ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించడం అసాధ్యం
ABN , First Publish Date - 2022-10-17T09:52:22+05:30 IST
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన ‘చర్లగూడెం’ రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ...
- ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన..
- ఆ ఏడుగురు ఉపసంహరించుకోవాలి
- పునరావాసం కింద ఇంటి స్థలం..
- డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తాం: హరీశ్
మర్రిగూడ/హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన ‘చర్లగూడెం’ రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించడం అసాధ్యమని, మునుగోడు ఉప ఎన్నికకు భూ నిర్వాసితులు దాఖలుచేసిన నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని మంత్రి హరీ్‌షరావు అన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన శివన్నగూడెం, ఖుదాభక్షుపల్లి, రాంరెడ్డిపల్లి రైతులు ఆదివారం హైదరాబాద్‌లో హరీశ్ రావును కలిశారు. వారిలో ఉప ఎన్నికకు నామినేషన్ వేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరుతూ ఏడుగురు భూనిర్వాసితులు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసినట్లు రైతులు తెలిపారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన నిర్వాసితులు తమ సమస్యలను వివరించారు. చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములు కోల్పోవడంతో 80 మంది రైతులు ఉపాధి లేక ఇబ్బందుల పాలవుతున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని కోరారు.
దీనిపై మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వడం సాధ్యం కాదని, ఇది జీవోలో కూడా లేదన్నారు. మానవతా దృక్పథంతో భూనిర్వాసితులకు పునరావాసం కింద ఇంటి స్థలం, డబుల్ బెడ్‌రూం కట్టిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. దేశంలో ఆకలి, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. తాము గెలిస్తే.. రూ.3 వేలు ఆసరా పింఛను ఇస్తామంటూ.. మునుగోడు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఆకలి సూచిలో 101వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని.. మోదీ ప్రభుత్వం 107వ స్థానానికి దిగజార్చిందని విమర్శించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలోనే రూ.750 పింఛను ఇస్తున్న బీజేపీ.. ఇక్కడ రూ.3వేల పింఛను ఇస్తామని అబద్ధాలు చెబుతోందని, మోసం చేయడం ఆ పార్టీ నైజమని విమర్శించారు. తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్న బీజేపీకి మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు.