రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2022-08-04T10:18:52+05:30 IST

తమపై తప్పుగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

  • మా గురించి తప్పుగా మాట్లాడారు
  • రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుతో 
  • నాకు సంబంధం లేదు: వెంకట్‌ రెడ్డి 
  • ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఫైర్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తమపై తప్పుగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కోమటిరెడ్డి కుటుంబం బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్‌ ఇలా మాట్లాడటం సరి కాదన్నారు. 34 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం రక్తం ధారబోసిన తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. నేషనల్‌ హెరాల్డ్‌ భవనంలోని యంగ్‌ ఇండియా కార్యాలయాన్ని ఈడీ సీజ్‌ చేసినందుకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పార్టీ ఏం ఆదేశిేస్త అది పాటిస్తా. పార్టీ చేస్తున్న ధర్నాలో నేను తప్ప ఎవరూ పాల్గొనలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఎందుకు రాలేదు? మాది ఉమ్మడి కుటుంబం. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్‌ రెడ్డి తప్పుగా మాట్లాడారు. రేవంత్‌ క్షమాపణ చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్‌ నిజాయితీగా ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రె్‌సలో చేరినటువంటి రేవంత్‌ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలు తనను బాఽధించాయని తెలిపారు. తాను కరడుగట్టిన కాంగ్రెస్‌ వాదినని స్పష్టం చేశారు. అయితే, రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికి ఫిర్యాదు చేయబోనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో తాను ఎన్నో పనులు చేశానని, అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చానని వివరించారు. కాగా, తన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై కూడా వెంకట్‌రెడ్డి స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ అంశంలో ఏదైనా ఉంటే రాజగోపాల్‌రెడ్డినే అడగాలని స్పష్టం చేశారు. 

Read more