శ్రీశైలం ఇన్‌ఫ్లో 1.73 లక్షల క్యూసెక్కులు

ABN , First Publish Date - 2022-08-04T09:59:39+05:30 IST

కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సోమవారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద రాగా...

శ్రీశైలం ఇన్‌ఫ్లో 1.73 లక్షల క్యూసెక్కులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. సోమవారం 1.04 లక్షల క్యూసెక్కుల వరద రాగా... బుధవారం సాయంత్రం ఇన్‌ఫ్లో 1,73,282 క్యూసెక్కులకు చేరింది. దీంతో 63,885 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 199.27 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 61 వేలు ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 18 వేల ఇన్‌ఫ్లో ఉండగా... ఔట్‌ఫ్లో 18 వేలుగా ఉంది. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కులు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 29 వేలుగా ఉంది. నాగార్జునసాగర్‌ జలాశయానికి 8,740 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. సుంకేసులకు 53 వేల క్యూసెక్కులు వస్తుండగా... ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది. ఇక, గోదావరి బేసిన్‌లోని  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 23 వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... శ్రీరాంసాగర్‌ నుంచి 13 వేలు, ఎల్లంపల్లి నుంచి 9,532 క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు.  


మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి 1.80  లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజీకి 2.58 లక్షల క్యూసెక్కులు, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్‌)కు 3.25 లక్షల క్యూసెక్కులు, అన్నారం(సరస్వతి) బ్యారేజీకి 25 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెడుతున్నారు. ఇక సుందిళ్ల (పార్వతి) బ్యారేజీకి 13 వేల క్యూసెక్కుల వరద రాగా... 5,952 క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. కాగా, జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉస్మాన్‌సాగర్‌ నీటిమట్టం 1786.50 అడుగులు, హిమాయత్‌సాగర్‌ నీటిమట్టం 1760.75 అడుగులుగా ఉంది. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శుక్రవారం కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ ప్రకటించింది. 

Updated Date - 2022-08-04T09:59:39+05:30 IST