తెలుగు అకాడమీ పుస్తకాలేవీ..!

ABN , First Publish Date - 2022-05-02T09:56:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిపేందుకు చర్యలు చేపడుతోంది.

తెలుగు అకాడమీ పుస్తకాలేవీ..!

  • పోటీ పరీక్షల పుస్తకాలకు డిమాండ్‌ ఉన్నా ఇంకా ముద్రణకు పూనుకోని అకాడమీ
  • పేపరు కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం ..
  • వల్లే పుస్తకాల ముద్రణకు పేపరు కొరత!
  • అకాడమీ పుస్తకాలపైనే అభ్యర్థులకు గురి
  • డిజిటల్‌ పుస్తకాలైనా తేవాలని విజ్ఞప్తులు


హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిపేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. దీంతో వివిధ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. వారంతా సరైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ కోసం వెతుకుతున్నారు. సాధారణంగా ఆయా పోస్టులకు నిర్ణయించిన సిలబస్‌ మేరకు నిపుణులతో రూపొందించిన పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీ.. ఈసారి అభ్యర్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైంది. పుస్తకాల ముద్రణకు అవసరమైన పేపరు కొనుగోలు విషయంలో అకాడమీ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గ్రూపు-1 నుంచి కింది స్థాయి దాకా అన్ని రకాల ఉద్యోగ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలకు మెటీరియల్‌ ఇప్పటికే తెలుగు అకాడమీ వద్ద సిద్ధంగా ఉంది.


వివిధ పోస్టులకు సిలబ్‌సను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) గతంలోనే ప్రకటించింది. ఆ వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే.. సిలబ్‌సకు అవసరమైన పుస్తకాలు బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే చాలా ఖరీదు అవుతుంది. పైగా అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలనే ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అకాడమీ పుస్తకాలను నిపుణులు రూపొందిస్తుండటంతో అవి సిలబ్‌సకు అత్యంత దగ్గరగా ఉంటాయని భావిస్తారు. కానీ, నేడు మార్కెట్‌లో అకాడమీ పుస్తకాలు అందుబాటులో లేవు. 


పేపరు కొనుగోలులో నిర్లక్ష్యం వల్లే..

పుస్తకాల ముద్రణకుగాను పేపరు కొనుగోలుకు టెండర్లను ఖరారు చేయడంలో తెలుగు అకాడమీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. దాంతోనే పుస్తకాల ముద్రణకు పేపర్‌ కొరత తలెత్తిందని అంటున్నాయి. ప్రస్తుతం తెలుగు అకాడమీకి పూర్తి స్థాయి డైరెక్టర్‌ లేరు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన అకాడమీకి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


ఈ పరిస్థితుల్లో పుస్తకాలను డిజిటల్‌ రూపంలోనైనా అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. కాపీరైట్‌ విషయంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, డిజిటల్‌ పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి కొంత ధరను నిర్ణయిస్తే సరిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక సంస్థలు తమ పుస్తకాలను డిజిటల్‌ రూపంలోకి తీసుకువచ్చి, వాటికి ధరను నిర్ణయించి డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ ఇస్తున్నాయి. అదే పద్ధతిని తెలుగు అకాడమీ అధికారులు కూడా వినియోగించుకుంటే తమకు ప్రయోజనం చేకూరుతుందని పలువురు అభ్యర్థులు అంటున్నారు. 

Read more