ప్రాణాలు తీసిన ఈత సరదా!

ABN , First Publish Date - 2022-04-04T09:50:44+05:30 IST

ఆ ముగ్గురూ.. ఆరు, నాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం బడికి సెలవు కావడంతో.. సరదాగా చెరువులో ఈత నేర్చుకోవాలనుకున్నారు..

ప్రాణాలు తీసిన ఈత సరదా!

  • చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

ధర్మపురి, ఏప్రిల్‌ 3: ఆ ముగ్గురూ.. ఆరు, నాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం బడికి సెలవు కావడంతో.. సరదాగా చెరువులో ఈత నేర్చుకోవాలనుకున్నారు. ఇందుకుగాను సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సరదానే వాళ్ల పాలిట శాపమైంది. వారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13).. ఈ విషాధ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయమే ఈ ముగ్గురు బాలురూ గ్రామ సమీపంలోని ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. అలా.. సరదాగా ఈత నేర్చుకునేందుకు ముగ్గురూ చెరువులో దిగారు. అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో.. ఆ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక.. ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు విడిచారు. చెరువు వద్ద వీరి చెప్పుల్ని గుర్తించిన గ్రామస్థులు.. గాలించగా.. ముగ్గురి మృతదేహాలూ బయటపడ్డాయి. మృతుల్లో శరత్‌.. ఆరో తరగతి చదువుతుండగా.. యశాంత్‌, నవదీప్‌ నాలుగో తరగతి చదువున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-04T09:50:44+05:30 IST