Sex Racket: దేశంలోనే అతిపెద్ద సెక్స్ రాకెట్
ABN , First Publish Date - 2022-12-07T02:50:03+05:30 IST
దేశంలోనే అతిపెద్ద సెక్స్ రాకెట్ గుట్టును.. సైబరాబాద్ యాంటీ హ్యూమన్‌ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు రట్టు చేశారు!
14,190 మంది యువతులు..వ్యభిచార రొంపిలోకి
గుట్టు రట్టు చేసిన సైబరాబాద్
యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్
హైదరాబాద్ రప్పించి హైటెక్ దందా
ఉద్యోగాల పేరుతో అమ్మాయిలకు ఎర..
దేశ విదేశీ యువతుల అక్రమ రవాణా
వెబ్‌సైట్స్, వాట్సాప్ గ్రూపుల ద్వారాబేరం..
పదిహేడు మంది నిర్వాహకులతో పాటు
ఒక ఫైవ్‌స్టార్ హోటల్ మేనేజర్ అరెస్టు
మూడేళ్లుగా సాగుతున్న దందా
నిందితులపై ఇప్పటికే నగరంలో 39 కేసులు
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద సెక్స్ రాకెట్ గుట్టును.. సైబరాబాద్ యాంటీ హ్యూమన్‌ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు రట్టు చేశారు! ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎరవేసి.. విలాస జీవనాన్ని అలవాటు చేసి.. 14,190 మంది యువతులతో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠా ఆట కట్టించారు. పోలీసులకు అందిన చిన్న సమాచారంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. వీరంతా దేశవిదేశాలకు చెందిన యువతులను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి హైటెక్ వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. మూడేళ్లుగా నగరంలోని ట్రై కమిషనరేట్ పరిధిలో సాగుతున్న వీరి దందాకు పోలీసులు చెక్‌పెట్టారు. మొత్తం 17 మంది నిర్వాహకులను, వారికి ఈ దందాలో సహకరిస్తున్న గచ్చిబౌలిలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ మేనేజర్‌ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ ఆర్ణవ్ 2019 నుంచి హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. తొలుత రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మీడియేటర్స్ ద్వారా యువతులను నగరానికి రప్పించి వ్యభిచారం చేయించేవాడు. ఈ క్రమంలో అతనికి హైదరాబాద్‌లోని పలు ముఠాలతో పాటు.. అనంతపురం, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలతో పరిచయం ఏర్పడింది.
వారి సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి సైతం చాలా సులభంగా యువతులను రప్పించి వ్యభిచారం చేయించడం ప్రారంభించాడు. వీరి వలకు చిక్కుకున్న 14 వేల మంది అమ్మాయిల్లో అత్యధికంగా 50 శాతం మంది బెంగాల్‌కు చెందినవారు కాగా.. 20ు కర్ణాటక, 15ు మహారాష్ట్ర, 7ు మంది ఢిల్లీ, ఐదు శాతం మంది ఇతర రాష్ట్రాలు, 3 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు. వీరి దందా అంతా ఆన్‌లైన్‌లో, వాట్సాప్ వంటి మెసెంజర్ల ద్వారా సాగేది. అమ్మాయిల ఫొటోలను వెబ్‌సైట్లలో, మెసెంజర్ యాప్‌ల ద్వారా సర్క్యులేట్ చేసి.. ఎక్కడికంటే అక్కడికి పంపి ఎస్కార్ట్ సర్వీస్‌లు అందిస్తామని ప్రకటనలు ఇస్తారు. ఆ ఫొటోలు చూసిన కస్టమర్స్ ఫోన్ చేస్తే వారితో మాట్లాడటానికి, వివరాలు వెల్లడించడానికి అర్ణవ్, ఇతర నిర్వాహకులు కలిసి ప్రత్యేక కాల్‌సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లోనే కస్టమర్లతో బేరం కుదుర్చుకొని వారు చెప్పిన చోటుకు యువతులను పంపేవారు.
ఇలా పట్టుకున్నారు..
సన్‌సిటీ పరిధి ఓ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు గత నెలలో సమాచారం అందింది. సీపీ ఆదేశాల మేరకు డీసీపీ కవిత ధార పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ బృందం రంగంలోకి దిగింది. తొలుత సల్మాన్ అనే నిర్వాహకుడిని పట్టుకుంది. అతడి ఫోన్‌లోని కాంటాక్టులు, వాట్సా్‌పలోని యువతుల ఫొటోలు, ఇతర ఆర్గనైజర్స్‌తో ఉన్న సంబంధాలను పరిశీలించి ఇది దేశవ్యాప్త రాకెట్ అనే నిర్ధారణకు వచ్చారు. నెల వ్యవధిలో ఒకరికి తెలియకుండా ఒకరిని.. అదీమ్ అలియాస్ ఆర్ణవ్, మహ్మద్ సమీర్, సిమ్రన్ కౌర్, మహ్మద్ అబ్దుల్ కరీమ్, ఎరసంజి జోగేశ్వరరావు, నడింపల్లి సాయిబాబు, శైలేంద్ర ప్రసాద్, మహ్మద్ అఫ్సర్ షాహిద్, పసుపులేటి గంగాధరి, మహ్మద్ ఫయాజ్, విష్ణు, సాయి సుధీర్, రిషి, కోడి శ్రీనివాస్, అలీషామ్, సర్‌బీశ్వర్ రౌత్, రాకేశ్ (ఓ ఫైవ్‌స్టార్ హోటల్ మేనేజర్)ను పోలీసులు అరెస్టు చేశారు. 34 స్మార్ట్‌ఫోన్‌లు, ఓ కీప్యాడ్ ఫోన్, 3 కార్లు, ల్యాప్‌టాప్, 2.5 గ్రా ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిపై నగరంలో 39 కేసులున్నటు గుర్తించారు.
ఉద్యోగానికంటూ ఇంట్లోంచి బయల్దేరి
ప్రధాన నిందితుడైన అర్ణవ్ అలియాస్ అదీమ్ (31) బిహార్ వాసి. బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగిగా చెప్పుకొంటూ.. ఉదయాన్నే చక్కగా తయారై బయల్దేరి, సైబరాబాద్ పరిధిలో తీసుకున్న ఓ ఫ్లాట్‌కు చేరుకుని దందా నడిపేవాడు. వ్యభిచార రాకెట్ ద్వారా అతడికి పరిచయమై, సహ జీవనం సాగిస్తున్న సిమ్రన్ కౌర్ తర్వాత ఆర్గనైజర్‌గా మారింది. వీరు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతోపాటు, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్, రష్యా యువతులను తీసుకొచ్చేవారు. పదుల సంఖ్యలో హోటళ్లతో ఒప్పందాలు చేసుకొని దందా నిర్వహిస్తున్నారు.
పేద, మధ్యతరగతి యువతులే లక్ష్యం
ఈ దందా సాగిస్తున్న వారు పేద, మధ్యతరగతి యువతులనే టార్గెట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. చూడ్డానికి కాస్త బాగున్న అమ్మాయిలను మీడియేటర్లు సంప్రదించి, సేల్స్‌గర్ల్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాట కలుపుతారు. వారి ఫొటోలను నిర్వాహకులకు పంపుతారు. వారు ఎంపికచేసిన అమ్మాయిలను విమానాల్లో వేరే నగరాలకు పంపుతారు. 5 స్టార్ హోటళ్లలో ఉంచి విలాస జీవితాన్ని అలవాటు చేస్తారు. రోజుకు వేలల్లో డబ్బులిచ్చి.. డ్రగ్స్ అలవాటు చేసి తమ గుప్పిట్లో పెట్టుకుంటారు. కస్టమర్స్ అవసరాన్ని బట్టి వారి ద్వారా డ్రగ్స్ సైతం సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ చెల్లించిన డబ్బులో 30 శాతం యువతులకు ఇచ్చి.. మిగతా మొత్తాన్ని నిర్వాహకులు, బ్రోకర్లు పంచుకునేవారు. సెక్స్ రాకెట్ నిర్వాహకుల్లో ఒక్కొక్కరి వద్ద పెద్ద సంఖ్యలో యువతులు సహా వివిధ రాష్ట్రాల జూ.ఆర్టిస్టులు, డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, మోడల్స్ ఫోన్‌నంబర్లు, ఫొటోలు, ఇతర డేటా ఉన్నట్లు గుర్తించి పోలీసులు విస్తుపోయారు. నిర్వాహకులు మూడేళ్లలో ఒక్కొక్కరూ రూ.40 లక్షలు సంపాదించినట్టు సమాచారం.
పిల్లల్ని కొని, పెంచి.. వ్యభిచారంలోకి!
ఓ మహిళ నిర్వాకం.. యాదగిరిగుట్టలో ఘటన
ఐదుగురి అరెస్టు.. పరారీలో మరో నలుగురు
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 6: పసి పిల్లలుగా ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలను కొని, పెంచి, పెద్ద చేసి.. యుక్త వయసుకు వచ్చాక వ్యభిచారం చేయిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మునిసిపాలిటీ పరిధి యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ కొన్నేళ్ల క్రితం బాలికలను కొని పెద్దయ్యాక తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి వాసి కంసాని శ్రీనివాస్ దగ్గరికి పంపించింది. వారితో అతడు వ్యభిచారం చేయించేవాడు. తరచూ యాదగిరిపల్లి పంపేవాడు. అనసూయ కొట్టి, భయ పెడుతుండడంతో పారిపోయిన బాలికలు ఈ నెల 3న జనగామ బస్టాండ్ వద్ద పోలీసులకు కనిపించారు. తమపై అఘాయిత్యాలను వారు వివరించడంతో పోలీసులు భువనగిరి జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులుకు సమాచారమిచ్చారు. ఆయన ఫిర్యాదుతో యాదగిరిగుట్ట పోలీసులు, షీ టీమ్స్, చైల్డ్ ప్రొటెక్షన్ సభ్యులు అనసూయ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఆమెకు సహకరిస్తున్న శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చందా భాస్కర్, కంసాని లక్ష్మీ, చందా కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న.. యాదగిరిపల్లికి చెందిన కంసాని ప్రవీణ్, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వాసి కంసాని స్వప్న, కంసాని అశోక్, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన సరోజనమ్మ పరారీలో ఉన్నారు.