నేడు టీ హబ్-2 ప్రారంభం
ABN , First Publish Date - 2022-06-28T08:39:13+05:30 IST
ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి.. అంటూ మొదలైన టి-హబ్ (తెలంగాణ హబ్) ప్రస్థానంలో మరో ముందడుగు...

ముఖ్య అతిథిగా హాజరవనున్న సీఎం కేసీఆర్
ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు కూడా..
మొదటి విడతలో వెయ్యి స్టార్టప్‌లకు చోటు
అధునాతన సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం
ఏర్పాట్లు పరిశీలించిన ఐటీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి.. అంటూ మొదలైన టి-హబ్ (తెలంగాణ హబ్) ప్రస్థానంలో మరో ముందడుగు. రాయదుర్గంలో నిర్మించిన టి హబ్-2 భవనం మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించనున్నారు. రూ.276 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఇటీవలే పూర్తయింది. 3.5 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో ఏడేళ్లుగా కొనసాగుతున్న భవనంతో పాటు కొత్తదాంట్లోనూ స్టార్ట్‌పలకు చోటు కల్పించనున్నారు. ట్రిపుల్ ఐటీలోని భవనం 70 వేల చదరపు అడుగుల్లో ఉండగా వంద స్టార్ట్పలకే అవకాశం ఉండేది. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు వేల స్టార్ట్‌పలకు చోటు కల్పించాలన్న లక్ష్యంగా కొత్త భవనం నిర్మించారు. స్టార్ట్‌పలతో పాటు వారికి సహకారం అందించే వెంచర్ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ సంస్థలకు కూడా స్థలం కేటాయించారు. భవనం ప్రారంభించాక తొలి విడతలో ఒకేసారి వెయ్యి స్టార్ట్‌పలకు చోటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. స్టార్ట్‌పల ఎంపిక ప్రకటనను వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్ లాంటి అధునాతన సాంకేతిక రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంగళవారం సాయంత్రం 5-7 గంటల మధ్యలో జరుగనున్న ప్రారంభోత్సవంలో మొదటగా అడోబ్ ఛైర్మన్, సీఈవో శంతను నారాయణ్, సైకామోర్ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గురురాజ్ దేశ్‌పాండే, అథేరా వెంచర్ పార్ట్నర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్ రేఖీ వీడియో సందేశాన్ని అందించనున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలకు పంపిన టి హబ్ జ్యోతిని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ఆ తర్వాత భవనాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న స్టార్ట్‌పలను సీఎం సన్మానించనున్నారు. సీఎం కేసీఆర్, ఐటీ-పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో భారతీయ భాషల మైక్రోబ్లాగ్ కూ (కేవోవో) యాప్‌తో ఐటీ శాఖ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు, హీరో మోటార్ గ్రూప్, పోమోటాక్, వెబ్ 3.0 సంస్థలతో టీ హబ్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఇన్నోవేషన్ సమ్మిట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో డ్రావిన్ బాక్స్, మీషో, స్విగ్గి, జొమాటోతో పాటు యూనికార్న్ స్టార్ట్‌పల వ్యవస్థాపకులు పాల్గొని ప్రసంగించనున్నారు. వివిధ అంశాలపై నిర్వహించే చర్చాగోష్ఠిలో పాల్గొననున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ సోమవారం రాత్రి టిహబ్ నూతన భవనాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై టిహబ్ సీఈవో శ్రీనివాసరావును వివరాలు అడిగారు.