తెలంగాణ ఎంసెట్‌.. ఏపీ టాప్‌

ABN , First Publish Date - 2022-08-13T09:39:48+05:30 IST

లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

తెలంగాణ ఎంసెట్‌.. ఏపీ టాప్‌

  • ఇంజనీరింగ్‌ టాపర్‌ లోహిత్‌రెడ్డి సహా టాప్‌ 10లో ఎనిమిది మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ వారే!
  • అగ్రిలో ఏపీ విద్యార్థిని నేహాకు మొదటి ర్యాంకు
  • తొలి 10 ర్యాంకుల్లో తెలంగాణ వారు ముగ్గురే
  • ఇంజనీరింగ్‌లో 80%.. అగ్రిలో 88% ఉత్తీర్ణత
  • ఫలితాలను ప్రకటించిన విద్యా మంత్రి సబిత
  • 21 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం


హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జీఎన్‌టీయూహెచ్‌లో శుక్రవారం ఫలితాలను వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ఈ నెల 21 నుంచి మూడు దశల్లో కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఇంజనీరింగ్‌లో 9,10 ర్యాంకులు తెలంగాణ వారికి దక్కగా, ఏపీ విద్యార్థులు 1,2,3,4,5,6,7,8వ ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్‌లో తెలంగాణ విద్యార్థులు 4,8,9 ర్యాంకుల్లో నిలవగా, ఏపీవారికి 1,2,3,5,6,7,10 ర్యాంకులు వచ్చాయి. ఎంసెట్‌ ఫలితాల కోసం జ్ట్టిఞట://్ఛ్చఝఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను, ఈసెట్‌ ఫలితాలకు జ్ట్టిఞట://్ఛఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీుఽ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూలై 18, 19, 20న ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, జూలై 30, 31 తేదీల్లో అగ్రికల్చర్‌  పరీక్షలు నిర్వహించారు. 


ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసుకున్న 1,72,238 మందిలో 1,56,860 మంది హాజరవగా 1,26,140 మంది, అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసిన 94,476 మందిలో 80,575 మంది పరీక్ష రాయగా, 71,180 మంది అర్హత సాధించారు.

ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి ఇంజనీరింగ్‌ టాపర్‌గా నిలిచాడు. ఇతడు హైదరాబాద్‌లో ఇంటర్‌ చదివాడు. ఎంసెట్‌ కన్వీనర్‌ అధికారిక ప్రకటన లో మాత్రం లోహిత్‌ను తెలంగాణలో చూపారు. ఇక ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన నక్కా సాయిదీప్తిక రెండో ర్యాంకు సాధించింది. ఏపీకే చెందిన పొలిశెట్టి కార్తికేయ మూడో, పల్లి జలజాక్షి నాలుగో, మెండా హిమవంశీ ఐదో ర్యాంకుల్లో నిలిచారు. అగ్రికల్చర్‌లో జూటూరి నేహా మొదటి స్థానం సాధించింది. వంటాకు రోహిత్‌, కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డిలకు 2, 3 ర్యాంకులు దక్కాయి. వీరంతా ఏపీవారే. తెలంగాణకు చెందిన కొత్తపల్లి మహీత్‌ అంజన్‌ 4వ ర్యాంకు సాధించాడు. ఏపీ విద్యార్థి గుంటుపల్లి శ్రీరాంకు 5వ ర్యాంకు వచ్చింది.


కౌన్సెలింగ్‌పై సలహాలకు సెల్‌

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం ఈ ఏడాది ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సబిత ప్రకటించారు. కౌన్సెలింగ్‌ వివరాలు కావాల్సిన వారు ఈ సెల్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఎంసెట్‌ ఫలితాల అనంతరం ఆమె మాట్లాడారు. ఈ ఏడాదికి సంబంధించి ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుపై ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయం తీసుకుని.. ప్రభుత్వానికి తెలియజేస్తుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎంసెట్‌ ఫలితాల వెల్లడిలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్స్‌లర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.


21 నుంచి కౌన్సెలింగ్‌!

ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి అధికారులు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 29 వరకు విద్యార్థులు స్లాట్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 9న సీట్లను కేటాయించనున్నారు. రెండో దశ కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానుంది. సీట్లను అక్టోబరు 4న ప్రకటించనున్నారు. మూడో దశ కౌన్సెలింగ్‌ అక్టోబరు 11 నుంచి ప్రారంభమవుతుంది. 17న సీట్లను కేటాయించనున్నారు. ఇంజనీరింగ్‌ సీట్లు పొందినవారు అక్టోబరు 17 నుంచి 21 మధ్య కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మూడు దశల తర్వాతా సీట్లు మిగిలితే అక్టోబరు 20న స్పాట్‌ అడ్మిషన్లు  నిర్వహిస్తారు.


ఎంసెట్‌ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ఎంసెట్‌ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇంజనీరింగ్‌లో 13 మంది  5 వేల లోపు, 41 మంది 10 వేల లోపు ర్యాంకులు సాధించారు. అగ్రిలో ఆరుగురు వెయ్యిలోపు, 87 మంది 5 వేల లోపు, 189 మంది   10 వేల లోపు ర్యాంకులు సాధించారు. వీరిని మంత్రి కొప్పుల ఈశ్వర్‌, సంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ అభినందించారు. బీసీ గురుకులాల్లో ఇంజనీరింగ్‌లో 14 మంది, మెడికల్‌లో 16 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. కాగా,  ఈసెట్‌ ఫలితాల్లో 90.69 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 22,001 మంది పరీక్ష రాయగా 19,954 మంది అర్హత సాధించారు.


డాక్టర్ల ఇంటి నుంచి వచ్చి..

తెలంగాణ అగ్రికల్చర్‌లో టాపర్‌గా నిలిచిన నేహా స్వస్థలం ఏపీలోని తెనాలి. తల్లిదండ్రులు డాక్టర్‌ శివప్రసాద్‌బాబు, డాక్టర్‌ శ్రీవిద్య వైద్యులు. నేహా అన్నయ్య రుత్విక్‌ ఎంబీబీఎస్‌ చేస్తున్నాడు. ఇంటర్‌లో నేహా 988 మార్కులు సాధించింది. నీట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యానని ఆమె తెలిపింది. కచ్చితంగా నీట్‌లో సీట్‌ వస్తుందని చెప్పింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలని, న్యూరాలజిస్ట్‌ కావడమే లక్ష్యంగా పేర్కొంది.


వైద్యుడిగా స్థిరపడతా.. రోహిత్‌

ఎంసెట్‌ అగ్రికల్చర్‌లో రెండో ర్యాంకులో నిలిచిన వంటాకు రోహిత్‌ది ఏపీలోని అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పొడుగుపాలెం. పదో తరగతి వరకూ నర్సీపట్నంలో, ఇంటర్‌ రాజమండ్రిలో చదివాడు. వైద్యుడిగా స్థిరపడాలన్నది తన లక్ష్యమన్నాడు. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. కాగా రోహిత్‌ ఏపీ ఎంసెట్‌లో 88వ ర్యాంకు సాధించాడు. రోహిత్‌ తండ్రి గౌరినాయుడు 1998 డీఎస్సీలో ఎంపికైనా ఉద్యోగం రాకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నారు.


ఎంబీబీఎస్‌ నా లక్ష్యం 

‘‘నన్ను వైద్యుడిగా చూడాలన్నది అమ్మానాన్నల కోరిక. నీట్‌ కోసం ఎంతో ఇష్టంగా చదివా. ఏపీ ఎంసెట్‌లో 54వ ర్యాంకు వచ్చింది. టీఎస్‌ ఎంసెట్‌లో 4వ ర్యాంకు వచ్చింది. నీట్‌లో మంచి ర్యాంకు తెచ్చుకొని ఎంబీబీఎస్‌ చేస్తా. నాన్న శ్రీనివాసరావు అర్కిటెక్చర్‌, అమ్మ మాధవి గృహిణి’’ అని కొత్తపల్లి మహిత్‌ అంజన్‌ తెలిపాడు.


ప్రతిభావంతుడు లోహిత్‌రెడ్డి

తెలంగాణ ఎంసెట్‌లో టాపర్‌గా నిలిచిన లోహిత్‌రెడ్డి చదువులో చురుకు. వీరి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదఇర్లపాడు. తండ్రి మాల్యాద్రిరెడ్డి, తల్లి లక్ష్మీకాంతం ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతి వరకు ఏపీలో చదివిన లోహిత్‌ హైదరాబాద్‌ హైటెక్స్‌లోని కార్పొరేట్‌ క ళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. 979 మార్కులు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో రెండోస్థానంలో నిలిచాడు. జేఈఈ మెయిన్స్‌లో 300 మార్కులకు 290 మార్కులు సాధించి ఆల్‌ ఇండియాలో 27వ ర్యాంక్‌తో మెరిశాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేయడమే తన లక్ష్యంగా చెప్పాడు. 


ముంబై ఐఐటీ లక్ష్యం

ఏపీలోని విజయనగరం జిల్లా రేగిడి మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన సాయిదీప్తిక తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్‌తో మెరిసింది. ఏపీ ఎంసెట్‌లో 37వ ర్యాంక్‌ సాధించింది. సాయిదీప్తిక 4వ తరగతి వరకు హైదరాబాద్‌లో, ఇంటర్‌ వరకు విజయవాడలో చదివింది. ఈమె తండ్రి జయరామ్‌ ఇంజినీర్‌. వీరి కుటుంబం 2014 నుంచి విజయవాడలో ఉంటోంది. ముంబై ఐఐటీలో సీఎ్‌సఈ చేయడమే తన లక్ష్యమని సాయిదీప్తిక తెలిపింది. 


టీ-ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకులో నిలిచిన జలజాక్షిది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి. ఈమె జేఈఈలో 9వ ర్యాంకు సాఽధించింది. తండ్రి గోవిందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. జలజాక్షి విజయవాడలో ఇంటర్‌ పూర్తిచేసింది. ఇక 5వ ర్యాంకు సాఽధించిన హిమవంశీ శ్రీకాకుళం నగరానికి చెందినవాడు. 

Updated Date - 2022-08-13T09:39:48+05:30 IST