పోయిరావమ్మా.. బతుకమ్మా...

ABN , First Publish Date - 2022-10-04T06:19:29+05:30 IST

బతుకమ్మ పర్వంలో ప్రధాన ఘట్టమైన సద్దుల పండుగను సోమవారం మహిళలు సంబరంగా జరుపుకున్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆడిన మహిళలు చివరి రోజున సద్దుల రోజు తీరొక్క పూలతో పెద్ద సైజుల్లో బతుకమ్మలను పేర్చారు.

పోయిరావమ్మా.. బతుకమ్మా...

అంబరాన్నంటిన సద్దుల సంబురం
గౌరమ్మను కొలిచి పరవశించిన మహిళా లోకం
గుబాళించిన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు
ఆటపాటలతో హోరెత్తిన చెరువు గట్లు
కిక్కిరిసి పోయిన పద్మాక్షి గుట్టల ప్రాంతం
ముగిసిన తొమ్మిది రోజుల వేడుకలు


హనుమకొండ కల్చరల్‌, అక్టోబరు 3:
బతుకమ్మ పర్వంలో ప్రధాన ఘట్టమైన సద్దుల పండుగను సోమవారం మహిళలు సంబరంగా జరుపుకున్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆడిన మహిళలు చివరి రోజున సద్దుల రోజు తీరొక్క పూలతో పెద్ద  సైజుల్లో బతుకమ్మలను పేర్చారు.  పైన పసుపుతో తయారు చేసిన గౌరమ్మనుప్రతిష్టించి సాయంత్రం వేళ నిమజ్జన స్థలాలకు తీసుకువచ్చారు. చీకటి పడేవరకు ఆడిపాడారు. భక్తిప్రపత్తులతో నీరాజనాలు పలికారు. తమ కష్టాలను దూరం చేసి సుఖశాంతులను ఇవ్వాలని కోరుతూ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ఒకరికొకరు వాయినాలను ఇచ్చి పుచ్చుకున్నారు.  నైవేద్యాలను పంచుకున్నారు.

సద్దుల బతుకమ్మ వేళ పట్టుచీరలు ధరించి ముస్తాబైన అతివలు... వయోబేధం లేకుండా చేసిన సందడితో సద్దుల బతుకమ్మ కొత్తశోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ్త ప్రతీక అయిన సద్దుల పర్వం మహిళా లోకాన్ని ఆనందపరవశంలో ముంచెత్తింది.  పాటలు పాడుతూ, మధ్య మధ్య చిన్ననాటి నేస్తాలతో కబుర్లు చెప్పుకుంటూ మహిళలు ఆనందంగా గడిపారు.   

ఉదయయే మహిళలు బతుకమ్మలను వెదురు సిబ్బిలు, పళ్ళాల్లో కళాత్మకంగా పేర్చారు. ప్రతీ ఇంటిలో తల్లి, పిల్ల పేరుతో రెండు బతుకమ్మలను పేర్చారు. వీటిని పూజా మందిరంలో  ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు ధరించి బతుకమ్మలను తీసుకొని నిమజ్జన స్థలాలకు బయలు దేరారు.

జనసంద్రమైన పద్మాక్షి గుండం
హనుమకొండలోని పద్మాక్షి గుండం వద్ద సద్దుల బతుకమ్మ వేడుక భారీ ఎత్తున జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచే మహిళలు బతుకమ్మలను చేబూని తరలిరావడం కనిపించింది.  హనుమకొండ చౌరస్తా ప్రాంతమంతా వేలాది మంది మహిళలతో సప్తవర్ణ శోభితమైంది. అన్ని దారులు పద్మాక్షి గుండం ప్రాంతానికి చేరుకోవడంతో వినూత్న శోభ వెల్లివిరిసింది. 50 వేల మందికిపైగా మహిళలు ఇక్కడ పాల్గొన్నారు. పద్మాక్షి గుండం పరిసర ప్రాంతాలన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోయాయి.

ఇంకా వడ్డెపల్లి చెరువు కట్ట, బంధం చెరువు, సోమిడి చెరువు, హసన్‌పర్తిలోని పెద్ద చెరువు, హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, భద్రకాళి ఆలయ ప్రాంగణం, మడికొండ, రాంపూర్‌ తదితర ప్రాంతాలు సద్దుల వేడుకకు వేదికలుగా నిలిచాయి. నగరంలో పలు కాలనీలతో పాటు, అపార్టుమెంట్లలోనూ బతుకమ్మలను ఆడారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. మండల కేంద్రాలు, ఊరుశివార్లలోని చెరువు గట్లపైన మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను ఆడారు.

విస్తృత ఏర్పాట్లు
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పద్మాక్షి గుండంతో పాటు నగరంలోని 66 డివిజన్లలో బల్దియా విస్తృత ఏర్పాట్ల చేసింది.  బతుకమ్మ ఆట స్థలాలను చదునుచేసి విద్యుత్‌దీపాలను అమర్చారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లలోని గుంతలను పూడ్చివేశారు. బతుకమ్మ విగ్రహాలకు రంగులు వేశారు. తాగునీటి సరఫరా కోసం  వాటర్‌ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ సాయంత్రం దర్గా రోడ్డులోని బంధం చెరువు దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మండలాల్లో...

భీమదేవరపల్లి మండలంలో భీమదేవరపల్లి, ముల్కనూరు, గట్లనర్సింగాపూర్‌, కొత్తకొండ, వంగర, మల్లారం, కొత్తపెల్లి, రత్నగిరి గ్రామాల్లో శివార్లలో గల చెరువుల్లో బతుకమ్మలను ఆడి సమీపం చెరువుల్లో నిమజ్జనం చేశారు. కమలాపూర్‌ మండల కేంద్రం పాటు ఉప్పల్‌  కమలాపూర్‌ పెద్ద చెరువు, శంభునిపెల్లి, అంబాల వాగులు, మరిపెల్లి గూడెం చెరువు వద్ద సద్దుల బతుమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

ఐనవోలు మండలంలో ఐనవోలు ఊటచెరువు, నందనం ఆకేరువాగు, పంథిని ఊరచెరువు, కొండపర్తి ఊర చెరువు వద్ద బతుకమ్మ ఆడ ఆడారు. ఎల్కతుర్తి మండలంలోని దండెపల్లి, ఎల్కతుర్తి, సూరారం, పెంచికల్‌ పేట, దామెర, కేశవాపూర్‌, తిమ్మాపూర్‌, బావుపేట, చింతలపల్లి, గోపాల్‌పూర్‌, జీలుగుల, జగన్నాధ్‌పూర్‌ గ్రామాల్లోని చెరువుల వద్ద, పరకాల పట్టణంలో దామెర చెరువు, నాగారంలో నల్లచెరువు, మల్లక్కపేటలో పెద్దచెరువు, నడికుడ మండలంలో వరికోలు, చెర్లపల్లి, నార్లాపూర్‌, కౌకొండ, కంఠాత్మకూర్‌, రామక్రిష్ణాపూర్‌, వెంకటేశ్వర్లపల్లి, ధర్మారం, సర్వాపూర్‌, ముస్త్యాలపల్లి, చౌటుపర్తి, నర్సక్కపల్లి తదితర గ్రామాల్లో చెరువుల వద్ద సద్దుల బతుకమ్మలను ఘనంగా ఆడారు. శాయంపేట, ఆత్మకూరు, దామెర, ధర్మసాగర్‌, వేలేరు మండలాల పరిధిలోని గ్రామాల్లోని చెరువులు, కుంటలు, కాల్వల వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి.

Read more