TS Assembly KCR: కేంద్రం ఆంక్షలపై అసెంబ్లీ వేదికగా సమరం

ABN , First Publish Date - 2022-11-25T04:25:24+05:30 IST

అప్పులపై ఆంక్షలు విధించిన కేంద్రంపై దాడి చేయడానికి డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

TS Assembly KCR:  కేంద్రం ఆంక్షలపై అసెంబ్లీ వేదికగా సమరం

డిసెంబరులో వారంపాటు శాసన సభ సమావేశాలు

నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం

అప్పులపై మోదీ సర్కారు తీరుతో 40 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ప్రజలకు వివరించే ప్రణాళిక

ఏర్పాట్లుచేయాలని హరీశ్‌, ప్రశాంత్‌రెడ్డికి ఆదేశం.. రాష్ట్ర ప్రభుత్వ అప్పు అంచనా రూ.76,645 కోట్లు

కేంద్ర సర్కారు అనుమతి రూ.39,450 కోట్లకే.. పథకాలకు నిధుల్లో కోత తప్పదని ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అప్పులపై ఆంక్షలు విధించిన కేంద్రంపై దాడి చేయడానికి డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాల్పిందిగా రాష్ట్ర మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిని సీఎం ఆదేశించారని పేర్కొంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు సమకూరాల్సిన ఆదాయంలో రూ.40 వేల కోట్ల తగ్గుదల చోటు చేసుకుంటోంది. ఇలాంటి చర్యలతో తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబరులో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు’’ అని ఆ ప్రకటనలో వివరించింది. అసంబద్ధ ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి.. రాష్ట్రాల భవిష్యత్తు, ప్రగతికి ఆటంకంగా మారిందని ఆక్షేపించింది. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ ముందు కేంద్రం విడుదల చేసే బడ్జెట్‌ గణాంకాలను అనుసరించి రాష్ట్రాలు తమ తమ బడ్జెట్‌లను రూపొందించుకుంటాయని.. ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ప్రతి రాష్ట్రానికీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను ముందస్తుగా కేంద్రం వెల్లడిస్తుందని గుర్తుచేసింది. ఆ ఆనవాయితీ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తెలంగాణకు ఇచ్చే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించిందని.. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించుకుందని వివరించింది. కానీ.. కేంద్రం అకస్మాత్తుగారాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని రూ.39 వేల కోట్లకు కుదించడంతో రాష్ట్రానికి అందాల్సిన రూ.15 వేల కోట్ల నిధులు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలకు అదనంగా 0.5 శాతం మేర నిధుల సేకరణకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ఉంటుందని.. కేంద్రం ఈ సౌలభ్యాన్ని కూడా రాష్ట్రం పొందకుండా చేసిందని ఆరోపించింది. రాష్ట్రంలో విద్యుత్తు సంస్కరణలను అమలు చేస్తామంటేనే 0.5 శాతం రుణ పరిమితికి అనుమతిస్తామంటూ వ్యవసాయ వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక నిబంధనను ముందుకు తెచ్చి బలవంత పెట్టిందని ఆక్షేపించింది. ‘‘ఎన్ని కష్టాలనైనా భరిస్తాంగానీ.. తెలంగాణ రైతులకు, వ్యవసాయానికి నష్టం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణలకు ఒప్పుకోబోం’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రానికి ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారని తెలిపింది. దాంతో సుమారు రూ.6 వేల కోట్లను రాష్ట్రం కోల్పోయిందని వివరించింది. ఇలా రూ.15 వేల కోట్లు, రూ.6 వేల కోట్లు... మొత్తం రూ.21 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వ సంకుచిత విధానాల కారణంగా రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది. అక్కడితో ఆగకుండా రాష్ట్రానికి రావాల్సిన రూ.20 వేల కోట్ల బడ్జెటేతర(గ్యారంటీ అప్పులు) నిధులను కూడా రాకుండా కేంద్రం నిలిపివేయించిందని ఆరోపించింది. కేంద్రం అనాలోచిత విధానాలు, అజ్జానంతో కూడిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా నిధులు రాకుండా పోయాయని వివరించింది.

ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రం ప్రభుత్వం గతంలోనే పలు ఆర్థిక సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం నిధులను సమీకరిస్తోందని.. కేంద్రం కక్షసాధింపుతో ఆ నిధులను కూడా నిబంధనల పేరిట నిలిపివేయించిందని.. రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్బంధనం చేసి, ప్రగతికి అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తోందని ఆరోపించింది. కేంద్ర అనుచిత నిర్ణయాల వల్ల నిధులు అందక అభివృద్ధి ఆగిపోయి రాష్ట్రాల ప్రగతి కుంటుపడే పరిస్థితులు దాపురిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశాభివృద్థికే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపింది. ఇలాంటి అజ్జానంతో కూడిన, అనాలోచితమైన, అసంబద్ధ నిర్ణయాల వల్ల ఒక్క తెలంగాణ ప్రగతిని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా కేంద్రం దిగజారుస్తోందని తెలిపింది. రాజకీయ ప్రేరేపితమైన, కక్షపూరిత, దిగజారుడు విధానాలతో రాష్ట్రాల గొంతు కోస్తూ, నష్టపరుస్తూ.. సమాఖ్య స్పూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తోందని ఆక్షేపించింది. కేంద్రం అనుసరిస్తున్న ఇటువంటి అసంబద్థ విధానాల గురించి రాష్ట్ర ప్రజల దృష్టికి, అటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపింది. అందులో భాగంగానే డిసెంబర్‌ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించి చర్చించాలని నిర్ణయించిందని వివరించింది.

ఇదీ లెక్క..

ఈ ఏడాది ప్రభుత్వం రూ.2,56,958 కోట్ల బడ్జెట్‌ను శాసన సభలో ఆమోదింపజేసుకుంది. ఇందులో బడ్జెట్‌ అప్పుల రూపంలో రూ.53,970 కోట్లు, గ్యారంటీ అప్పుల కింద మరో రూ.22,675 కోట్లు.. మొత్తం కలిపి రూ.76,645 కోట్లు అప్పుల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. కానీ.. కేంద్ర ప్రభుత్వం ఈసారి కార్పొరేషన్ల పేరిట తీసుకునే గ్యారంటీ అప్పులనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించింది. 2020-21 సంవత్సరం నాటికి ఉన్న రాష్ట్ర గ్యారంటీ అప్పులను నాలుగు సంవత్సరాలకు సర్దుబాటు చేసి, బడ్జెట్‌లో అప్పుల్లో కోతలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన రూ.53,970 కోట్లు కాకుండా.. రూ.39,450 కోట్ల అప్పునకు మాత్రమే అవకాశం ఇచ్చింది.

అంటే... బడ్జెట్‌ అప్పుల్లో రూ.14,520 కోట్ల మేర లోటు. గ్యారంటీ రుణాలను కూడా కలిపితే.. లోటు రూ.37,195 కోట్లు. ఈ స్థాయిలో నిధులు తగ్గితే.. సాగునీటి పారుదల ప్రాజెక్టులకు, ప్రభుత్వ పథకాలకు నిధుల్లో కోతలు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడనుందని ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. కాగా.. ఈసారి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రూ.39,450 కోట్లకుగాను ఇప్పటికే రూ.26,500 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈ నెల 29న మరో రూ.500 కోట్లు, డిసెంబర్‌ 6న రూ.1500 కోట్లు, డిసెంబర్‌ 13న రూ.578 కోట్ల రుణాలను తీసుకోనుంది. అంటే... డిసెంబర్‌ నాటికి ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం రూ.29,078 కోట్లకు చేరుతుంది. చివరి త్రైమాసికం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో మిగతా రూ.10 వేల కోట్ల అప్పు తీసుకునే అవకాశముంది.

Updated Date - 2022-11-25T04:25:25+05:30 IST