T.news: జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు: షర్మిల

ABN , First Publish Date - 2022-07-21T20:34:32+05:30 IST

జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) మండిపడ్డారు.

T.news: జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారు: షర్మిల

మంచిర్యాల: జైల్లో పెట్టి మహిళలను చిత్ర హింసలు పెడుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) మండిపడ్డారు. పట్టాలు ఇస్తామని 8 ఏళ్లవుతున్నా ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. దండేపల్లి మండలం కోయపోషగూడెం రైతులతో షర్మిల ముఖాముఖి మాట్లాడారు. ఇటీవల పోడు భూముల్లోని గ్రామస్థుల గుడిసెలను పోలీసులు తొలగించారని రైతులు తెలిపారు. 2500 ఎకరాల పోడు భూములపై తమకు హక్కు ఉందని అన్నారు. బట్టలు ఊడదీసి కొట్టారని షర్మిలతో గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 నుంచి సాగు చేసుకుంటున్నవారికి పట్టాలివ్వకపోవడం దారుణమని, భూముల కోసం పోరాడుతున్న 52 కుటుంబాలను హింసిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.


జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా పోడు సేద్యం నడుస్తోంది. అప్పట్లో పని చేసిన అటవీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అయితే కొందరు డబ్బు ఉన్నోళ్లు, బడాబాబులు కూడా అటవీ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసినా ఎంతో మంది పేదలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అడవిని నరికేసి, భూములను కబ్జా చేసిన వారిని వదిలేసి ఏళ్ల తరబడిగా పంటను సాగు చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 


‘పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా. సంబంధిత అధికారులందరితో కలిసి వెళ్లి.. నేనే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుంటా. సమస్యలన్నీ పరిష్కరించి రైతులకు పోడు పట్టాలు ఇప్పిస్తా.’ పోడు భూముల సమస్యల పరిష్కారానికి 2018 నుంచి వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ (CM KCR) ఇచ్చిన హామీ ఇది. సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో క్యాబినెట్‌ కమిటీ, సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పలు సిఫారసులు చేస్తూ ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా. పోడు భూముల క్రమబద్ధీకరణకు విధి విధానాలు తయారు చేయాలని గత ఏడాది నవంబరు 8న ఆదేశించారు. నవంబరు 8 నుంచి డిసెంబరు 31 వరకూ దరఖాస్తులు కూడా స్వీ కరించారు. అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల క్రమబద్ధీకరణ కోరుతూ 3.5 లక్షల మంది గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకున్నారు. అయినా, ఇప్పటి వరకూ ఈ సమస్యను పరిష్కరించలేదు. దరఖాస్తులను పరిశీలించలేదు. సరికదా.. అటవీ భూములకు హద్దులు గుర్తించి, కందకాలు, కంచెలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-07-21T20:34:32+05:30 IST