ఏపీలో స్ట్రాటజీపై బీజేపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేదు

ABN , First Publish Date - 2022-09-19T08:43:36+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై బీజేపీ అధిష్ఠానం ఇంకా స్పష్టత ఇవ్వలేదని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి అన్నారు.

ఏపీలో స్ట్రాటజీపై  బీజేపీ అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేదు

  • ప్రతిదానికీ వెయిట్‌ చేయాల్సి వస్తోంది.. జైట్లీ చెబితేనే పార్టీ మారాను
  • చంద్రబాబే నాకు రాజకీయ గురువు
  • ఆయనకు ఇప్పటికీ శ్రేయోభిలాషిని
  • మొన్నటి ఎన్నికల్లో జగన్‌ గెలవలేదు..
  • చంద్రబాబు ఓడిపోయారంతే!
  • ఇన్నేసి అప్పులు ఆంధ్రకు పెనుముప్పే
  • ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లోసుజనా చౌదరి స్పష్టీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై బీజేపీ అధిష్ఠానం ఇంకా స్పష్టత ఇవ్వలేదని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి అన్నారు. జాతీయ పార్టీ కావడంతో అన్నిటికీ వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నాటి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ కారణంగానే తాను టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లానని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు రాజకీయ గురువు అని, రెండుసార్లు తనను రాజ్యసభకు పంపిన ఆయనపై ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుందని చెప్పారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణతో ఆదివారం ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు. తాను అధికారం కోరుకునేవాడిని కాదని, టీడీపీలో చేరిన సమయంలో ఆ పార్టీ అధికారంలో లేదని అన్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి మారడానికి దివంగత నేత అరుణ్‌ జైట్లీ చెప్పిన మాటలేనన్నారు. జాతీయ పార్టీలో బాగా షైన్‌ అవుతానని ఆయన చెప్పడంతో వెళ్లానని తెలిపారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీకి వెళ్లి ఉంటే.. ఆ రోజు పరిస్థితిని బట్టి ఇంకో సీటు వైసీపీకి వచ్చేది తప్ప చంద్రబాబుకుగానీ, టీడీపీకిగానీ ప్రయోజనం ఉండేది కాదని అన్నారు. తనతోపాటు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ వస్తామనడంతో రెండింట మూడొంతుల మెజారిటీ వచ్చిందని, దాంతో రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదని చెప్పారు. అయినా తన రాజకీయ గురువు చంద్రబాబేనన్నారు. చెప్పేది విని అర్థం చేసుకొని బదులివ్వాలని చంద్రబాబును కోరేవాడినని, అయినా ఆయన వినడం బాగా తగ్గించేశారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో నిజానికి వైఎస్‌ జగన్‌ గెలవలేదని, చంద్రబాబు ఓడిపోవడం మాత్రమే జరిగిందని అన్నారు. ఆ పరిస్థితి రావడానికి అప్పుడు టీడీపీలో ఉన్నవారందరమూ కారణమన్నారు. జగన్‌ గెలిచే పరిస్థితి లేదని, తామే ఆ అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీలో నాకు ఇది కావాలంటూ ఎవరి దగ్గరకూ వెళ్లి అడగలేదని, చంద్రబాబు దగ్గర అన్నేళ్లు ఉన్నా ఆయనను కూడా ఏనాడూ అడగలేదని అన్నారు. 


అప్పులు అందుకే వస్తున్నాయనుకోను..

మోదీ, అమిత్‌ షా చలవతోనే ఏపీకి అప్పులు ఎక్కువగా లభిస్తున్నాయని తాను భావించడంలేదని సుజనా చౌదరి తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎంను మేనేజ్‌ చేయడం ఇంతకుముందే మొదలైందని, కానీ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఇది పెను ముప్పు అని వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్రానికి చంద్రబాబు హయాంలో తాము తీసుకొచ్చిన ప్రయోజనాలు వేరెవరూ తీసుకురాలేద పేర్కొన్నారు. కానీ, ఏదీ చెప్పుకోవడానికి లేకుండా పోయిందన్నారు. రాజధానిలో తాత్కాలిక కట్టడాలు అనే పద ప్రయోగమే తప్పు అని స్పష్టం చేశారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు.. ఏపీకి రావలసినవి కలిసి అడుగుదాం రండి అని వైసీపీ ఎంపీలను కోరానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తెలివిగా వ్యవహరిస్తారని అనుకుంటున్నానన్నారు. తాను ఎంటెక్‌ వరకూ చదువుకున్నా అంత నేర్చుకోలేదని, రాజకీయాల్లో ఈ పన్నెండేళ్లలో మాత్రం ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఫైనాన్షియల్‌, లీగల్‌ క్లియరెన్స్‌ లేకుండా ప్రభుత్వం ఏమీ చేయలేదని తెలుసుకున్నానని, కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన జరుగుతున్న తీరు చూస్తే అవన్నీ అక్కర్లేదని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం చేసేస్తున్నారన్నారు. 


అమరావతే రాజధాని..

రాజధానిగా అమరావతి అన్ని పార్టీల అంగీకారంతోనే ఏర్పాటైందని, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా మార్చుకుంటూ పోయేది కాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ చేయకుండా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో కలిపేయాలని తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రికమెండ్‌ చేశానని తెలిపారు. తనపై ఏ కేసులూ లేవని, ప్రపంచంలో ఎవరూ తనను జైలులో పెట్టలేరని సుజనా చౌదరి అన్నారు. రాజ్యసభలో ఉన్నప్పుడు.. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని తనకో నినాదం ఉండేదని, దానిని ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌.. రెస్టోర్‌ డెమోక్రసీ’ అని పెట్టుకుని ఏపీ ప్రజల కోసం ఏదైనా చేయాలని ఉందని చెప్పారు. రాష్ట్రం కోసం తన శేష జీవితం మొత్తం గడపడానికి సిద్ధంగా ఉన్నానని, దానికి అవసరమైన వేదిక ఏమిటా అని ఆలోచిస్తున్నానని తెలిపారు. 

Read more