నువ్వే కారణమని చెప్పి.. సూసైడ్‌ చేసుకుంటా..!

ABN , First Publish Date - 2022-07-14T09:21:56+05:30 IST

‘‘తలుపు తీయి..! లేకుంటే నువ్వే కారణమని చెబుతూ.. ఇదే బిల్డింగ్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకుంటా.

నువ్వే కారణమని చెప్పి.. సూసైడ్‌ చేసుకుంటా..!

  • నేను చనిపోతే నువ్వు అరెస్టవుతావు..
  • ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బెదిరింపు తీరిది


 హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘‘తలుపు తీయి..! లేకుంటే నువ్వే కారణమని చెబుతూ.. ఇదే బిల్డింగ్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకుంటా. నేను చనిపోతే.. నువ్వు అరెస్టవుతావు’’.. ఇదీ కీచక ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు బాధిత వివాహితను వంచించిన తీరు. ఈ మాటలు వినగానే.. బాధితురాలు కంగారుపడి తలుపు తీశార ని.. నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వనస్థలిపురం పోలీసులు నాగేశ్వర్‌రావు రిమాండ్‌ రి పోర్టులో స్పష్టం చేశారు. ఆ రిపోర్టును ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. అందులో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ‘‘2018లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు.. బాధితురాలి భర్తను క్రెడిట్‌ కార్డుల మోసం కేసులో అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో బాధితురాలితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆమెపై అప్పటి నుంచే కన్నేశాడు. ఎలాగైన లైంగిక వాంఛ తీర్చుకోవాలని భావించాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన బాధితురాలి భర్తను తన ఫాంహౌజ్‌లో పనిచేయాలని చెప్పా డు. అందుకు నెలకు రూ.10 వేలు చెల్లించాడు. అలా బాధితురాలికి దగ్గరయ్యేందుకు నాగేశ్వరరావు ప్రయత్నించాడు. భర్త ఇంట్లో లేని సమయంలో వనస్థలిపురంలోని ఇంటికి వెళ్లి.. ఆమెను బలవంతంగా ఒకసారి బయటకు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో.. అతడు నాగేశ్వరరావును నిలదీశాడు. కోపోద్రిక్తుడైన నాగేశ్వరరావు.. బాధితురాలి భర్తను సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లి.. తీవ్రంగా కొట్టాడు. అతడితో గంజాయి ప్యాకెట్లతో  ఫొటోలు తీశాడు. 


ఈ విషయం బయటకు చేప్తే గంజాయి కేసులో అరెస్టు చేస్తానని బెదిరించాడు’’ అని రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించారు. ఈ నెల 7న నాగేశ్వర్‌రావు బాధితురాలికి వాట్సాప్‌ కాల్‌ చేశాడని, లైంగికవాంఛ తీర్చాలని డిమాండ్‌ చేశాడని పేర్కొన్నారు. ‘‘నీ భర్త నల్లగొండలో ఉన్నాడు. నేను మీ ఇంటికి వస్తున్నా..’’ అంటూ వనస్థలిపురం వెళ్లినట్లు వివరించారు. సూసైడ్‌ బూచీతో నాగేశ్వరరావు ఆ ఇంట్లోకి చొరబడ్డాడని, కణతపై తుపాకీతో బెదిరించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రిమాండ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత 20 నిమిషాలకు బాధితురాలి భర్త వచ్చాడని.. రెడ్‌హ్యాండెడ్‌గా నాగేశ్వరరావును పట్టుకునేందుకు కిటికీ గ్రిల్స్‌ తొలగించి, లోనికి వెళ్లాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ‘‘నాగేశ్వరరావుపై బాధితురాలి భర్త కర్రతో దాడి చేయగా.. కోపోద్రిక్తుడైన ఇన్‌స్పెక్టర్‌  తుపాకీ గురిపెట్టి బెదిరించాడు. హైదరాబాద్‌ విడిచివెళ్లాలంటూ ఆ దంపతులకు హుకుం జారీ చేశాడు. వారిద్దరినీ సొంతూరిలో దిగబెడతానంటూ తనకారు తీశాడు. బాధితురాలి భర్తను డ్రైవింగ్‌ చేయాలని చెప్పాడు. అతా ఆ కారు ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్దకు రాగానే అదుపుతప్పి పల్టీ కొట్టింది. యాక్సిడెంట్‌ కేసు విషయంలోనూ తనను తాను ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా చెప్పుకొన్నాడే తప్ప.. మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ అని వెల్లడించలేదు’’ అని రి మాండ్‌ రిపోర్ట్‌ వివరిస్తోంది.  తనపై అత్యాచారం కేసు నమోదైందని తెలుసుకుని బెంగళూరుకు పరారరైన నాగేశ్వరరావు.. నగరానికి తిరిగి వచ్చి.. బెయిల్‌కోసం ప్రయత్నించి, విఫలమయ్యాడు. ఆ క్రమలో తన ఇంటికి వెళ్తుండగా.. ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారని రిమాండ్‌ రిపోర్ట్‌ పేర్కొంటోంది.


జైలులో సస్పెన్షన్‌ ఆర్డర్‌

చర్లపల్లి జైలులో ఖైదీ నంబర్‌ 2001 పేరుతో అండర్‌ ట్రయలర్‌గా ఉన్న నాగేశ్వరరావు తన సస్పెన్షన్‌ ఆర్డర్‌ను సెల్‌లోనే అందుకున్నారు. ఈ నెల 10న నాగేశ్వరరావు అరెస్టు.. ఆ తర్వాత పోలీసు విచారణ, 11న మెజిస్ట్రేట్‌ ముందు హాజరు.. అటు నుంచి చర్లపల్లి జైలుకు తరలింపు తెలిసిందే. 

Updated Date - 2022-07-14T09:21:56+05:30 IST