కొత్త మాడ్యూళ్లకు మోక్షమెప్పుడు?
ABN , First Publish Date - 2022-04-04T10:24:11+05:30 IST
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మన్మర్రి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 547లో 23 ఎకరాల సీలింగ్ భూమి...

- ధరణిలో సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడు
- ఏడు మాడ్యూళ్లు సూచించిన మంత్రివర్గ ఉపసంఘం
- అమల్లోకి రాని సబ్ కమిటీ సిఫారసులు
- కార్యరూపం దాల్చని కేసీఆర్ ప్రకటన
- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
- చేతులెత్తేస్తున్న తహసీల్దార్లు, కలెక్టర్లు
హైదరాబాద్/షాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మన్మర్రి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 547లో 23 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. కానీ, అదే సర్వే నెంబర్లో ఉన్న మరో 383.24 ఎకరాల పట్టాభూమిని కూడా ధరణి పోర్టల్‌లో సీలింగ్ భూమిగానే చూపిస్తోంది. అదే మండలం బోనగిరిపల్లిలో సర్వే నెంబర్ 47లో 31.20 సీలింగ్ భూమి, 293.20 ఎకరాల పట్టాభూమి ఉంది. కానీ, మొత్తం భూమినీసీలింగ్ భూమిగానే పేర్కొంటోంది. చిన్నసోలిపేట అనే మరో గ్రామంలో సర్వే నెంబర్ 8/ఈలో డి.నర్సింహులు అనే రైతుకు 3.36 ఎకరాల పట్టా భూమి ఉంది. ధరణిలో మాత్రం ఈ సర్వే నెంబరులోని మొత్తం భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా చూపిస్తోంది. ఈ భూములను క్రయ విక్రయాలు జరిపేందుకు, రిజిస్ట్రేషన్ చేసే వీల్లేకుండా పోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్య ఈ ఒక్క మండలంలో మాత్రమే ఉన్నది కాదు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఓ చోట రైతుకు ఉన్న భూమి కన్నా పట్టాదారు పాస్‌పుస్తకంలో తక్కువ విస్తీర్ణం నమోదుకాగా, మరో చోట రైతుకు చెందిన పట్టాభూమిని రికార్డుల్లో దేవాదాయ భూమిగా అధికారులు పేర్కొన్నారు. ఇంకోచోట భూమి విషయంలో ఇద్దరు రైతుల మధ్య వివాదం తలెత్తడంతో దానిని పార్ట్-బిలో చేర్చారు. ఇలాంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. ధరణిలో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం కొత్త మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినా అది కార్యరూపం దాల్చడంలేదు.
ఉపసంఘం సిఫారసులు చేసినా..
ధరణి ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకు సలహాలు, సూచనలు చేసేందుకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం ధరణిలో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పలు సిఫారసులు చేసింది. అందులో భాగంగా తక్షణమే ఏడు మాడ్యూళ్లను అందుటులోకి తీసుకురావాలని సూచించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి తక్షణమే ఏడు మాడ్యూళ్లను అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 15న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ, సీఎం ప్రకటన చేసి 12 రోజులు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ధరణి వ్యవస్థను పర్యవేక్షిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ కొత్త మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో రైతుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆ రంగానికి చెందినవారు అంటున్నారు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు
ధరణి సమస్యలను పరిష్కరించాలని, తమ భూముల వివరాలను రికార్డుల్లో సరిదిద్దాలని కోరుతూ బాధిత రైతులు నిత్యం తహసీల్దార్లు, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, పొరపాట్ల సవరణకు అవసరమైన ఆప్షన్లు ధరణిలో లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వాటిని సవరించాలంటే కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి రావాలని, అప్పటిదాకా తామేమీ చేయలేమని తహసీల్దార్లు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఇదే విషయం చెబుతూ చేతులెత్తేస్తున్నారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే ధరణి పోర్టల్‌లో మరో 18 మాడ్యూళ్లను అమల్లోకి తీసుకురావాలని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ధరణి పోర్టల్‌లో 42 మాడ్యూళ్లకుగాను ప్రస్తుతం 24 మాడ్యూళ్ల ద్వారా వివిధ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అయితే మరో ఏడు మాడ్యూళ్లను అందుబాటులోకి తెస్తే 90-95 శాతం రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది.
ఉపసంఘం సూచించిన 7 మాడ్యూల్స్ ఇవే..
1. ఎక్స్టెన్షన్: ఈ మాడ్యూల్ ద్వారా భూ విస్తీర్ణం ఎక్కువ నమోదైనా, తక్కువ నమోదైనా సరిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది. మిస్సింగ్ సర్వే నెంబర్లను కూడా సవరించేందుకు వీలు లభిస్తుంది.
2. ప్రోహిబిటెడ్ ప్రాపర్టీ(22ఎ): పట్టా భూమి.. ప్రభుత్వ భూమిగా, ఎండోమెంట్, భూదాన్, వక్ఫ్ బోర్డు భూముల జాబితాలో నమోదైతే ఈ మాడ్యూల్ ద్వారా సవరించే అవకాశం లభిస్తుంది.
3. పార్టు-బి: ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది రైతుల మధ్య వివాదం తలెత్తిన భూములను పార్టు-బిలో చేర్చారు. ఇటువంటి భూములతోపాటు కోర్టుపరమైన వివాదాలను కూడా ఈ మాడ్యూల్ ద్వారా పరిష్కరించవచ్చు.
4. పీవోబీ: పట్టా భూములు ప్రొహిబిటెడ్ జాబితాలో నమోదైతే వాటిని తొలగించేందుకు అవకాశం కల్పించనున్నారు.
5.పెండింగ్ మ్యుటేషన్లు: ధరణికి ముందు రిజిస్ర్టేషన్ పూర్తయి మ్యుటేషన్ జరగని వారికి హక్కులు కల్పించే అవకాశం ఈ మాడ్యూల్ వల్ల ఏర్పడుతుంది.
6. ఎక్స్‌సర్వీ్‌సమెన్, స్వాతంత్య్ర సమరయోధులు: ఎక్స్‌సర్వీ్‌సమెన్, స్వాతంత్య్ర సమరయోధులకు గతంలో ఇచ్చిన భూములకు ఎన్వోసీలు, వంశపారంపరంగా హక్కులు కల్పించడం వంటి సమస్యలను దీని ద్వారా పరిష్కరించనున్నారు.
7. నేచర్ ఆఫ్ ల్యాండ్: పట్టా భూములు ప్రభుత్వ భూమిగా నమోదు కావడం. ఇళ్లు, నాలా కింద పేర్కొనడంతో వాటిని అమ్ముకునేందుకు వీలులేకుండా పోయింది. వీటికి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ కాకపోవడంతో రైతుబంధు, తదితర పథకాలు అందడంలేదు. వీటిని సరిచేసేందుకు ఈ మాడ్యూల్ ఉపయోగపడనుంది.