సీఎం హామీలపై అసెంబ్లీలో నిలదీయండి
ABN , First Publish Date - 2022-03-05T06:49:10+05:30 IST
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో
- కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చించండి
- పార్టీ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ సూచన
హైదరాబాద్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, సభ్యుల సంఖ్యా బలంతో టీఆర్ఎస్ రెచ్చగొట్టే అవకాశమున్నందున సంయమనంతో వ్యవహరించాలన్నారు. అసెంబ్లీలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చు, నిధుల దారి మళ్లింపుపై చర్చకు సిద్ధం కావాలని కోరారు. ఈ నెల 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంజ య్.. పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసహనంతో ఉన్న టీఆర్ఎస్.. బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రతిపక్షాలను తన ట్రాప్‌లోకి నెట్టేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ట్రాప్‌లో పడకుండా ప్రజా సమస్యలు, ఏడేళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, ఇతర రాష్ట్రాల పర్యటన పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాలాడుతున్నారని సంజయ్ విమర్శించారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పెద్ద కొర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 25 మంది శుక్రవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు.