రోడ్డు కష్టాలు

ABN , First Publish Date - 2022-08-17T10:16:21+05:30 IST

ఊళ్లల్లో రోడ్లు వేయించి ఎన్నేళ్లయిందో! ప్రభుత్వం కొత్తగా రోడ్లు వేయించక.

రోడ్డు కష్టాలు

రోడ్డు వేయించలేక.. ప్రజలకు ముఖం చూపలేక కుమ్రంభీం జిల్లాలో టీఆర్‌ఎ్‌స ప్రజాప్రతినిధుల రాజీనామా

గుంతలమయమైన రోడ్డు మీద ఎగిరిపడ్డ బైక్‌

తన భార్య, కుమారుడికి గాయాలయ్యాయంట వరంగల్‌ జిల్లాలో పోలీసులకు యువకుడి ఫిర్యాదు

పాలమూరుజిల్లాలో సొంత డబ్బుతో రోడ్డు వేయించిన రైతు


ఆత్మకూరు, నవాబ్‌పేట, బెజ్జూరు, ఆగస్టు 16: ఊళ్లల్లో రోడ్లు వేయించి ఎన్నేళ్లయిందో! ప్రభుత్వం కొత్తగా రోడ్లు వేయించక.. ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు!! వారి ఇబ్బంది ఆగ్రహంగా మారుతుండడం సర్కారుకు, అధికార టీఆర్‌ఎ్‌సకు సంకటంగా మారుతోంది!! ఉదాహరణకు.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య రహదారితో పాటు వంతెనల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో తమను గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామంటూ.. బెజ్జూరు జడ్పీటీసీ పంద్రం పుష్పలత, మరో ఆరుగురు ప్రజాప్రతినిధులు మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కుశ్నపల్లి ఎంపీటీసీ ఆత్రం సాయన్న, సోమిని సర్పంచ్‌ ఎలాది శారద, సుశ్మీర్‌ సర్పంచ్‌ తొర్రెం శంకర్‌, మొగవెల్లి సర్పంచ్‌ ఆలం మంగళ, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ పేదం శ్రీహరి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నైతం సత్తయ్య రాజీనామా చేసినవారిలో ఉన్నారు. ప్రజా సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దీంతో తాము ప్రజల్లో తిరుగలేక పోతున్నామని వారు ఆవేదన వెలిబుచ్చారు. వీరంతా తమ రాజీనామా లేఖలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కోనప్పకు పంపించారు.  రోడ్డు, వంతెనల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు. అయితే.. ఆ రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్చించుకుందామని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. 


అధికారుల నిర్లక్ష్యం వల్లనే..

గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టని అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల తన భార్య, కుమారుడు తీవ్రగాయాలపాలయ్యారంటూ ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడేనికి చెందిన గజ్జి రమేశ్‌.. తన భార్య, కుమారులు శశాంక్‌, శమీంద్రతో కలిసి హనుమకొండలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న మధ్యాహ్నం ఆయన తన కుటుంబంతో బైక్‌పై రుద్రగూడేనికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో.. ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌ సెంటర్‌ వద్దకు వచ్చేసరికి వర్షం నీటితో నిండి ఉన్న గుంత కనిపించక వారి బైక్‌ ఒక్కసారిగా ఎగిరిపడింది. రమేశ్‌ భార్య, కుమారుడు రోడ్డుపై పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే తన భార్య, పిలల్లకు తీవ్రగాయాలయ్యాయని.. ఇందుకు కారకులైన అధికారులపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని గజ్జి రమేష్‌ ఫిర్యాదు చేశారు.


ఎన్నాళ్లని వేడుకుంటాం?

‘‘సార్‌ మా ఊరికి రహదారి వేయించండి’’ అంటూ ప్రజాప్రతినిధులను ఏళ్ల తరబడి వేడుకుంటున్నా ఉపయోగం లేకపోవడంతో.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక రైతు తన డబ్బులతో రహదారి వేయించాడు. జిల్లాలోని నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గోతులమయమైంది. కొత్త రోడ్డు వేయించాలని.. లేదా ఉన్న రోడ్డునైనా బాగుచేయించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే సీ.లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డికి వినతి పత్రాలు ఇచ్చారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్‌గౌడ్‌.. నవాబ్‌పేట మండలం కొల్లూర్‌ గేట్‌ నుంచి రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం భీమారం వరకు సుమారు 5 కి.మీ మేర రహదారి గోతులను పూడ్పించారు. ఇందుకు రూ.లక్షన్నరకు పైగా ఖర్చయింది.

Read more