ప్రేమను పంచడం తెలంగాణ గొప్పదనం

ABN , First Publish Date - 2022-10-07T09:18:39+05:30 IST

ప్రేమను మాత్రమే పంచడం తెలంగాణ సంస్కృతి గొప్పదనమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ద్వేషం, కోపం, అహం పక్కనబెట్టి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మన మనసేంటో గుండె చెబుతుంద

ప్రేమను పంచడం తెలంగాణ గొప్పదనం

  • ఆత్మీయ ఆలింగనం మన మనసేంటో చెబుతుంది
  • హీరోల అభిమానుల మధ్య సఖ్యత కోసం కృషి
  • దత్తన్న అలయ్‌ బలయ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి
  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళా ప్రదర్శనలు
  • చిరంజీవి ఫొటో సెషన్‌పై గరికపాటి అసహనం
  • వంద రోజుల ఫంక్షన్లకు అందరం కలిసొచ్చేవాళ్లం

హైదరాబాద్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రేమను మాత్రమే పంచడం తెలంగాణ సంస్కృతి గొప్పదనమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. ద్వేషం, కోపం, అహం పక్కనబెట్టి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మన మనసేంటో గుండె చెబుతుందన్నారు. మనం ఒకరికి ప్రేమను పంచితే మనకు రెట్టింపు ప్రేమ తిరిగొస్తుందన్నారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌లో చిరంజీవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. హీరోల మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్నా అభిమానుల్లో మాత్రం తమ ప్రత్యర్థిగా భావించే హీరోపై ద్వేషం, ఏహ్యభావం ఉండేదన్నారు. వాల్‌పోస్టర్లు చించివేయడం, వాటిపై కళ్లాపి చల్లడం వంటివి చూసి బాధనిపించేందన్నారు. తాను ఇండస్ర్టీకి వచ్చిన కొత్తలో హీరోల అభిమానుల మధ్య ఉన్న ఏహ్యభావం తగ్గించేందుకు ఏ సినిమా వంద రోజులు ఆడినా అందరితో కలిసి పండుగ చేసుకునే వాళ్లమన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. మనసులు కలిస్తే ఎంతటి కఠిన సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని దత్తాత్రేయ అన్నారు. సహృదయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యమంత్రులు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. అలయ్‌ బలయ్‌ అనేది మంచి పేరు అని, ఇలాంటి పేరుతో సినిమా చేయలేదు గదా అని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. పార్టీలకు అతీతంగా అలయ్‌ బలయ్‌ నిర్వహించడం ప్రశంసనీయమని కేంద్ర మంత్రి భగవత్‌ ఖుబా ప్రశంసించారు.


 తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అలయ్‌ బలయ్‌ అద్దం పడుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. విలువ ఇవ్వాల్సింది మనసులకు గానీ మతాలకు కాదని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చెప్పారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ పోవాలంటే అక్కడ కూడా అలయ్‌ బలయ్‌ నిర్వహించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. రాష్ట్రంలో జిల్లాస్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అన్ని పార్టీలతో చర్చించి అలయ్‌ బలయ్‌కి సిద్ధాంతం, ప్రణాళిక రూపొందించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు సూచించారు. అలయ్‌ బలయ్‌, హోలీ అంటే దత్తన్న గుర్తుకు వస్తారని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ మానవతా విలువలకు పాతరేశారని ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. 


కేసీఆర్‌ వచ్చిన తర్వాత రాజకీయాలు మారిపోయాయని, ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ నాయకులతో మాట్లాడే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అలయ్‌ బలయ్‌ నిర్వహించడం ప్రశంసనీయమని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేకే అన్నారు. మానవ హక్కుల కమిషన్‌ జస్టిస్‌ చంద్రయ్య, ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, అర్వింద్‌, ఎమ్మెల్యే రఘనందన్‌రావు, బీజేపీ నేతలు వివేక్‌ వెంకటస్వామి, రామ్‌చందర్‌రావు, కపిలవాయి దిలీప్‌కుమార్‌, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివా్‌సతోపాటు పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ అలయ్‌బలయ్‌ చెప్పుకున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి స్వాగతోపన్యాసం చేశారు. పలు రంగాల ప్రముఖులను, 1969 తెలంగాణ ఉద్యమకారులనూ ఘనంగా సత్కరించారు. 


చిరంజీవి ఫొటోసెషన్‌పై గరికపాటి అసహనం

గరికపాటి నరసింహారావు ప్రసంగం ప్రారంభిస్తున్న సమయంలో వేదికపై చిరంజీవితో అభిమానులు ఫొటో సెషన్‌కు పోటీపడ్డారు. దీంతో అసహనానికి గురైన గరికపాటి, చిరంజీవి గారికి విజ్ఞప్తి.. దయచేసి వచ్చి కూర్చోండి.. మీ ఫొటో సెషన్‌ ఆపేస్తే మాట్లాడతా.. లేదంటే నాకు సెలవు ఇప్పించండి.. నేను వెళ్లిపోతాను.. అని స్పష్టం చేశారు. దీంతో నిర్వాహకులు ఆయనకు సర్దిచెప్పారు. 5 నిమిషాల పాటు ఫొటోసెషన్‌ పూర్తిచేసుకున్న చిరంజీవి తిరిగి వచ్చి గరికపాటికి క్షమాపణ చెప్పారు. ఆయన ప్రవచనాలు తనకు ఇష్టమన్నారు. వీలు చూసుకుని తన ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని ఆహ్వానించారు.  

Updated Date - 2022-10-07T09:18:39+05:30 IST