పంజాబ్ వెళ్లడానికి సిగ్గుండాలి
ABN , First Publish Date - 2022-05-24T10:11:45+05:30 IST
పంజాబ్ వెళ్లి రైతులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

- ఇక్కడ రైతులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు
- దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర
- రాష్ట్రంలో ఆత్మహత్యలే లేవన్నట్లు ప్రచారం
- సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): పంజాబ్ వెళ్లి రైతులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణలో వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్య చేసుకున్నా, 25 మంది ఇంటర్ విద్యార్థులు ఉసురు తీసుకున్నా.. ఒక్క కుటుంబాన్నీ కేసీఆర్ పరామర్శించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు విద్యార్థులు, ఆర్టీసీ కార్మికుల బలవన్మరణాలు జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం, రంగారెడ్డి జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యలే లేవన్నట్లుగా.. రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ వద్ద మొహం చెల్లక, ఆయనకు స్వాగతం పలకకుండా కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మూడు ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడయిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. సాధించిన విజయాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సుపరిపాలనపై ఈ నెల 30 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సంజయ్ పిలుపునిచ్చారు. వచ్చే నెల 23 నుంచి జూలై 12 వరకు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, ఆగస్టులో 4వ విడత పాదయాత్రను చేపట్టనున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక రూపొందించామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఎందుకు సాయం చేయరు?: కిషన్‌రెడ్డి
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలడం, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు చనిపోతే ఎందుకు సాయం చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.