RTC buses: పల్లెల్లోకి మళ్లీ బస్సులు

ABN , First Publish Date - 2022-10-31T03:15:28+05:30 IST

మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకు గతంలో రద్దయిన ఆర్టీసీ బస్సులు మళ్లీ నడుస్తున్నాయి.

RTC buses: పల్లెల్లోకి మళ్లీ బస్సులు
RTC buses

గతంలో రద్దయిన గ్రామాలకు రాక

ఉప ఎన్నిక రావడంతో పునరుద్ధరణ

నల్లగొండ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాలకు గతంలో రద్దయిన ఆర్టీసీ బస్సులు మళ్లీ నడుస్తున్నాయి. ఎప్పుడో దెబ్బతిని మట్టి కొట్టుకుపోయిన రోడ్లకు మళ్లీ మరమ్మతులు జరుగుతున్నాయి. ఎవరిపైనైనా పాత కేసులు ఉంటే మాఫీ అవుతున్నాయి. విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు అందుతున్నాయి. ప్రచారంలో పాల్గొనే కూలీలకు కూలి రూ.1500కు పెరిగింది. చిన్నపాటి నాయకుడైనా.. కండువా మార్చుకుంటే రూ.10 వేలు, రూ.20 వేల దాకా అందుతున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో చోటుచేసుకుసుంటున్న పరిణామాలివి. సాధారణంగా ఒక ప్రాంతానికి ఆర్టీసీ బస్సు నడపాలంటే కనీసం 20ు ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) ఉండాలి. కానీ, నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు ఓఆర్‌ 20ుకూడా లేకపోవడంతో గత ఏడాది అధికారులు పలు బస్సులను రద్దు చేశారు. అయితే ప్రస్తుతం ఉప ఎన్నిక రావడంతో ప్రజలు తమ వద్దకు వచ్చే ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో బస్సులు చకచకా పల్లెల్లోకి వస్తున్నాయి.

మునుగోడు మండలం కమ్మగూడెం నుంచి నేరుగా హైదరాబాద్‌కు గతంలో బస్సు నడిచేది. ఈ బస్సును ఏడాది క్రితం రద్దు చేశారు. ఈ గ్రామంలో క్రిస్టియన్‌ మైనార్టీ ఓటర్లు ఎక్కువ. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజీవ్‌సాగర్‌ ప్రచారానికి వెళ్లగా స్థానికులు ఫిర్యా దు చేశారు. దీంతో ఆయన ఆర్టీసీ అధికారులకు ఫోన్‌ చేయడంతో బస్సు రాకపోకలు వెంటనే ప్రారంభమయ్యాయి. ఇదే తరహాలో నల్లగొండ నుంచి మునుగోడు మండలం కొరటికల్‌, నల్లగొండ నుంచి మాల్‌, హైదరాబాద్‌-విజయవాడ రహదారికి అరకిలోమీటరు దూరంలో ఉన్న దండుమల్కాపురానికి గతంలో అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వచ్చేవి. ప్రస్తుతం ఒక్క బస్సే వస్తుండటంతో పిల్లలు, వృద్ధులు జాతీయ రహదారి దాటాల్సి వస్తుంది. ఈ ఇబ్బందిని ప్రచారానికి వచ్చిన మంత్రులకు తెలపగా.. దిల్‌సుఖ్‌నగర్‌, హ యత్‌నగర్‌, నల్లగొండ డిపోల నుంచి మొత్తంగా 6 బస్సులు ఆ గ్రామానికి రావడం ప్రారంభమయ్యాయి. చౌటుప్పల్‌ నుంచి చిన్నకొండూర్‌, సంగెం మీదుగా భువనగిరికి నడిచే బస్సు కూడా గతంలో నిలిచిపోగా నేతల ఆదేశం మేరకు దానిని పునరుద్ధరించారు. అయితే ఉప ఎన్నిక పూర్తయ్యాక ఇవన్నీ ఆగిపోవడం ఖాయమని ఆర్టీసీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఓటర్ల తరలింపుతో ఆర్టీసీకి ఆదాయం

మునుగోడులో కోడ్‌ అమలులో ఉండటం, స్థానిక ఫంక్షన్‌ హాళ్లలో విందులు ఏర్పాటు చేయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో.. ఓటర్లను కులాల వారీగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సుమారు 40 వేల మంది ఓటర్లు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా.. మునుగోడు నుంచి తీసుకువస్తున్న వారితో కలిపి హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, కర్మన్‌ఘాట్‌, ఇబ్రహీంపట్నం, సాగర్‌ రింగురోడ్డు, హయత్‌నగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లోని ఫంక్షన్‌ హాల్‌లో కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీరి తరలింపు కోసం అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారు. 4 రోజులుగా నల్లగొండ ఆర్టీసీ రీజియన్‌ నుంచి రోజూ సుమారు 120 బస్సులు మునుగోడు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. అన్ని పార్టీలూ ఈ సమావేశాలు నిర్వహిస్తుండడంతో నాలుగు రోజుల్లో నల్లగొండ రీజియన్‌కు రూ.1.20 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఇతర ప్రాంతాలకు బస్సులను నాలుగు నుంచి ఒకటికి తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2022-10-31T03:15:29+05:30 IST