కాంగ్రెస్‌ వార్‌రూం కేసును కొట్టేయండి

ABN , First Publish Date - 2022-12-30T03:28:50+05:30 IST

సైబర్‌ క్రైం పోలీసులు నమోదు చేసిన కాంగ్రెస్‌ వార్‌రూం కేసును, దర్యాప్తు అధికారి తనకు సీఆర్పీసీలోని సెక్షన్‌ 41ఏ కింద జారీచేసిన నోటీసులను కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు గురువారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాంగ్రెస్‌ వార్‌రూం కేసును కొట్టేయండి

హైకోర్టును ఆశ్రయించిన సునీల్‌ కనుగోలు

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ క్రైం పోలీసులు నమోదు చేసిన కాంగ్రెస్‌ వార్‌రూం కేసును, దర్యాప్తు అధికారి తనకు సీఆర్పీసీలోని సెక్షన్‌ 41ఏ కింద జారీచేసిన నోటీసులను కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు గురువారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మయాబజార్‌ సినిమాలోని సీన్లను సీఎం కుటుంబ సభ్యుల ఫొటోలతో మార్ఫింగ్‌ చేసిన వీడియోలకు, తనకు సంబంధం లేదని ఆ పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ వీడియోల మార్ఫింగ్‌కు సంబంధించే సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మాదాపూర్‌లోని కాంగ్రెస్‌ వార్‌రూంలో సోదాలు నిర్వహించి, ముగ్గురు ఉద్యోగులను అదపుపులోకి తీసుకున్నారు. వారికి నోటీసులు ఇచ్చి, వదిలేశారు. ఇదే కేసులో సునీల్‌ కనుగోలుకు తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సదరు ఎఫ్‌ఐఆర్‌ను, నోటీసులను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని కోరారు. శుక్రవారం జస్టిస్‌ కె.సురేందర్‌ ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-30T03:28:51+05:30 IST