గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-06T02:26:38+05:30 IST

అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై స్పందించారు. బడ్జెట్ సెషన్స్‌లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై ఆగ్రహం

హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై స్పందించారు. బడ్జెట్ సెషన్స్‌లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కొనసాగింపులో భాగంగానే.. బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్న ప్రభుత్వ వైఖరి సరికాదని తప్పుబట్టారు. ప్రభుత్వం 5 నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తూ.. కొనసాగింపు అనడం అనైతికమని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామని ప్రకటించారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తెలిపారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని కోల్పోతున్నారని తమిళిసై పేర్కొన్నారు. ఈనెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీలో గవర్నర్‌ అడుగు పెట్టకుండానే ఈ సారి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


ఇటీవల పరిణామాలు చూస్తుంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు మధ్య విభేదాలు బాగా ముదిరిపోయాయన్న చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ముదిరిన వివాదం కారణంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయితే, రాజకీయ పార్టీల మధ్య ఉన్న పొరపొచ్చాలు, వివాదాలకు వ్యవస్థలను బలి చేయవద్దని, రాజ్యాంగపరమైన పదవులకు విలువ ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ... ప్రభుత్వం ఇ లాంటి అభిప్రాయాలు, విమర్శలను ఏమాత్రం లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. 


గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతోంది. గవర్నర్‌ కోటా కింద పాడి కౌశిక్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదం రాజుకుంది. ప్రతిసారి గణతంత్ర వేడుకలను పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహిస్తారు. కానీ.. ఒమైక్రాన్‌ కేసుల కారణంగా ఈ ఏడాది జనవరి 26న ఉత్సవాలను పరిమిత సంఖ్యలో రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలంటూ ప్రభుత్వం నుంచి షెడ్యూలు వెలువడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న అభిప్రాయాలు అప్పట్లో వెలువడ్డాయి.

Read more