తెలుగు కవులకు సాహిత్య అకాడమీ అవార్డులు

ABN , First Publish Date - 2022-08-25T09:51:49+05:30 IST

తెలుగు కవులకు సాహిత్య అకాడమీ అవార్డులు

తెలుగు కవులకు సాహిత్య అకాడమీ అవార్డులు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, సిరిసిల్ల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత పత్తిపాక మోహన్‌కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  కవి, ఉపాధ్యాయుడు పళ్ళిపట్టు నాగరాజుకు యువ పురస్కారం దక్కింది.  కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు బుధవారం ఈ వివరాలను ప్రకటించారు. 


శ్రమ జీవికి దక్కిన గౌరవం   

చిత్తూరు జిల్లాకు చెందిన కవి, ఉపాధ్యాయుడు పళ్ళిపట్టు నాగరాజు రాసిన ‘యాలై పూడిసింది’ కవితా సంపుటి యువ పురస్కారానికి ఎంపికయింది. ఆయనకు త్వరలోనే తామ్రపతకం, జ్ఞాపికతో పాటు రూ.50,000 నగదు బహుమతిని బహూకరించనున్నా రు. తెలుగు నుంచి ఆరు కవితా సంపుటిలు, మూడు కథానికా సంపుటిలు, ఒక నవల, మరొక సాహిత్య విమర్శ.. మొత్తం11 గ్రంథాలు పోటీపడగా, అందులో నాగరాజు రచన ఎంపికయింది.  ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, డా. పెన్నా శివరామకృష్ణలతో కూడిన నిపుణుల బృందం దీనిని ఎంపిక చేసింది.  నాగరాజు(35) సొంతూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజగోపాలపురం. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు పూర్తిచేశారు. ప్రస్తుతం పీహెచ్‌డీ పరిశోధన చేస్తున్నారు. రైతు కూలీ కుటుంబంలో పుట్టిన నాగరాజు వ్యవసాయ పనులు చేసుకుంటూ, విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రస్తుతం కుప్పం దగ్గర 64పెద్దూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ...‘‘నేను అనుభవించిన దారిద్య్రం, వివక్ష తదితర అంశాలనే నా కవిత్వంలో ప్రతిబింబిస్తుంటాను. ఈ పురస్కారం బహుజన, దళిత శ్రామిక కుటుంబల అనుభవాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. 

సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్‌ రచించిన బాలల తాత బాపూజీ అన్న గేయ సంపుటానికి పురస్కారం లభించింది. నవంబర్‌ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అవార్డు అందిస్తారు. ప్రముఖ రచయితలు బెలగం భీమేశ్వరరావు, ఎన్‌ , గోపి, చొక్కాపు వెంకటరమణలతో కూడిన న్యాయనిర్ణేతల బృందం ఏకగ్రీవంగా తెలుగులో పురస్కారాన్ని సిఫారసు చేసింది.

Updated Date - 2022-08-25T09:51:49+05:30 IST