వైద్య కళాశాలలపై నిఘా నేత్రం!

ABN , First Publish Date - 2022-08-04T10:45:29+05:30 IST

వైద్య విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) వైద్య కళాశాలలపై నిఘా పెట్టింది.

వైద్య కళాశాలలపై నిఘా నేత్రం!

  • ఎన్‌ఎంసీలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌.. 
  • ప్రతి వైద్య కాలేజీలోనూ సీసీ కెమెరాలు.. 
  • ఏర్పాటుకు ఈ నెల 31 తుది గడువు
  • కేంద్ర ధ్రువీకృత ఏజెన్సీల వద్దే కెమెరాలు కొనాలి!
  • అధ్యాపకులకు ‘ఆధార్‌’ బయోమెట్రిక్‌ హాజరు 
  • బోధనాస్పత్రుల్లో హెచ్‌ఎంఎస్‌ విధానం 
  • మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్‌ఎంసీ


హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : వైద్య విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) వైద్య కళాశాలలపై నిఘా పెట్టింది. ఇందులో భాగంగా రెండు  కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. అలాగే వైద్యవిద్య అధ్యాపకులందరికీ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరును అమలు చేయనుం ది. ఈ మేరకు బుధవారం అన్ని రాష్ట్రాలకు లేఖ రా సింది. అందులో కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెలాఖరులోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. 31లోగా ఈ పని పూర్తి కావాలని తెలిపింది. సీసీ కెమెరాలను కేంద్రం సర్టిఫైడ్‌ చేసిన ఏజెన్సీల వద్దే కొనుగోలు చేయాలంది. ప్రతి మెడికల్‌ కాలేజీ విధిగా 25 సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించింది. వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో కూడా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే ఈ ఐటీ ప్రాజెక్టు అమలు కోసం ప్రతి మెడికల్‌ కాలేజీ విధిగా ఇద్దరు నోడల్‌ అధికారులను నియమించుకోవాలని పేర్కొంది. మరోవైపు బోధనాస్పత్రుల్లో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎంఎస్‌) విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. 


ఈ విధానంలో ఆస్పత్రుల్లో రోగుల సంఖ్యను పర్యవేక్షించనుంది. అలాగే ఇతర ప్రామాణికాలు సరిగా ఉన్నాయో లేదో అనే అంశాలనూ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. ఎన్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఈ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరును అనుసంధానం చేస్తారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని భారీ తెరలో అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పటికే కొన్ని వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేసినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. గాంధీ మెడికల్‌ కాలేజీలో సీసీ కెమెరాలను గతంలోనే అమర్చారు. ప్రస్తుతం వాటిని ఢిల్లీలోని ఎన్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అక్కడి నుంచే గాంధీ మెడికల్‌ కాలేజీలోని అన్ని విభాగాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఇలా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను ఎన్‌ఎంసీ నిత్యం పర్యవేక్షించనుంది.


ఆన్‌లైన్‌లో హాజరు.. 

వైద్య కళాశాలలు అనగానే అధ్యాపకులు సరిగా రారు, పాఠాలు చెప్పరనే అభిప్రాయం ఉంటుంది. దీంతో వైద్యవిద్యలో నాణ్యత కొరవడుతోందన్న భావన ఏర్పడింది. అందుకే ఎన్‌ఎంసీ అధ్యాపకులకు ఆన్‌లైన్‌ హాజరు విధానం తీసుకొస్తున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కాలేజీలోని ప్రతి అధ్యాపకుడు విధిగా ఆధార్‌ లింకు ఉండే బయోమెట్రిక్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పనిచేసే కాలేజీ ఐపీ అడ్ర్‌సను కూడా రిజిస్టర్‌ చేస్తారు. ఉదయం కాలేజీకి రాగానే విఽధిగా బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్ర వేసి క్లాస్‌కు వెళ్లాలి. తొలుత బయోమెట్రిక్‌ ఉంటుందని, ఆ తర్వాత ముఖకవళికల ద్వారా గుర్తించే విధానంలో హాజరు ఉంటుందని వైద్యవర్గాలు తెలిపాయి. ఫలితంగా ప్రతి అధ్యాపకుడు విధిగా కాలేజీకి రావాల్సి ఉంటుంది. వారి హాజరును కూడా ఎన్‌ఎంసీ ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

  

కాలేజీల ఆటలు చెల్లవు..

ఎన్‌ఎంసీ ఈ విధానం తీసుకురావడానికి చాలా కారణాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో వైద్య కళాశాలలు ఉన్నాయి. వాటన్నింటినీ నిత్యం తనిఖీలు చేయాలంటే సాధ్యం కావడం లేదు. ఇక తనిఖీలకు వెళ్లినా.. అంతా నిబంధనల మేరకు ఉన్నట్లు కాలేజీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. అప్పటికప్పుడు అద్దె అధ్యాపకులను, రోగులను చూపిస్తున్నాయి. దీంతో తనిఖీ బృందాలు ‘అంతా బాగుందన్న’ రిపోర్టును ఎన్‌ఎంసీకి ఇస్తున్నాయి. కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఎంసీ ఆకస్మిక తనిఖీ చేసింది. అందులో తెలంగాణ కూడా ఉంది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పాటు అనేక లోపాలు బయటపడ్డాయి. దీంతో మన రాష్ట్రంలో కొన్ని కాలేజీల అనుమతులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీయే స్వయంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అధ్యాపకులకు ఆన్‌లైన్‌ హాజరు విధానాన్ని తీసుకొస్తోంది. దీంతో క్లాసులు జరుగుతున్న తీరు, బోధానస్పత్రుల్లో ఎంతమంది రోగులు ఉన్నారు? అధ్యాపకుల హాజరు.. ఇలా అన్నీ ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇకపై వైద్య కళాశాలల ఆటలు చెల్లవని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read more