ఎస్సీ, ఎస్టీ నిధిపై.. ఏదీ చిత్తశుద్ధి..?

ABN , First Publish Date - 2022-03-05T07:15:02+05:30 IST

‘‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి

ఎస్సీ, ఎస్టీ నిధిపై.. ఏదీ చిత్తశుద్ధి..?

  • ప్రత్యేక అభివృద్ధి నిధులపై పర్యవేక్షణ కరువు
  • ప్రభుత్వానికి చేరిన 2022-23 బడ్జెట్‌ ప్రతిపాదనలు


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధి(స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌) ఏర్పాటు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.55,438.89 కోట్లు కేటాయించింది’’.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఏడాది జూన్‌ 27న ప్రగతి భవన్‌లో తొలిసారిగా అఖిలపక్ష నేతలతో సమావేశమైన సందర్భంగా సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయమిది. అయితే ఏటా ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ను ఘనంగా కేటాయిస్తున్నా.. నిధుల వినియోగం మాత్రం దైన్యంగా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి.


ప్రత్యేక అభివృద్ధి నిధిపై మంత్రులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు, లక్ష్యం దారి తప్పుతున్నాయి. మరికొద్ది రోజుల్లో 2021-22 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా.. ఏడాదిపాటు పట్టింపులేకుండా ఉన్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పుడు హడావిడిగా కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎస్సీ స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ సమావేశం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన నిర్వహించగా, తాజాగా గురువారం ఎస్టీ స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌కు సంబంధించి నోడల్‌ ఏజెన్సీ సమావేశం మంత్రి సత్యవతి రాథోడ్‌ నేతృత్వంలో జరిగింది. నిబంధనల మేరకు గరిష్ఠంగా ఆరు నెలలకోసారి నోడల్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఎస్‌డీఎఫ్‌ పర్యవేక్షణ సమావేశాలు జరగాలి.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 26 రోజుల్లో ముగియనుండగా.. అభివృద్ధి పనులు, ఖర్చుల లెక్కలు లేకుండానే 2022-23 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ అంచనాలు ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత హడావిడిగా సమావేశాలు నిర్వహించడం పట్ల దళిత సంఘాల నుంచి విమర్శలు వస్తున్నాయి. స్పెషల్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ నిధులు ప్రభుత్వం చేపట్టిన ఇతర ప్రతిష్ఠాత్మక పథకాలకు దారిమళ్లుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 


Updated Date - 2022-03-05T07:15:02+05:30 IST