బాధితుడైన తనపైనే కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-09-23T08:00:03+05:30 IST
బాధితుడైన తనపైనే కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా రఘనాథపాలెంలో ఘటన
రఘనాథపాలెం, సెప్టెంబరు 22: పొరిగింట వారి తో జరిగిన గొడవలో బాధితుడైన తనపైనే పోలీసులు కౌంటర్ కేసు పెట్టారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గురువారం ఈ ఘటన జరిగింది. రఘనాథపాలెం మండలం ఈర్లపూడి ఎస్సీ కాలనీకి చెందిన ఇనుకొండ సుధాకర్‌కు తన పొరిగింటికి చెందిన కురివెళ్ల నాగభూషణం అలియాస్ భూషితో ఇంటి స్థలం సరిహద్దు విషయమై గొడవలు జరిగాయి. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి వివాదాస్పద స్థలంలో ఇరువురు సరిహద్దు రాళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే, వేర్వేరు ప్రాంతాల్లో నివాసముండే భూషి కుమారులు వినయ్, విజయ్ ఆగస్టు 21న ఈ స్థలం విషయంలో సుధాకర్‌తో గొడవ పడ్డారు. ఈ క్రమంలో పరస్పర దాడులు చేసుకోగా, తలకు గాయమవ్వడంతో సుధాకర్ అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భూషి భార్య, కుమారులపైౖ కేసు నమోదు చేశారు. అయితే, ఆ రోజు జరిగిన గొడవలో తనకూ గాయాలయ్యాయంటూ భూషి భార్య బేబీ ఈ నెల 12న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సుధాకర్‌పై కౌంటర్ కేసు నమోదు చేశారు. కేసు విషయమై మాట్లాడేందుకు స్టేషన్‌కు రావాలని పోలీసులు సుధాకర్‌ను పిలిచారు. అయితే, పోలీసు స్టేషన్‌కు బయలుదేరిన సుధాకర్.. స్టేషన్‌కు సమీపంలోని కోయచెలక క్రాస్‌రోడ్డు వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించారు. బాధితుడినైన తనపై కౌంటర్ కేసు పెట్టడం వల్లే ఆత్మహత్యాయత్నం చేశానని సుధాకర్ కుటుంబసభ్యులకు చెప్పాడు.