అభ్యర్థిని త్వరగాఖరారు చేయాలి

ABN , First Publish Date - 2022-08-18T08:56:15+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పట్టు సాధించాలంటే సెప్టెంబరు మొదటివారంలోనే అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

అభ్యర్థిని త్వరగాఖరారు చేయాలి

సెప్టెంబరు మొదటి వారంలోనే ప్రకటించాలి

కేసీఆర్‌ సభ రోజు గ్రామాల్లో పాదయాత్ర 

ఠాగూర్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సూచన

ఉప ఎన్నికలో గెలుపు కోసం వంద రోజుల కార్యాచరణ

మునుగోడు ప్రచార కమిటీ సభ్యులతో భేటీలో మాణిక్కం ఠాగూర్‌

తాను ఎవరికీ ఏజెంట్‌ని కానని స్పష్టీకరణ


హైదరాబాద్‌/నల్లగొండ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ పట్టు సాధించాలంటే సెప్టెంబరు మొదటివారంలోనే అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ఖరారు చేసి జనంలో తిప్పితే ఓటుబ్యాంకు పెరుగుతుందని, పార్టీపరంగా టీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అన్నట్లు ఉంటుందని  కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు సూచించారు. దీనికితోడు అభ్యర్థి ఎంపిక ఏ కోణంలో జరిగిందో పార్టీ శ్రేణులకు, ఆశావహులకు వివరించి అంతా ఐక్యంగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేయాలని అన్నారు. బుధవారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచార కమిటీ సభ్యులు, మండలాల ఇన్‌చార్జులతో గాంధీభవన్‌లో ఠాగూర్‌ సమావేశమయ్యారు. మునుగోడులో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వేర్వేరు మార్గాల ద్వారా పార్టీ జరిపిన సర్వే నివేదిక ఆధారంగా ఆయా మండలాల్లో పార్టీ పరిస్థితిని, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెంట వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల వివరాలను తెలుసుకున్నారు. ఇకపై ఎవరూ పార్టీ వీడకుండా కట్టడి చేయాలని సూచించారు. మునుగోడులో కచ్చితంగా గెలిచి తీరేలా వంద రోజుల కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 20న మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో పార్టీ కీలక నేతలంతా ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అయితే అదేరోజు సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఉన్నందున వాయిదా వేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా, అదేరోజు పార్టీ క్యాడర్‌ను తమవెంట నిలుపుకోవాలని కీలక నేతలు సూచించారు.  కాగా వ్యూహ, ప్రచార కమిటీ చైర్మన్‌గా కీలక బాధ్యతలు స్వీకరించిన మధుయాష్కీగౌడ్‌  ఈ భేటీకి హాజరు కాకపోవడపై ఠాగూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి వెళ్లినవారు తనపై చేసే విమర్శలను తాను పట్టించుకోనని  ఠాగూర్‌ అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పార్టీ నేతలంతా కలిసి పని చేస్తున్నారని తెలిపారు.   తెలంగాణకు పార్టీ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీ వస్తే స్వాగతిస్తామని అన్నారు. తనను రేవంత్‌రెడ్డి ఏజెంట్‌ అంటూ వస్తున్న ఆరోపణలపై ఠాగూర్‌ స్పందిస్తూ, తాను ఎవరికీ ఏజెంట్‌ను కాదని, సోనియాగాంధీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానని  స్పష్టం చేశారు. 

Read more