట్టు ప్రాంతంలోనిది. దీనిని ఎన్నో ఏళ్ల క్రితమే కబ్జా చేసి, దానికితోడు నేషనల్ హైవే భూమిని కూడా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక అధికారుల పోస్టింగుల విషయంలో ప్రాంతం, ఉద్యోగం మేరకు రేటు నిర్ణయించి పోస్టింగ్ ఇప్పించుకుంటాడు. పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ జరగాలన్నా.. రాఘవ అనుమతి తప్పనిసరి.
అధికారుల కుర్చీలో కూర్చొని..
ఒక్కోసారి తన తండ్రి ఎమ్మెల్యే కుర్చీలోనే కాకుండా డివిజనల్ స్థాయి అధికారుల కుర్చీల్లోనూ కూర్చొని పెత్తనం చెలాయిస్తుంటాడు. పాల్వంచలో ఆర్డీవోగా చల్లా వినయ్‌మోహన్ పనిచేస్తున్న రోజుల్లో రాఘవ ఏకంగా ఆర్డీవో కుర్చీలో కూర్చోవడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. తాజాగా కొత్తగూడెం పట్టణంలో క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కూడా ఆయన కనుసన్నల్లో జరుగుతోంది. అతను అడిగినంత ఇస్తే పట్టా జారీ, లేకుంలే ఖాళీ. ఇవ్వని లబ్ధిదారుల పట్టాలను అతడి వద్దే పెట్టుకుంటున్నాడనే ఆరోపణలున్నాయి. ఇదేకాకుండా.. నియోజకవర్గంలో మట్టి, ఇసుక, ల్యాండ్, గుట్కా, లిక్కర్, నల్లబెల్లం మాఫియాలన్నీ రాఘవకు ముడుపులు చెల్లించి చలామణి అవుతున్నవే. లేదంటే కేసులు తప్పవు. ఇదే క్రమంలో ఏకంగా ఆబ్కారీశాఖలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిపై కూడా కేసు నమోదు చేయించిన ఘనుడిగా రాఘవకు పేరుంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉండడంతో రాఘవ అన్నీ తానై వ్యవహరిస్తూ ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడు. కుమారుడి అక్రమాల గురించి తెలిసినా తండ్రి నుంచి గానీ, పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి హెచ్చరికలు లేకపోవడంతో రాఘన ఆడిందే ఆటగా సాగుతూ వస్తోంది.