గుండు కొట్టించి.. వ్యభిచారులని నిందించి

ABN , First Publish Date - 2022-09-19T09:20:33+05:30 IST

ఓ గ్రామానికి చెందిన పెద్దలు ఇద్దరు మహిళల పట్ల సభ్యసమాజం తలదించుకునేంత కర్కశంగా ప్రవర్తించారు. తమ తండాకు చెందిన ఓ బాలుడి ఆత్మహత్యకు ఆ మహిళలే కారణమని ఆరోపిస్తూ శిక్షించారు.

గుండు కొట్టించి..  వ్యభిచారులని నిందించి

  • ఇద్దరు మహిళలను చితకబాదిన గ్రామపెద్దలు
  • ఓ బాలుడి ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ శిక్ష
  • నల్లగొండ జిల్లాలో అమానవీయ ఘటన

నల్లగొండ, సెప్టెంబరు 18: ఓ గ్రామానికి చెందిన పెద్దలు ఇద్దరు మహిళల పట్ల సభ్యసమాజం తలదించుకునేంత కర్కశంగా ప్రవర్తించారు. తమ తండాకు చెందిన ఓ బాలుడి ఆత్మహత్యకు ఆ మహిళలే కారణమని ఆరోపిస్తూ శిక్షించారు. తమకే ఏ పాపం తెలియదని ఆ మహిళలు వేడుకున్నా వినకుండా.. గ్రామ ప్రజల సమక్షంలో వారికి గుండు కొట్టించి, చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిపై వ్యభిచారులనే ముద్ర వేసి కులబహిష్కరణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అత్యంత అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌లో జరిగింది. దేవరకొండ డివిజన్‌లోని ఓ గిరిజన తండాకు చెందిన సుమారు 34, 35 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలకు అదే తండాకు చెందిన ఇంటర్‌ చదువుతున్న ఓ బాలుడి(16)తో వారికి పరిచయం ఏర్పడింది.


ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బాధిత మహిళలు.. ఆ బాలుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండే వారు. ఈ క్రమంలో ఈ నెల 14న ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేయని తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆ బాలుడు ఉపయోగించిన ఫోన్‌ను గమనించిన కుటుంబసభ్యులు.. కాల్‌ లిస్ట్‌లో సదరు మహిళలతో తరచూ సంభాషణలు జరిపినట్టు గుర్తించారు. దీంతో బాలుడి ఆత్మహత్యకు ఆ మహిళలే కారణమని భావించి. వెంటనే విషయాన్ని గ్రామ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తండా గ్రామ సర్పంచ్‌, ఇతర పెద్ద మనుషులు కలిసి శనివారం(17వ తేదీ) ఈ విషయంపై పంచాయితీ పెట్టారు. బాలుడి మృతికి తమకూ ఎలాంటి సంబంధం లేదని ఆ మహిళలు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా వారిని శిక్షించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే గ్రామంతోపాటు కులం నుంచి కూడా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దేవరకొండ డివిజన్‌ పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే, ఇది తమ కుల ఆచారమని, ఇందులో జోక్యం చేసుకోవద్దని ఆ గ్రామపెద్దలు అన్నట్టు సమాచారం.

Updated Date - 2022-09-19T09:20:33+05:30 IST