చలో మునుగోడు

ABN , First Publish Date - 2022-09-11T08:53:48+05:30 IST

చలో మునుగోడు

చలో మునుగోడు

నియోజకవర్గానికి క్యూ కట్టనున్న నేతలు

చవితి వేడుకలు ముగియడంతో ఉప ఎన్నికపై దృష్టి

నేడు బీజేపీ నేత సునీల్‌ బన్సల్‌ రాక.. పార్టీ పాత, కొత్త నేతలతో కమిటీల ఏర్పాటు

18 నుంచి కాంగ్రెస్‌ దిగ్గజాల ప్రచారం.. ఆత్మీయ సమ్మేళనాల తర్వాతే టీఆర్‌ఎస్‌ మకాం!


నల్లగొండ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ తన అభ్యర్థిని ఖరారు చేయడం, చవితి వేడుకలు ముగియడంతో ప్రధాన పార్టీల నేతలు మునుగోడు బాటపడుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి నెలరోజులు అవుతున్నా, ఆ పార్టీ నేతలతో సమన్వయం లేకుండాపోయింది. బీజేపీలో తనకున్న ముగ్గురు, నలుగురు బిగ్‌ షాట్స్‌తోనే ఆయన ఇంతకాలం ప్రచారం చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లోనే సంప్రదింపులు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయికి చేరుకోలేదు. ఈ అగాధాన్ని పూడ్చాలని నిర్ణయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సంగ్రామ యాత్ర రాష్ట్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ ప్రదీ్‌పకుమార్‌ను శుక్రవారం మునుగోడుకు పంపారు. ఈ ఇరువురితోపాటు చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌, తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌ ఆదివారం మునుగోడుకు రానున్నారు. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్‌కమిటీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. బన్సల్‌ పర్యటన తదుపరి నియోకవర్గంలో బూత్‌ కమిటీలు, శక్తికేంద్రాలు, రాష్ట్రంలోని కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. బన్సల్‌ పర్యటన ఏర్పాట్లతోపాటు, కమిటీల ఏర్పాటు పాత, కొత్త నేతల మధ్య సమన్వయానికి సంబంధించి మర్రిగూడలో కీలక నేతల భేటీలో చర్చ సాగినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధికారికంగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్రవంతి హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కీలక నేతలందరినీ కలిసి మునుగోడులో తన గెలుపునకు కలిసి రావాల్సిందిగా కోరారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పాటు.. సీనియర్‌ నేతలు మధుయాష్కీ, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీని కలివారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, అభ్యర్థి స్రవంతితో ఆదివారం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన ఇంట్లో భేటీ అయ్యారు. ఉపఎన్నికలో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని కృష్ణారెడ్డికి ఆయన వివరించారు. కాగా, ఈనెల 18 నుంచి కీలక నేతలంతా మునుగోడు బాటపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలు, కొత్తగా ఏర్పడిన గుట్టప్పల మండలంతోపాటు, చౌటుప్పల్‌ మునిసిపాలిటీకి ఇన్‌చార్జులను, వారికి సహాయకులుగా పార్టీ కీలక నేతలను నియమిస్తూ అధిష్ఠానం ఆదివారం జాబితా విడుదల చేసింది.  


సమ్మేళనాల తర్వాతే టీఆర్‌ఎస్‌ ప్రచారం

ఈ నెల 15వ తేదీ నుంచి మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ మేరకు మండలాలు, గ్రామాలవారీగా నేతల జాబితాను పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే ఈ జాబితాను సీఎం కేసీఆర్‌ అధికారికంగా ఖరారు చేయకపోవడం, ఈ నెల 11నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారంపాటు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట వనభోజనాలు నిర్వహించాలని నిర్ణయించడం, వర్షాలు విస్తృతంగా కురుస్తుండటంతో అధికార పార్టీ నేతల మునుగోడు మకాంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ‘టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన తదుపరి ఆశావహులను సీఎం కేసీఆర్‌ పిలిచి మాట్లాడి వారిని భాగస్వాములను చేస్తారు’ అని జిల్లాకు చెందిన కీలకనేత ఒకరు తెలిపారు. కాగా, మర్రిగూడ మండలంలోని లెంకెలపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎంపీటీసీ అయితగోని వెంకటయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్‌ బొమ్మ ఉన్న గోడ గడియారాలను ఉచితంగా అందించారు. 

Updated Date - 2022-09-11T08:53:48+05:30 IST