చినజీయర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి

ABN , First Publish Date - 2022-03-18T09:07:56+05:30 IST

మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఉద్దేశించి చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి.

చినజీయర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి

  • మేడారం పూజారుల ఫిర్యాదు
  • రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన నిరసనలు 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఉద్దేశించి చినజీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చినజీయర్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. చినజీయర్‌ స్వామి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ములు గు జిల్లావ్యాప్తంగా నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు రెండో రోజూ కొనసాగాయి. మేడారం పూజారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ములుగు ఏఎస్పీ సుధీర్‌కు ఫిర్యాదు చేశారు. చినజీయర్‌పై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడ్వా యి, మంగపేట మండలాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చినజీయర్‌ స్వామి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.  

 

చినజీయర్‌ మేడారం రావాలి: సీతక్క

సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చినజీయర్‌ మేడారం వచ్చి ఇక్కడ జరుగుతున్న చెడు ఏమిటో నిరూపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. గురువారం ఆమె సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శిం చి పూజలు చేశారు. వనదేవతల ప్రతిష్ఠను మసకబార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన మరుసటిరోజు నుంచే మేడారంలో మహాజాతర ప్రారంభమైందని.. ముచ్చింతల్‌కు వెళ్లిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మేడారంమాత్రం రాలేకపోయారని విమర్శించారు. కాగా, చినజీయర్‌ స్వామి క్షమాపణలు చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. తన వ్యాఖ్యలపై చినజీయర్‌ స్వామి స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. 


నేడు చినజీయర్‌ దిష్టిబొమ్మల దహనం

చినజీయర్‌ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దహనం చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌), తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్‌), కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌), తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితులు గురువారం పిలుపునిచ్చాయి. చినజీయర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం, ఐద్వా, బీఎస్పీ గిరిజన విభాగం, యూత్‌కాంగ్రెస్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్‌) పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. చినజీయర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ యువజన కాంగ్రె స్‌ నాయకులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఓయూ ఆర్ట్స్‌ కాలేజీలో గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు చినజీయర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

Updated Date - 2022-03-18T09:07:56+05:30 IST