బతుకుపై పిడుగు!

ABN , First Publish Date - 2022-10-07T08:20:49+05:30 IST

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు..

బతుకుపై పిడుగు!

  • రాష్ట్రంలో పిడుగులు పడి ఆరుగురి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
  • హైదరాబాద్‌, జిల్లాల్లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
  • కొన్ని జిల్లాల్లో పంటలకు భారీ నష్టం.. మరో 2 రోజులు వర్షాలు’

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు.. పలు కుటుంబాల్లో విషాదం నింపాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాత పడగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో బుధ, గురు వారాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి పంటలు దెబ్బతిన్నాయి. రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులపైనీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ద్రోణి ప్రభావం మరో రెండు రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.


పండుగ పూట విషాదం

దసరా పండుగను ఆనందంగా జరుపుకొందామని సొంతూరికి వచ్చిన స్నేహితులు.. పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్లి శివకృష్ణ (22), మరుపట్ల సాంబరాజు (22), వంశీకృష్ణ, వొజ్జల సందీప్‌, అమ్మమ్మఇంటికి  వచ్చిన జిట్టబోయిన సాయికుమార్‌ (23).. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సందర్భంగా ఊరి శివారులో వీరందరూ ఉండగా.. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మర్రి చెట్టు కింద వీరందరూ నిలబడి ఉండగా.. పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న నేరెళ్లి శివకృష్ణ, మరుపట్ల సాంబరాజు, జిట్టబోయిన సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న వంశీకృష్ణ, సందీ్‌పకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో మహబుబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని వడ్డెర బజార్‌కు చెందిన వేముల సంపత్‌ (27) సైతం పిడుగు పాటుకు గురై మృతి చెందారు. 


రూపన్‌ రమేష్‌, వేముల సంపత్‌, బత్తుల విజయ్‌, ఆళ్లకుంట శేఖర్‌ స్నేహితులు. దసరా నేపథ్యంలో వీరందరూ సరదగా పెద్ద చెరువు కట్ట వద్దకు వెళ్లగా.. అదే సమయంలో భారీ వర్షం పడింది. కట్టపై ఉన్న చెట్టు కింద వీరందరూ నిలబడి ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో వేముల సంపత్‌ మృతి చెందగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అజయ్‌ తండాకు చెందిన మూడు జమ్మ(68) పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఇంటి ఆవరణలో కోళ్లు కప్పి పెట్టే సమయంలో పిడుగు పడడంతో ఆమె మృతి చెందిందని కొందరు చెబుతుండగా.. పిడుగు శబ్దంతో భయానికి గురై ఆమె మరణించిందని మరికొందరు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన గొర్రెల కాపరి బల్లి యాకోబు(65) మేకలు, గొర్రెలను మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికొస్తున్న సమయంలో  పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. యాదాద్రి జిల్లాలోని రాజాపేట మండలం కొండేటి చెరువులో పిడుగుపాటుకు గురై పాడి ఆవు మృతి చెందగా, కొన్ని ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. అలాగే, వికారాబాద్‌ జిల్లా బొంపల్లిలో రైతు హన్మయ్యకు చెందిన కాడెద్దు పిడుగు పాటుకు గురై మృతి చెందింది.


గచ్చిబౌలిలో 4.8 సెం.మీ వర్షం

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. గచ్చిబౌలిలో అత్యధికంగా 4.8, రామచంద్రాపురంలో4.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్‌, అమీర్‌పేట మైత్రివనం, కొండాపూర్‌, పంజాగుట్ట, హాఫీజ్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. వరద నీటితో నాలాలు నిండుగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5 సెం.మీ. వర్షం కురిసింది. పాలమూరు పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బీకెరెడ్డికాలనీ, రామయ్యబౌళి, శివశక్తినగర్‌, గణే్‌షనగర్‌లను వరద ముంచెత్తింది. నాగర్‌కర్నూల్‌లో 5.28 సెం.మీ, తాడూరులో 5.1 సెం.మీ, కొల్లాపూర్‌లో 5సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడలో 10.2సెం.మీ, మరికల్‌లో 8.78 సెం.మీ వర్షం కురిసింది. వనపర్తి జిల్లాలో భారీ వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఘణపురంలో 9.23సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 78వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.


వాగులో చిక్కుకున్న కారు.. 

సురక్షితంగా బయటపడ్డ దంపతులు

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పెద్ద చెరువు కాలువ తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. బంట్వారం మండలం నాగారంలో అత్యధికంగా 8.63 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధారూర్‌ మండలంలోని నాగారం కర్లమోని వాగులో కారు కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న భార్యాభర్తలు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. నీటిలో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో బషీరాబాద్‌ మండల పరిధిలోని జీవన్గిలో మహాదేవలింగేశ్వరాలయం నీట మునిగింది. ధారూర్‌ మండలంలోని నాగారం కర్లమోని వాగులో కారు కొట్టుకుపోయింది. అయితే కారులో ఉన్న భార్యాభర్తలు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. నీటిలో ఉన్న కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లోని నదులు పొంగి ప్రవహించాయి. బషీరాబాద్‌ మండల పరిధిలోని జీవన్గిలో కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో నది ఒడ్డున ఉన్న మహాదేవలింగేశ్వరాలయం నీట మునిగింది.


రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో 12సెంటీమీటర్ల వర్షం కురవడంతో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై వర్షం నీరు నిలిచిపోయింది. మేడిగడ్డ కత్వ వాగు పొంగిపొర్లడంతో పొలాలు జలమయమయ్యాయి. యాచారం మండలం తక్కళ్లపల్లి, మేడిపల్లి. తమ్మలోనిగూడ. చౌదర్‌పల్లి గ్రామాల్లో పత్తిపంట నీట మునిగింది. మేడిపల్లి-నానక్‌నగర్‌ మధ్య కల్వర్టు కొట్టుకుపోయింది. చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల్లో కూరగాయలతోపాటు పూలు, పత్తి పంటలు నీట మునిగాయి. ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్‌ అర్కగూడ ప్రాజెక్టులో పడి గురువారం సాయంత్రం పశువుల కాపరి పిప్పిరె బాబురావు(65) గల్లంతయ్యాడు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలో సరాసరి 1.86 సెం.మీల వర్షాపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా వేల్పూర్‌ మండలంలో 6.41 సెం.మీల వర్షం పడింది. వర్షాల కారణంగా సోయా పంటకు భారీ నష్టం వాటిల్లింది. 

Updated Date - 2022-10-07T08:20:49+05:30 IST