Sunil Kanugolu: వ్యూహకర్తలపై గురి
ABN , First Publish Date - 2022-12-15T02:25:12+05:30 IST
: రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఇక అడ్డుకట్ట పడుతుందా? ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయా? తాజాగా సునీల్ కనుగోలు సంస్థపై ...
సునీల్ కనుగోలు టీంపై తొలి దెబ్బ
కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నందునే..!
అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నదీ ఇదే
ఐప్యాక్‌ను నియమించుకున్న బీఆర్ఎస్
బీజేపీ వ్యూహకర్తగా ‘నేషన్ విత్ నమో’
అభ్యంతరకర పోస్టుల్లో పార్టీల బరితెగింపు
ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన సంప్రదాయం
ఏపీలో గత ఎన్నికల సమయంలో పరాకాష్ఠకు
సునీల్ కనుగోలు బృందం అరెస్టుతో చర్చ
వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ తప్పని కేసులు!
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలకు వ్యూహకర్తలుగా పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఇక అడ్డుకట్ట పడుతుందా? ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయా? తాజాగా సునీల్ కనుగోలు సంస్థపై పోలీసులు దాడి చేసి కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. సునీల్ సంస్థ.. టీఆర్‌ఎ్‌సపై, సీఎం కేసీఆర్ కుటుంబంపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నందునే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంస్థ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తోంది. మరోవైపు అన్ని పార్టీలూ ఇలాంటి వ్యూహకర్తలను నియమించుకున్నాయి. అవి కూడా ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల తరఫున పనిచేసే సంస్థలపైనా చర్యలు ఉండాలన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ అవాంఛిత క్రీడ నాలుగైదు సంవత్సరాల క్రితం మొదలైంది. ప్రస్తుతం తారస్థాయికి చేరుకుంది. ఈ ఆటకు ఆద్యుడు ప్రశాంత్ కిశోర్ కాగా.. ప్రస్తుతం ఆయన దారిలో అనేకమంది నడుస్తున్నారు. ఇప్పటివరకు ఈ అరాచక ప్రచారాలు కొనసాగాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి కేసులు నమోదు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది కానీ, ఈ విషయంలో ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు. అన్ని పార్టీలు ఈ రాజకీయ వ్యూహకర్తలపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ఏరోజుకారోజు ప్రత్యర్థులపై ఎలాంటి ఆరోపణలు చేయాలి, వారు చేసే ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి అనే విషయాల్లో ఈ సంస్థలపైనే ఆధారపడుతున్నాయి. చివరకు ఎన్నికల సమయంలో వ్యూహాలను ఎలా రచించాలి, వాటిని ఎలా అమలు చేయాలనే అంశాలను కూడా వీరే చెబుతున్నారు. దాంతో ఇలాంటి సంస్థలు, వ్యక్తుల అరాచకాలకు అడ్డులేకుండా పోయింది. వాస్తవాలను వాస్తవాలుగా కాకుండా వాటిని వక్రీకరించి సమాజంలోకి వదిలిపెడుతున్నారు. తద్వారా సమాజంలోని కొన్ని వర్గాలు వాటిని నమ్ముతూ వస్తున్నాయి.
ఏపీలో జరిగిన అరాచకం...
సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలను, సమాజంలోని వివిధ వర్గాలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలోనే పరాకాష్ఠకు చేరుకున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీకి సేవలందించిన ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలోని బృందం టీడీపీకి వ్యతిరేకంగా చేయని పనులు లేవు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నాయకుల మద్దతుతో వారు అరాచకమే హద్దుగా చెలరేగిపోయారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఓడించడం, వైసీపీని గెలిపించడమే లక్ష్యంగా.. కులాల వారీగా చిచ్చు పెట్టారు. మతాల వారీగా రెచ్చగొట్టారు. మహిళలను కించపరుస్తూ అవమానించారు. దీనిని ఒక యజ్ఞంగా నిర్వహించారు. ఉదాహరణకు.. ఎన్నిక ల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఒక సభలో మాట్లాడుతూ, తన ప్రభుత్వ హయాంలో అవినీతిపరులను అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించానని, వారికి నరకం చూపించానని ప్రసంగిస్తే... ఆ వీడియోను ఎడిట్ చేసి తన పాలనలో ప్రజలకు నరకం చూపానని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. అందుకోసం నకిలీ అకౌంట్లను కుప్పలు తెప్పలుగా తెరిచారు. పోస్ట్‌కు రూ.5 చొప్పున డబ్బులు ఇస్తూ, వేలాది మందితో వీటిని ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఇలా అనేక అంశాల్లో టీడీపీని టార్గెట్ చేస్తూ అబద్ధ ప్రచారానికి పూనుకున్నారు. ఈ తతంగం ఎన్నికల తర్వాత కూడా కొనసాగింది. చివరకు జడ్జిల పట్ల కూడా ఇలాంటి ప్రచారానికి పూనుకోవడంతో కోర్టులు సీరియ్‌సగా తీసుకున్నాయి. దాంతో కొంత నియంత్రణలోకి వచ్చింది. ఇలాంటి అవాస్తవ ప్రచారం కారణంగా మహిళలు కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. మహిళా నాయకురాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అవాస్తవాలను ప్రచారంలో పెట్టేవారు. దాంతో వారు భయపడి బయటకు మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.
అదే బాటలో...
తెలంగాణలో ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నాయి. తమ పార్టీకి మద్దతుగా, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా విష ప్రచారానికి పూనుకుంటున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐప్యాక్ సేవలు అందిస్తుండగా, షర్మిల పార్టీకి సైతం ఐప్యాక్ సహకరిస్తోంది. ఐప్యాక్ సంస్థ లోట్‌సపాండ్ కేంద్రంగా తన కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. అలాగే బీజేపీకి ‘నేషన్ విత్ నమో’ సంస్థ రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. ఈ సంస్థ తన కార్యకలాపాలను బీజేపీ రాష్ట్ర పార్టీ కోసం కొనసాగిస్తోంది. పార్టీ పేరు, ఐటీ సెల్ పేర్లతో కాకుండా వేర్వేరు పేర్లతో సోషల్ మీడియాలో గ్రూపులు ప్రారంభించి ప్రత్యర్థి పార్టీలపై అభ్యంతరకర పోస్టులు వీరికి సర్వసాధారణంగా మారాయి. తాజా ఘటన నేపథ్యంలో రాజకీయ పార్టీల తరఫున సేవలు అందిస్తున్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులూ కేసులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.