Supreme court: బీసీ జాబితాలో కులాల తొలగింపుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరణ

ABN , First Publish Date - 2022-10-11T20:12:11+05:30 IST

బీసీ కులాల జాబితాపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది.

Supreme court: బీసీ జాబితాలో కులాల తొలగింపుపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: బీసీ కులాల జాబితాపై సుప్రీంకోర్టు (Supreme court)లో మంగళవారం విచారణ ముగిసింది. బీసీ ఉపకులాల జాబితా నుంచి కొన్ని కులాల తొలగింపుపై జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. కేటగిరీ మార్పులపై పరిస్థితులకు అనుగుణంగా అధ్యయం చేసి చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల బీసీ కమిషన్‌లను సుప్రీం కోర్టు ఆదేశించింది. బీసీ-డి కేటగిరీలో ఉన్న కులాలను బీసీ-ఎ లోకి మార్చిన వ్యవహరంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ముగించింది. 2010లో దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిస్తూ... రెండు రాష్ట్రాల బీసీ కమిషన్లకు పలు సూచనలు జారీ చేసింది. 2009లో బీసీ-డి కేటగిరీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఎ లోకి మార్చుతూ అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై జాతీయ మత్య్సకారుల సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా... విచారణ అనంతరం జీఓను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.


హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2010లో ముదిరాజ్‌ సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముదిరాజ్‌ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ పలు కులాల సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం అన్ని కులాల నిష్పత్తిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ఇరు బీసీ కమిషన్‌లను ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. అలాగే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించింది. బీసీ - డి కేటగిరీలో ఉన్న కులాలను బీసీ - ఎ కి మార్చడం వల్ల వచ్చే లాభనష్టాలు ఏమిటో స్పష్టంగా అధ్యయనం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 

Updated Date - 2022-10-11T20:12:11+05:30 IST