డ్రగ్స్‌ పేరుతో టాబ్లెట్‌ పౌడర్‌

ABN , First Publish Date - 2022-02-09T16:25:30+05:30 IST

మెడికల్‌ దుకాణాల్లో లభించే టాబ్లెట్‌ పౌడర్‌ను డ్రగ్స్‌ పేరుతో విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఐదుగురితోపాటు మెడికల్‌ షాపు నిర్వాహకుడిని కూకట్‌పల్లి పోలీసులు

డ్రగ్స్‌ పేరుతో టాబ్లెట్‌ పౌడర్‌

ఆరుగురి అరెస్టు 

హైదరాబాద్/కూకట్‌పల్లి: మెడికల్‌ దుకాణాల్లో లభించే టాబ్లెట్‌ పౌడర్‌ను డ్రగ్స్‌ పేరుతో విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ఐదుగురితోపాటు మెడికల్‌ షాపు నిర్వాహకుడిని కూకట్‌పల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన సూరజ్‌ తపా(21), పురన్‌ బహదూర్‌(20), బిషోకరం రాజ్‌కుమార్‌(25) మాదాపూర్‌లో నివసిస్తూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. బిసాహల్‌ గురుంగ్‌(22) జూబ్లీహిల్స్‌లో నివసిస్తూ పంజాగుట్టలో చైనీస్‌ హోటల్‌లో పనిచేస్తున్నాడు. వీరంతా స్నేహితులు. వీరికి పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చి జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న బ్యూటీషియన్‌గా పనిచేసే బీమ్లాదేవి(40) తో పరిచయం ఏర్పడింది. అందరూ గ్రూపుగా ఏర్పడి పబ్‌లకు వెళ్లే యువతకు డ్రగ్స్‌ పేరుతో మెడికల్‌ దుకాణంలో లభించే టాబ్లెట్‌ పౌడర్‌ను విక్రయించాలని నిర్ణయించుకొన్నారు. వెంకటగిరిలోని మెడికల్‌ జనరల్‌ స్టోర్‌లో ప్రిస్ర్కిప్షన్‌ లేకుండానే ట్రమాటాస్‌ పేరుతో ఉండే టాబ్లెట్స్‌ కొనుగోలు చేసేవారు. ట్యాబ్లెట్‌ పౌడర్‌ను చిన్నచిన్న ప్యాకెట్లు చేసి మత్తు డ్రగ్స్‌ పేరుతో రూ. 2 వేల నుంచి 5 వేల వరకు ఒక్కో ప్యాక్‌ విక్రయిస్తున్నారు. 


ఇలా పట్టుబడ్డారు

కూకట్‌పల్లిలోని ఐడీఎల్‌ చెరువు వద్ద సోమవారం సూరజ్‌ తపా, పురన్‌ బహదూర్‌, బిషోకరం రాజ్‌కుమార్‌, బిసాహల్‌ గురుంగ్‌ నిలబడి మాట్లాడుకొంటున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన పోలీస్‌ పెట్రోల్‌ వాహనం చూసి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పరిశీలించగా తెల్లని పౌడర్‌ లభించింది. విచారించగా టాబ్లెట్‌ పౌడర్‌ను డ్రగ్స్‌ పేరుతో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. ఐదుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. మెడికల్‌ దుకాణంలో పనిచేసే దాస్య లింగరాజు(32)ను కూడా అరెస్టు చేశారు.  

Updated Date - 2022-02-09T16:25:30+05:30 IST