రామకృష్ణ ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. మృతుడి తల్లి, సోదరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-11T00:37:21+05:30 IST

భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి

రామకృష్ణ ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. మృతుడి తల్లి, సోదరి అరెస్ట్‌

భద్రాద్రి కొత్తగూడెం:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో సోమవారం మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కొత్తగూడెం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో ఏ-3, ఏ-4గా ఉన్న లోగ మాధవి(నాగరామకృష్ణ సోదరి), మండిగ సూర్యావతి(నాగరామకృష్ణ తల్లి)లను పోలీసులు సోమవారం ఉదయం పాతపాల్వంచలో అదుపులోకి తీసుకున్నారు. విచారణ, వైద్య పరీక్షల అనంతరం ఇద్దరినీ కొత్తగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14రోజుల రిమాండ్‌ విధిస్తూ ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పోలీసులు వారిని ఖమ్మం జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 


జైల్లో రాఘవకు రిమాండ్‌ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్‌ నెం.1లో అతడిని ఉంచారు. వాస్తవానికి రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో అతడిని భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ అతడిని ఖమ్మం జైలుకు  తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-01-11T00:37:21+05:30 IST