వ్యవసాయాధికారి వక్రబుద్ధి

ABN , First Publish Date - 2022-09-30T08:47:07+05:30 IST

అతనో ప్రభుత్వ ఉద్యోగి. విధి నిర్వహణలో అతను అందించిన సేవలకు గుర్తుగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం కూడా అందుకున్నాడు.

వ్యవసాయాధికారి వక్రబుద్ధి

  • గుట్టుగా మహిళల అసభ్యకర ఫోటోలు తీసి..
  • సోషల్‌ మీడియాలో పెట్టి పైశాచికానందం
  • ఓ మహిళ ఫిర్యాదుతో దొరికిన వైనం 
  • రిమాండ్‌కు తరలింపు.. సస్పెన్షన్‌ వేటు
  • నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఘటన

కొండమల్లేపల్లి, సెప్టెంబరు 29: అతనో ప్రభుత్వ ఉద్యోగి. విధి నిర్వహణలో అతను అందించిన సేవలకు గుర్తుగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం కూడా అందుకున్నాడు.  ఇదంతా నాణేనికి ఓ వైపు. కానీ, అతనిలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. రహస్యంగా మహిళల నగ్న చిత్రాలను తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి పైశాచికానందం పొందడం అతని అలవాటు. చివరికి తన శాఖలో పని చేసే ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను కూడా అతను వదిలిపెట్టలేదు. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఇతగాడి వక్రబుద్ధి బయటపడింది. నల్లగొండ జిల్లాలో పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వర్తించిన కె.విజయ్‌రెడ్డి దేవరకొండలో నివాసం ఉంటున్నాడు. విజయ్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. తన ఇంటి చుట్టుపక్కల ఉండే మహిళలను చాటుగా అసభ్యకరంగా ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ఆనందించేవాడు. విజయ్‌రెడ్డి చేస్తున్న ఈ పని ఎవరికీ తెలియదు. అయితే, వ్యవసాయ శాఖకు చెందిన ఓ మహిళ ఉద్యోగి అసభ్య ఫోటోలు ఇటీవల ఓ ఫేస్‌బుక్‌ పేజీలో ప్రత్యక్షమయ్యాయి. ఇతరుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆమె గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టారని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపీ అడ్రస్‌ ఆధారంగా.. ఆ ఫోటోలు పోస్టు చేసింది విజయ్‌ రెడ్డి అనే గుర్తించారు. అంతేకాక అతని ఫోన్‌లో వేర్వేరు మహిళలకు చెందిన అసభ్యకర ఫోటోలు 200 దాకా ఉండటాన్ని చూసి నివ్వెరపోయారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు విజయ్‌ రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేశారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి సుచరితను ఫోన్‌లో వివరణ కోరగా అధికారుల సూచన మేరకే విజయ్‌రెడ్డిని సస్పెండ్‌ చేశామని చెబుతూ పూర్తి వివరాలు చెప్పటానికి నిరాకరించారు.  

Read more