బలి కోరిన ఎర్రమట్టి గని?
ABN , First Publish Date - 2022-08-04T10:49:34+05:30 IST
ములుగు జిల్లాలో న్యాయవాది మల్లారెడ్డి హత్యకేసు ఎర్రమట్టి గనుల చుట్టే తిరుగుతోంది. వందల ఎకరాలు.
- న్యాయవాది హత్యకు అదే కారణమా!
- మైనింగ్ దందాలో రాజకీయ నేతలు
- అనధికారికంగా వెయ్యి ఎకరాలకు పైనే
- నిత్యం ఫిర్యాదులు.. అధికారుల రాజీలు!!
ములుగు, ఆగస్టు 3: ములుగు జిల్లాలో న్యాయవాది మల్లారెడ్డి హత్యకేసు ఎర్రమట్టి గనుల చుట్టే తిరుగుతోంది. వందల ఎకరాలు.. రూ.కోట్లలో వ్యాపారం జరిగే ఈ గనుల్లో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. మల్లారెడ్డికి కూడా ఎర్రమట్టి క్వారీలున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి మైనింగ్ మాఫియాపై పడింది..! ములుగు మండలం మల్లంపల్లిలో మూడున్నర దశాబ్దాలుగా మైనింగ్ జరుగుతోంది. ఇక్కడ తొలినాళ్లలో సిమెంట్ తయారీకి ఉపయోగపడే లాటరైట్ లభించేది. ఆ తర్వాత డోలమైట్, బాక్సైట్, ఇనుప ఖనిజం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీంతో.. మైనింగ్ దందా క్రమంగా విస్తరించింది. మల్లంపల్లితోపాటు భూపాల్‌నగర్, రాంచంద్రాపురం, కొడిశలకుంట ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో ముడి ఖనిజం తవ్వకాలు జరుగుతున్నాయి. మైనింగ్, రెవెన్యూ అనుమతి పొందిన 54 కంపెనీలు 360 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నాయి. అనధికారికంగా సుమారు వెయ్యి ఎకరాల్లో మైనింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనుమతి పొందిన విస్తీర్ణం కంటే అదనంగా మైనింగ్ చేస్తున్నారు. భూమి ఏదైనా సరే అనువుగా ఉంటే చాలు.. కబ్జా చేసేస్తున్నారు. గతంలో ములుగులో పనిచేసిన పలువురు రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకొని పట్టాలు జారీ చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో.. ఒక్కో వ్యాపారి చేతుల్లో వందల ఎకరాలున్నాయి.
రాజకీయ రంగ ప్రవేశం
లాభదాయకమైన వ్యాపారం కావడంతో.. మైనింగ్ దందాలో పలువురు రాజకీయ నాయకులు ప్రవేశించారు. తెలుగురాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు భూములు కొనుగోలు చేసి మైనింగ్ చేస్తుండగా.. చాలా మంది నేతలు అడ్డదారుల్లో ఎంట్రీ ఇచ్చారు. తమ పలుకుబడిని ఉపయోగించి అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో ఇక్కడ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వివిధ ఖనిజాల మైనింగ్‌కు వేర్వేరు అనుమతులు తీసుకోవాల్సి ఉండగా.. అతితక్కువ రాయల్టీ ఉన్న లాటరైట్ పేరుతో పర్మిషన్‌లు తీసుకుంటున్నారు. అదే అనుమతితో.. ఎక్కువ ధర కలిగిన డోలమైట్, బాక్సైట్‌ను కూడా తరలిస్తున్నారు. ఒకట్రెండు కంపెనీలకే ఇనుప ఖనిజం మైనింగ్‌కు తాత్కాలిక అనుమతులు ఉండేవి. వాటి గడువు ముగిసినప్పటికీ గుట్టుగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం.
కేసులు, పంచాయితీలు..!
ఎర్రమట్టి క్వారీల నిర్వహణలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. భూమి హద్దుల విషయంలో యజమానుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ములుగు పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం షరా మామూలైంది. సర్వే, యాజమాన్య హక్కుల కోసం క్వారీ నిర్వాహకులు, గుమస్తాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. ఈ వివాదాలను అధికారులు ‘క్యాష్’ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సెటెల్మెంట్ల(రాజీలు) పేరుతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనేది బహిరంగ రహస్యమే..! అందుకే ములుగులో పోస్టింగ్ అంటే.. రెవెన్యూ, పోలీసు వర్గాల్లో అమితాసక్తి నెలకొంటుంది. అధికారులు వివాదాన్ని ఆదిలోనే పరిష్కరించకుండా.. డబ్బు ఆశ కోసం సాగదీస్తుండటంతో ఇరువర్గాల మధ్య వైరం పెరిగి.. కక్షసాధింపులకు దారితీస్తోంది. వీటిపై పోలీ్‌సస్టేషన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హత్యకు గురైన న్యాయవాది మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరున మల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో 113 ఎకరాల భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 30 ఎకరాల్లో ఐదు క్వారీలను నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డిపై గతంలో రౌడీషీట్ ఉంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ దివంగత నేత ఒకరి ఒత్తిడితో పోలీసులు రౌడీషీట్ తెరిచినట్టు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి.. ఆ రౌడీషీట్‌ను రద్దుచేయించారు. గత ఏడాది డిసెంబరులో పక్క జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడిపై భూఆక్రమణ కేసు నమోదైంది.
హత్యపై అనుమానాలెన్నో..
న్యాయవాది మల్లారెడ్డి హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో వారు మైనింగ్ వ్యాపారులను టార్గెట్ చేశారనే ఆరోపణలున్నాయి. అక్రమంగా ఖనిజ సంపదను దోచుకుంటున్న వారంతా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరికలతో గతంలో కరపత్రాలు విడుదలయ్యేవి. క్వారీల వద్ద యంత్రాలు, వాహనాలకు నిప్పుపెట్టి బ్యానర్లు కట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మంగళవారం పలువురు మైనింగ్ నిర్వాహకులు, గుమస్తాలను విచారించారు. బుధవారం కూడా విచారణ కొనసాగింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. మామిడితోట, రిసార్టు, భారీ భవనం ఉన్న ఓ స్థల యజమాని, మైనింగ్ దందాలో ఆరితేరిన ఓ సీనియర్ వ్యాపారితో తలెత్తిన వివాదమే ఈ హత్యకు దారితీసినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లల తెలుస్తోంది. మరోవైపు మల్లారెడ్డి వాదిస్తున్న వివాదాస్పద కేసులపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.