పోడు భూముల కత.. మళ్లీ మొదటికి!

ABN , First Publish Date - 2022-07-18T08:33:44+05:30 IST

పోడు భూముల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు ఎన్నో గొడవలు జరిగాక.. ఇప్పుడు ఆ

పోడు భూముల కత.. మళ్లీ మొదటికి!

హక్కు పత్రాల పంపిణీపై చేతులెత్తేసిన రాష్ట్ర సర్కారు..

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విశ్వసించిన ప్రజలు

ఇప్పుడు కేంద్రం పరిధిలోని అంశం అనడంపై ఆగ్రహం..

సీఎం హామీ ఏమైనట్లు? అంటూ నిలదీత


హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు ఎన్నో గొడవలు జరిగాక.. ఇప్పుడు ఆ వ్యవహారం కేంద్రం పరిధిలోనిది అని సర్కారు ప్రకటించడంపై బాధిత రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేంద్రం పరిధిలోని అంశమే అయితే.. 2021లో పోడు రైతుల నుంచి దరఖాస్తులు ఎందుకు ఆహ్వానించినట్లు? పోడు భూముల హక్కు పత్రాలు ఇచ్చే ప్రక్రియ కేంద్రం పరిధిలోని అంశమని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి  తెలియదా? దీనిపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీకి విలువ లేదా? అని వారు నిలదీస్తున్నారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీ ఉత్తదేనా? ఇన్నాళ్లు పోడు భూముల వ్యవహారాంపై మభ్యపెట్టే ప్రయత్నం చేశారా? అని మండిపడుతున్నారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోడు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2019లో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జిల్లాల వారిగా పర్యటించి అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని మరీ పోడు సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.


కేంద్రమే లక్ష్యంగా..

కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. పలు అంశాలపై ఇరు ప్రభుత్వాల మధ్య ఆరోపణలు, విమర్శలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పోడుభూముల అంశం కూడా తెరపైకి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వ చట్ట సవరణతోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 2006 అటవీ హక్కుల చట్టంలో ఉన్న కటాఫ్‌ తేదీని (2005 డిసెంబరు 13) మార్చాలి. అప్పుడే గిరిజనులకు పోడు భూములపై హక్కు లు దక్కుతాయి. అలాగే.. గిరిజనేతరులు 1930 నుంచి పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నట్టు సాక్ష్యాధారాలు చూపించాలన్న కఠిన నిబంధన మార్చాలి. క్లిష్టమైన ఈ నిబంధన కారణంగా ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలోనూ గిరిజనేతరులకు పెద్దగా భూమి హక్కులు దక్కలేదు. ఈ రెండింటిపై రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేస్తున్నా ఆ చట్టాన్ని మార్చేది లేదని కేంద్రం తేల్చి చెబుతోంది. దీంతో.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వడంలో కేంద్రం సహకరించట్లేదనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే రాష్ట్ర సర్కారు ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ అంశం కేంద్రం పరిధిలోదని ప్రకటన చేసినట్లు సమాచారం.


దరఖాస్తులు.. 3.95 లక్షలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా.. 2008లో 96,600మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్న కొంతమందికి కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం భూ హక్కులు దక్కకపోవడంతో పాటు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో 2021 సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పోడురైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. వాటి ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలు,  37 మండలాలు, 3041 గ్రామ పంచాయతీల పరిధిలో.. 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో 3,95,000  మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. వారిలో 62 శాతం గిరిజనులు, 38 శాతం గిరిజనేతరులు ఉన్నారు.


సుప్రీం కోర్టు ఏమన్నదంటే.?

పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో 2005 తరువాత అటవీభూమిని ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు నాలుగేళ్ల కిందటే తీర్పును వెలువరించింది. ఈ ఆదేశాలను అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారం తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని భావించిన బీజేపీ ప్రభుత్వం ఈ తీర్పుపై స్టే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉంది.

Updated Date - 2022-07-18T08:33:44+05:30 IST