7న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నా
ABN , First Publish Date - 2022-08-04T10:28:11+05:30 IST
టీఆర్‌ఎస్ పార్టీకి ఈ నెల 7న రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు.
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్ టౌన్, ఆగస్టు 3: టీఆర్‌ఎస్ పార్టీకి ఈ నెల 7న రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు. టీఆర్‌ఎ్‌సను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని, అందుకే ఆ పార్టీకి వీడుతున్నట్లు చెప్పారు. వరంగల్ ఓసిటీలోని తన నివాసంలో బుధవారం ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఓపికతో భరించామని, చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసు కేసులు పెట్టిం చే పరిస్థితులు వచ్చాయని, ఇంత జరుగుతున్నా అధిష్ఠానం నుంచి స్పందన లేదన్నారు. ఇన్నేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా.. న్యాయం జరగలేదని, గుర్తింపు లేదని, ఈ పరిణామాలను భరించడం ఇక తనవల్ల కావడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించామని, తాను స్వయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ నవ నిర్మాణ సమితి పార్టీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేశామని ప్రదీ్‌పరావు గుర్తు చేసుకున్నారు. వరంగల్ తూర్పు టికెట్టు ఇస్తామని చెప్పి రెండుసార్లు చేయిచ్చారని, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ‘ఆదరించి, మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన పార్టీలోనే చేరుదాం’ అని ప్రదీ్‌పరావు అన్నారు.
ఫలించని బుజ్జగింపులు...
ప్రదీ్‌పరావు పార్టీని వీడుతున్నట్టు వార్తలు రావడంతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్సీ సారయ్య, రహదారుల అభివృద్ధి సంస్థ చైౖర్మన్ మెట్టు శ్రీనివా్‌సను దూతలుగా ప్రదీ్‌పరావు వద్దకు పంపించారు. వారు ప్రదీ్‌పరావు నివాసానికి వెళ్లి బుజ్జగించే యత్నం చేశారు. కేసీఆర్ మీతో మాట్లాడతారని ఫోన్ కలిపి ఇచ్చినా ఆయన మాట్లాడలేదని తెలిసింది.