రాజగోపాల్‌కు శంకరగిరి మాన్యాలే!
ABN , First Publish Date - 2022-08-04T10:22:35+05:30 IST
ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరిన వారంతా శంకరగిరి మాన్యాల్లో కలిసిపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్ వదిలిపెట్టిన వాళ్లకూ అదే గతి పడుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.
- కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు: మల్లు రవి
- తప్పుడు మాటల రాజగోపాల్: అంజన్‌కుమార్
- వ్యాపారాలు కాపాడుకోవడానికే బీజేపీలోకి: అద్దంకి
- 22 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా వచ్చింది?: బెల్లయ్యనాయక్
- ప్రత్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్‌దే: జి.వినోద్, సంభాని
హైదరాబాద్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరిన వారంతా శంకరగిరి మాన్యాల్లో కలిసిపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్ వదిలిపెట్టిన వాళ్లకూ అదే గతి పడుతుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి.. బీజేపీలో చేరడానికి మోదీ, అమిత్ షాలను పొగుడుతున్నారని విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు ఎం.అంజన్‌కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవకాశాలు కల్పించిన విషయాన్ని రాజగోపాల్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మూడేళ్ల క్రితం నుంచే బీజేపీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లోని అన్ని స్థాయుల్లో అభిప్రాయాలను తెలుసుకున్నాకే అధిష్ఠానం రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. కాగా, తప్పుడు మాటలతో రాజకీయాలు చేయడం నీతిమాలిన విధానమని అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సకు, బీజేపీకి కాంగ్రెస్ నేతలే దిక్కయ్యారని ఎద్దేవా చేశారు.
ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి తమ వ్యాపారాలను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. కాగా, రూ.600 కోట్ల కంపెనీ కలిగిన రాజగోపాల్‌రెడ్డికి రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో ప్రజలందరికీ తెలిసిందని బెల్లయ్యనాయక్ అన్నారు. కేసీఆర్ దోపిడీలో ఈటల రాజేందర్‌కూ భాగం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అని, ప్రత్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్‌దేనని మాజీ మంత్రులు గడ్డం వినోద్, సంభాని చంద్రశేఖర్ అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీ వల్లే పేరు వచ్చిందన్నారు. రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చకపోతే ఎప్పుడో పార్టీ నుంచి వెళ్లి పోవాల్సిందన్నారు.
దోచుకున్నది దాచుకోవడానికే బీజేపీలోకి: షబ్బీర్ అలీ
కామారెడ్డి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటివరకు దోచుకున్నది దాచుకోవడానికే పార్టీ మారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. బుధవారం కామారెడ్డిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి కావాలంటూ రాజగోపాల్‌రెడ్డి తన వద్దకు వచ్చి అడిగారని, అయితే ఆయన సోదరుడ్డు వెంకట్‌రెడ్డి కూడా ఆశిస్తున్నట్లు తాను చెప్పానని తెలిపారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డికి మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పావా? లేదా? అని రాజ్‌గోపాల్‌రెడ్డిని షబ్బీర్ ప్రశ్నించారు.