ఆవులదే ధ్వంస రచన.. శిష్యులదే పాత్ర!
ABN , First Publish Date - 2022-06-25T09:19:45+05:30 IST
సికింద్రాబాద్ రైల్వే ఆస్తుల ధ్వంసం, అల్లర్ల కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విధ్వంసంలో

తన అకాడమీలు మూతబడతాయనే.. శిష్యులను రెచ్చగొట్టిన సుబ్బారావు
సుబ్బారావుతోపాటు ఏడుగురికి గాంధీలో పరీక్షల నిర్వహణ
అనంతరం రైల్వే పోలీసులకు అప్పగింత
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ రైల్వే ఆస్తుల ధ్వంసం, అల్లర్ల కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం విధ్వంసంలో అతడి శిష్యుల పాత్ర ఉన్నట్లు పోలీసులు తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ శిక్షణకు సంబంధించి ఆవులకు అకాడమీలు ఉన్నాయని, ‘అగ్నిపథ్’తో అవి మూతపడే అవకాశం ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే యువకులను రెచ్చగొట్టి విధ్వంసానికి ప్రణాళిక రచించాడని తేల్చారు. విధ్వంసంలో మిగతా అకాడమీ నిర్వాహకుల పాత్ర ఉందా? అని ఆరా తీస్తున్నారు. మరోవైపు.. ఆవులతో పాటు మరో ఏడుగురు నిందితులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు.
అయితే ఆవులను రైల్వే పోలీసులకు అప్పగించే క్రమంలో హైడ్రామానే నడిచింది. ఆవులను అరెస్టు చేసిన తర్వాత విచారించే క్రమంలో రైల్వే పోలీస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మధ్య విభేదాలు బయటపడినట్లు తెలుస్తోంది. మంగళవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆవులను ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. శుక్రవారం వరకు ఆవులతో పాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చూపించలేదు. దాంతో ఆవుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇది తెలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం సుబ్బారావు సహా మరో ఏడుగురు నిందితులను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వేపోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వారికి అప్పగించేందుకు ప్రయత్నించారు. ముందస్తు సమాచారం లేకుండా తమకు అప్పగించడంపై రైల్వే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారిని అధీనంలోకి తీసుకోవాడానికి ఎస్సై మాజిద్ అంగీకరించకుండా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసుల తీరును తప్పుబట్టారు. నిందితుల తరఫున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైతే తమకే సంబంధం లేకుండా బయటపడొచ్చనే ఉద్దేశంతోనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇలా హడావిడిగా నిందితులను రైల్వే పోలీసులకు అప్పగించి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిందితులను అప్పగిస్తున్న సమయంలో వారికి భోజనం పెట్టించలేదని, అది కూడా తెప్పించి పెట్టండి అంటూ రైల్వే పోలీసులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్పడం కొసమెరుపు. రిమాండ్ రిపోర్టు తయారు చేసుకోకపోవడం, ఇంకోవైపు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అకస్మాత్తుగా తెచ్చి అప్పగించడంతో రైల్వే పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండు చేయలేపోయినట్లు తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చే సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్యే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.