వైద్యంపై నిఘా

ABN , First Publish Date - 2022-03-05T06:25:00+05:30 IST

రాష్ట్రంలో ప్రజావైద్యంపై సర్కారు నిఘా పెట్టనుంది. క్షేత్రస్థాయి

వైద్యంపై నిఘా

  • క్షేత్రస్థాయి ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
  • పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీదవాఖానాల్లో ఏర్పాటు
  •  కెమెరాల ఇన్‌స్టలేషన్‌  బాధ్యత ఈసీఐఎల్‌కు
  • డాక్టర్‌, ఫార్మసిస్టు, ఓపీ, ల్యాబ్‌లలో ఏర్పాటు 
  • ఏప్రిల్‌ 1నుంచి అమలు 
  • చేయాలని సర్కారు నిర్ణయం
  • సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 
  • నేటి నుంచి ‘హెల్త్‌ ప్రొఫైల్‌’
  • ప్రారంభించనున్న మంత్రులు 
  • కేటీఆర్‌, హరీశ్‌రావు 


హైదరాబాద్‌, మార్చి 4(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజావైద్యంపై సర్కారు నిఘా పెట్టనుంది. క్షేత్రస్థాయి ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక  ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో  రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్‌సీలు, బస్తీదవాఖానల్లో ఈ సీసీ కెమరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణవ్యాప్తంగా పీహెచ్‌సీలు 636,  బస్తీదవాఖానాలు 259, యూపీహెచ్‌సీలు 232 ఉన్నాయి. వీటన్నింటిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.


ఇప్పటికే హైదరాబాద్‌లోని కుషాయిగూడ యూపీహెచ్‌సీలో పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. వీటిని సరఫరా చేసే బాధ్యత ఈసీఐఎల్‌కు అప్పగించారు. ఇన్‌స్టలేషన్‌ కూడా ఈ ప్రభుత్వరంగ సంస్థే చేయనుంది. శుక్రవారం ఈసీఐఎల్‌ ఉన్నతాధికారులతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు దీనిపై చర్చించారు. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 4 సీసీ కెమెరాలను ఏర్పాటు  చేస్తారు. ఒకటి మెడికల్‌ ఆఫీసర్‌ రూమ్‌లో ఉంటుంది. మరొకటి ఫార్మసీ, ఇంకొకటి ల్యాబ్‌లో ఉంటుంది. ఇంకో కెమెరాను అవుట్‌పేషంట్‌ రూమ్‌లో ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలు వీటిపై పర్యవేక్షణ చేస్తారు.


కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు కలుపుతారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ను ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే సచివాలయంతో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయానికి కూడా అనుసంధానం చేస్తారు. దీంతోపాటు మొబైల్‌యా్‌పలో  మంత్రి, ఇతర విభాగాధిపతులు ఎప్పటికప్పుడు చూసేలా కనెక్టు చేస్తారు. 


పనితీరుపై పర్యవేక్షణ

క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యసిబ్బంది సరిగా పనిజేయడం లేదన్నది బహిరంగ ఆరోపణ. అసలు సరిగా ఆస్పత్రులకే రారు అన్న అపవాదు ఉంది. మరోవైపు ఓపీ లేకున్నా... చాలా ఎక్కువగా వస్తున్నట్లు కొన్ని ఆస్పత్రులు చూపుతున్నాయి. అందుకే ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2022-03-05T06:25:00+05:30 IST