షర్మిలా.. నోరు అదుపులో పెట్టుకో!

ABN , First Publish Date - 2022-09-28T09:02:00+05:30 IST

షర్మిలా.. నోరు అదుపులో పెట్టుకో!

షర్మిలా.. నోరు అదుపులో పెట్టుకో!

  • ఆడపిల్లవి.. ఆడపిల్లలా మాట్లాడు
  • నన్ను రాజకీయ వ్యభిచారి అంటవా? 
  • వైఎస్‌ గుణాలు షర్మిల, జగన్‌కు రాలేదు 
  • షర్మిలపై కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఫైర్‌ 
  • 3 రాజధానులు కాదు 3 రాష్ట్రాలు చేసుకోండి
  • జగన్‌, షర్మిల, విజయసాయి సీఎంలు కండి
  • మీ ఇంటి  పంచాయితీ ప్రాంతాలకు ఎందుకు ? 
  • విజయలక్ష్మికి సంగారెడ్డి ఎమ్మెల్యే సూచన 

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఎంత వైఎస్‌ఆర్‌ బిడ్డవైతే మాత్రం జగ్గారెడ్డిని పట్టుకుని రాజకీయ వ్యభిచారి అంటవా? మగవాళ్ల గురించి ఎట్ల మాట్లాడాలో తెలియదా? నన్ను వ్యభిచారి అంటే నాకు ఏమీ కాదు. అదే నేను అంటే ఎట్లుంటది? షర్మిలా నోరు అదుపులో పెట్టుకో..! ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. మళ్లీ నోరు జారితే డెప్త్‌ విషయాలు మాట్లాడాల్సి వస్తది’ అంటూ వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి హెచ్చరించారు.  మంగళవారం మీడియాతో మాట్లాడారు.  వైఎ్‌స దగ్గర ఉన్నప్పుడు పులిలాగా ఉన్న జగ్గారెడ్డి.. ఆ తర్వాత పిల్లిలా మారారంటూ షర్మిల అంటున్నారని, కానీ తాను టీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడే పులినన్నారు. తాను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో (2005) తెలంగాణ వ్యాప్తంగా ఒక్క మున్సిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ గెలువకూడదని వైఎ్‌స కంకణం కట్టుకుని పనిచేశారన్నారు. అప్పుడు తన నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు.


 టీఆర్‌ఎస్‌ మూడే మున్సిపాలిటీలు గెలిస్తే అందులో రెండు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలేనన్నారు. ఆ రిజల్టు చూశాక వైఎ్‌సకు తన స్టైల్‌ నచ్చిందని, తన స్నేహితుడు జట్టి కుసుమ్‌ కుమార్‌తో తనను పిలిపించుకున్నారని గుర్తు చేసుకున్నారు. వైఎ్‌సకు తాను నచ్చినా షర్మిలకు నచ్చలేదంటే ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదని అర్థమన్నారు. తాను చూసిన వైఎ్‌స.. సీఎం హోదాలో ఉన్నప్పుడు శత్రువు వచ్చినా ప్రేమతో స్వీకరిస్తారన్నారు. ఆయన గుణాలు వైఎస్‌ జగన్‌కు, షర్మిలకూ లేవన్నారు. వైఎ్‌సఆర్‌ బిడ్డ.. పైగా ఆడపిల్ల కాబట్టి కాంగ్రెస్‌ నేతలం ఏమీ మాట్లాడలేకపోతున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌ ఏజెంట్‌ జగ్గారెడ్డి అంటూ షర్మిల వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇది తనకు శాపమని, తన పార్టీలోని కొందరూ ఇదే తీరుగ తనను బదనాం చేశారని, ఇంక షర్మిలను ఏమంటామన్నారు. తాను కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా పనిచేస్తానన్నారు. షర్మిలలాగా మతతత్వ బీజేపీకి ఏజెంట్‌గా అయితే ఉండబోనన్నారు. 


మోదీ దగ్గర పంచాయితీ పెట్టుకోండి! 

‘మీ కుటుంబంలోని సీఎంల పంచాయితీని తెచ్చి ప్రాంతాల పంచాయితీ పెట్టకండి. ఏపీలో మూడు రాజధానులకు బదులు మూడు రాష్ట్రాలు ప్లాన్‌ చేసుకోండి’ అంటూ విజయలక్ష్మికి జగ్గారెడ్డి సూచన చేశారు. కడప, కర్నూలు రాష్ట్రానికి షర్మిలను, అమరావతి ఉన్న రాష్ట్రానికి జగన్‌ను, ఇప్పటికే వైజాగ్‌ను కబ్జా చేసిన విజయసాయిరెడ్డిని వైజాగ్‌ రాష్ట్రానికి సీఎంలను చేయాలని సూచించారు.  జగన్‌ ఏది చెబితే ప్రధాని మోదీ అది వింటారని, ఆయన దగ్గర ఈ మేరకు పంచాయితీ పెట్టి సెటిల్‌ చేసుకోవాలన్నారు. అంతే కానీ వైఎస్‌ జగన్‌, షర్మిల ఇంటి సీఎంల పంచాయితీని ఊరంతటికీ పూయవద్దంటూ హితవు పలికారు. కాగా, ఆరోగ్యశ్రీ పథకాన్ని జిల్లాస్థాయి వరకూ పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను జగ్గారెడ్డి కోరారు. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయని పక్షంలో దీనిపై తాను పోరాటాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.  సీఎం సహాయనిధి కింద రూ.10 లక్షల బిల్లుకు రూ. 30 వేలే మంజూరవుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కాంగ్రెస్‌ హయాంలో ఎలా అమలైందో అలా అమలు చేయాలని, డబ్బులు లేక చనిపోతున్న రోగులను, అప్పుల పాలవుతున్న వారి కుటుంబాలను కాపాడాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 

Read more