హైదరాబాద్‌లో ఘటన రాజకీయపరమైనదే

ABN , First Publish Date - 2022-09-11T09:56:23+05:30 IST

హైదరాబాద్‌లో ఘటన రాజకీయపరమైనదే

హైదరాబాద్‌లో ఘటన రాజకీయపరమైనదే

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ


హైదరాబాద్‌, గువహాటి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్ర కార్యక్రమంలో గోషామహల్‌ టీఆర్‌ఎస్‌ నేత నంద బిలాల్‌ చేతిలో తనకు ఎదురైన చేదు అనుభవంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు హిమంత బిశ్వశర్మ శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.  ఆ రోజు వేదిక వద్ద తాను మాట్లాడేందుకు ఇంకా సిద్ధం కాకముందే.. గులాబీ కండువా వేసుకున్న ఓ వ్యక్తి తనకు అత్యంత సమీపంలోకి వచ్చాడని హిమంత చెప్పారు. అప్పటికి ఇంకా తాను ఏమీ మాట్లాడక ముందే.. ‘సీఎం (కేసీఆర్‌) గురించి ఎందుకు మాట్లాడుతున్నారు’ అంటూ తనను ప్రశ్నించాడని పేర్కొన్నారు. ఒకవేళ అతడి చేతిలో పదునైన ఆయుధం ఉంటే తనపై ప్రయోగించేవాడేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సదరు వ్యక్తి తనపై భౌతిక దాడికి ప్రయత్నించలేదని చెప్పారు. భారతీయ సంస్కృతికి, అతిథి దేవో భవ అనే మాటకు ఈ ఘటన విరుద్ధమని, దీన్ని తాను రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తి, చిన్న కేసుతో బయటపడొచ్చునన్నారు. ఇలాంటి ఘటనే అసోంలో ఓ ఆతిథ్య సీఎం విషయంలో జరిగివుంటే తమ పోలీసులు మరింత చర్యలు తీసుకునేవారని చెప్పారు. కాగా తనకు ఎదురైన భద్రతాపరమైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని హిమంత డిమాండ్‌ చేశారు. మరోవైపు హిమంత బిశ్వశర్మకు హైదరాబాద్‌ పర్యటనలో ఎదురైన భద్రతాలోపం ఘటన జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన అసోం సీఎంకు తెలంగాణ పోలీసుల తరఫున భద్రతా పరమైన లోపమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అసోం రాష్ట్ర డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత, డీజీపీ మహేందర్‌ రెడ్డికి శనివారం ఫోన్‌ చేసి   ఆరా తీశారు. కాగా ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల పర్యటనల్లో ఉన్నప్పుడు సాధారణంగానే ఆ రాష్ట్ర పోలీసులు సీఎం స్థాయిలో భద్రత కల్పిస్తారు.  మరోవైపు అసోం సీఎంకు సంబంధించి భద్రతా పరమైన లోపం ఘటనకు సంబంధించి అబిడ్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన అనంతరం టీఆర్‌ఎస్‌ నేత నందబిలాల్‌ను అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొద్ది సమయం అక్కడే ఉంచి ఆ తర్వాత వదిలేశారు. విషయం పెద్దది కావడంతో అబిడ్స్‌ పోలీసులు నంద బిలాల్‌పై న్యూసెన్స్‌ కేసు నమోదు చేశారు. ఐపీసీ 349, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read more